తెర‌ప‌డిన హోదా మీద తెర లేచే నాట‌కాలెన్నో..?

చేసుకున్న వారికి చేసుకున్నంత తిరుమ‌లేశా అని తిరుప‌తిలో వెంక‌న్న పాదాల
సాక్షిగా వెంక‌య్య తెలుగు అనువాదం ద్వారా మోడీ ఆనాడు ప్ర‌త్యేక హోదా గురించి ఆంధ్ర‌ప్ర‌దేశ్
ప్ర‌జ‌ల్లో ఆశ‌ల విత్త‌నాలు చ‌ల్లి, అవి మొల‌కెత్తి, పూలుపూచి, కాయ‌లు కాచి, ఓట్లుగా పండ‌గానే ప‌ని అయిపోయింది కాబ‌ట్టి
ఇప్పుడు ఆశ‌ల‌పై య‌మున నీళ్లు చ‌ల్లుతున్నారు. రాజ్య‌స‌భ సాక్షిగా ఆర్థిక మంత్రి
అరుణ్‌జైట్లీ ఎంతో సున్నితంగా, వివ‌రంగా అర‌టిపండు ఒలిచి పెట్టిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం
కుద‌ర‌దు అని సెల‌విచ్చారు.

చెయ్యాల్సిందంతా చేసి రెండేళ్లు అయిపోయాక కూడా ఏపీకి చేయ్యాల్సిందంతా చేస్తాం
అని ఇప్పుడు కూడా చెప్ప‌గ‌ల‌గ‌డం వెంక‌య్య‌నాయుడి మొక్క‌వోని దీక్ష‌కు ద‌ర్ప‌ణం.
దిక్కు దివాణం లేని ఏపీకి ఇవ్వ‌కూడ‌ద‌ని పాపం కేంద్రానికి ఏ కోశానా లేదు. నిబంధ‌న‌లు
వారి చేతుల‌ను క‌ట్టేస్తున్నాయి. ఏపీకి ఇస్తే మాకు దిక్కుదివాణం లేద‌ని ఖాళీ జోలె
ప‌ట్టుకొని బిక్షాట‌న‌కు చాలా రాష్ట్రాలు రెడీగా ఉన్నాయ‌ట‌. అన్ని రాష్ట్రాలు
ఒకేసారి పెరేడ్‌గా జంత‌ర్‌మంత‌ర్, క‌నాట్ ప్లేస్‌,
స‌ఫ్ధ‌ర్‌జంగ్
రోడ్ల‌లో తిరిగితే అంత‌ర్జాతీయంగా ఇండియా ప‌రువు పోతుంద‌న్న‌దే కేంద్రం బాధ‌.
అయితే ఇవన్నీ స‌న్‌రైజింగ్ స్టేట్ సీఎం బాబుకు తెలియ‌వా అంటే ఆయ‌న బాధ ఆయ‌న‌ది. అస‌లే
తెలంగాణ సీఎం ఇచ్చినా పంచ్‌కు ఎక్క‌డ భ్రీఫ్ చేసుకోవాలో తెలియ‌క చంద్ర‌బాబు హైద‌రాబాద్
వ‌దిలి దేశాలు ప‌ట్టుకొని తిరుగుతున్నారు. బాబు వ్యూహం ప్ర‌కారం బీజేపీ టీడీపీకి
మిత్ర‌ప‌క్షంగానే మిగిలి ఉండాలి. అలాగ‌ని తోక జాడించ‌కూడ‌దు. కూర్చోమంటే
కూర్చోవాలి. లేవ‌మంటే లేవాలి. అయితే బీజేపీతో బాబు శ్రేయోభిలాషులైన కొంద‌రికి
టీడీపీ శ్రేయ‌స్సు ముఖ్యమే గానీ, ప్ర‌ధాని మోడీ మాత్రం బాబు ప‌ట్టుకు దొర‌క‌డం లేదు. మోడీ మ‌న‌సులో ఏముందో కూడా
బాబు ఢిల్లీ గూఢ‌చరులు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. 

హోదా అయిదేళ్లు కాదు ప‌ది అని వెంక‌య్యనాయుడు అడిగితే, ప‌ది కాదు ప‌దిహేనేళ్లు అని చంద్ర‌బాబు
డిమాండ్ చేశారు. హోదాగోదాలో  కుస్తీలు ప‌ట్టి, బ‌స్కీలు తీసి, ప్ర‌భుత్వం మెడ‌లు వంచి, లేదా తామే త‌ల‌లు వంచి అంటూ ఇలా యోగా ప‌రిభాష‌నంతా
ఉప‌యోగించి ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన వారంద‌రూ ఏమైపోయారో..? అయినా ప్ర‌పంచం అసూయ ప‌డేలా హైద‌రాబాద్‌ను
గ్లోబ్‌లో నిలిపిన చంద్ర‌బాబు ఉండ‌గా, అన్నిటికీ అండ‌గా, పెద్ద‌న్న‌గా ఉంటాన‌న్న ప్ర‌ధాన‌మంత్రి మోడీ
ఉండ‌గా ప్ర‌త్యేకంగా ఒక హోదా రాక‌పోయినా, వారి సంక‌ల్ప బ‌లంతోనే ఎన్నో జ‌రుగుతాయి. 

హోదా రాద‌ని ముందే తెలిసిన మ‌హానుభావులు వ‌స్తోంది.. వ‌స్తోంది... అంటూ
రెండేళ్లు న‌డిపారు. ఇప్పుడు రాదంటే రాద‌ని కాదు అంటూ మ‌రో రెండేళ్లు నాట‌కాన్ని ర‌క్తి
క‌ట్టించ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఇక నెల్లూరు నుండి శ్రీ‌కాకుళం దాకా తెర‌ప‌డిన
హోదా మీద తెర‌లేచే నాట‌కాలెన్నో..?

 

Back to Top