మంచోళ్లని మంచిగా ఉండనివ్వరు..!

కావ్..కావ్..కావ్..!

మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.
హీరో కరడు గట్టిన నేరగాడు.

అయితే అతను అలా నేరగాడిగా మారడానికి  కారణమేంటో ఇంటర్వెల్  తర్వాతో ముందో ఓ ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది.చుట్టూరా ఉన్న సమాజమే హీరోని నేరస్థుణ్ని చేస్తుంది.ఈ వ్యవస్థే అతను దారి తప్పేలా చేస్తుంది.

చాలా సినిమాల్లో ఈ సీన్ చూసి ఈ సినిమా వాళ్లకి ఇంకేం ట్విస్టులు దొరకవా అని తెగ మండిపోయేది.కానీ వాస్తవంలోకి చూస్తే పాపం మన సినిమా వాళ్ల ఆలోచన చాలా ప్రాక్టికల్ అని  ఒప్పుకోక తప్పడం లేదు.

నాలో ఈ  మార్పుకు  కారణమైన అధికార పార్టీ ఎమ్మెల్యే   జే.సీ.ప్రభాకర రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

అవినీతి అంటేనే అగ్గిమీద గుగ్గిలమై అమాంతం మండిపోయే భాస్వరం వంటి వారు మన ప్రభాకర రెడ్డి.కోటి రూపాయల లంచం మీరు బలవంతంగా ఇద్దామన్నా  ఆయన తీసుకోనే తీసుకోరు.అక్రమాలన్నా..నియమ నిబంధనలను ఉల్లంఘించడమన్నా ఆయనకు ఒళ్లు మంట.చాలా మృదు స్వభావి. ఎదుటి వారి పట్ల క్షమాగుణం ఉన్న దయామయులాయన.

అంతటి సత్తెకాలపు మనిషిని కూడా ఈ సమాజం  పాడు చేసేసింది.

ఓటర్లు తనను నమ్మి గెలిపించి చట్ట సభకు పంపిస్తే..ఆ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నానే అని ప్రభాకర రెడ్డి  తెగ బాధ పడిపోతూ వచ్చారు.
ప్రజాసేవ చేసుకోవాలంటే  ఊరికే కుదరదు కదా.
దానికి బోలెడు డబ్బులు కావాలి.
డబ్బులేమన్నా చెట్టుకు కాస్తాయా?
ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.
ఇలాంటి అస్తవ్యవస్థ  పరిణామాలే ప్రభాకర రెడ్డి మనసును గాయ పర్చాయి.
ఆయనలోని మంచి మనిషి  మాయమైపోయాడు.
నియోజక వర్గాన్ని అభివృద్ది చేయడం కోసం ఇక రెండు చేతులా లంచాలు తీసుకోవాలని...ఎడా పెడా అవినీతిలో ఆరి తేరిపోవాలని ప్రభాకర రెడ్డి డిసైడ్ అయిపోయారు. ఇక రేపట్నుంచి నేను మారిపోతున్నాను...వీలైనంతగా అవినీతి ..అక్రమాలకు పాల్పడి అలా వచ్చే డబ్బుతో నా నియోజక వర్గాన్ని అభివృద్ది చేసుకుంటాను అని ప్రభాకర రెడ్డి ఓ ఇంగ్లీషు ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాంటి మొహమాటాలు..సిగ్గూ లేకుండా చెప్పేశారు.
ఆయన అంత మంచి నిర్ణయం తీసుకుని..ఎంతో నిజాయితీగా ఆ విషయాన్ని తానే అందరికీ అర్ధమయ్యేలా చెబితే..మెచ్చుకోవలసింది పోయి అందరూ ఇపుడు ప్రభాకర రెడ్డిని తిట్టిపోస్తున్నారు.
మేలెంచితే  కీడని   చిన్నప్పటి సామెత గుర్తుకొస్తోంది.
ఈ సమాజం తరపున ప్రభాకర రెడ్డికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను.
ఆయన తనకు నచ్చిన రీతిలో అక్రమాలకు పాల్పడి నియోజక వర్గాన్ని  తన ఇంటిలా అభివృద్ది చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

ప్రభాకర రెడ్డే కాదు..పాపం  రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా చాలా నిర్మొహమాటంగా..ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. చాలా ఫ్రాంక్ అన్నమాట.
అమరావతి రాజధాని శంకుస్థాపన పేరు చెప్పి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విపక్షాలు..మేథావులు ఆడిపోసుకుంటోంటే ..పుల్లారావుకు చాలా కోపం వచ్చింది.

బంగారు భవిష్యత్ సాధించుకోడానికి  ఆ 400 కోట్ల రూపాయల ఖర్చూ కూడా చిన్న పాటి పెట్టుబడి అని పుల్లారావు వివరించారు. ఆర్ధిక శాస్త్రం పై  ఎక్కువ మందికి అవగాహన ఉండదు. విపక్షాలకు అసలే ఉండదు.అందుకే ప్రతిపక్షాలు తెలిసీ తెలియక ఆ 400 కోట్ల రూపాయలు  దుబారా చేశారని అనుకున్నాయి. కానీ ఆర్ధిక రంగంలో ఆరి తేరిన పుల్లారావు ఈ సమస్యను చిటికెలో పరిష్కరించి అసలు విషయం బయట పెట్టారు.ఆయన ఇంత సాయం చేసినా విపక్షాలకు కృతజ్ఞత లేదు. ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి... బంగారు భవిష్యత్ అంటే చంద్రబాబు భవిష్యత్తా లేక నారా లోకేష్ భవిష్యత్తా అని విపక్షాలు  ప్రశ్నిస్తున్నాయి. అంత వెక్కిరింపు  అన్యాయమని నా బుద్దికి తోస్తోంది.

చివరాఖరుగా ఓ మాట.
చింతమనేని  ఇసుక దందాలు చేసి కోట్లు చేతులు మార్చినా..
మురళీమోహన్ వంటి ఎంపీలు రాజధాని చుట్టు పక్కల ముందుగానే భూములు కొని కోట్లు కొట్టేసినా..
ప్రభుత్వ అండదండలతో నారాయణ విద్యా వ్యాపారాన్ని  విస్తరించి అపర కుబేరుడు అయిపోయినా..
కొందరు మహిళా మంత్రులు బంగారు వడ్డాణాలు మురిపెంగా పుచ్చుకున్నా..
అంతా కూడా తమ తమ  నియోజక వర్గాల్లో తమను నమ్ముకుని గెలిపించిన ప్రజలను ఉద్ధరించడానికీనూ...ఆ నియోజక వర్గాలను అభివృద్ధి చేయడం కోసమేననీనూ  అందరూ అర్ధం చేసుకోగలరని నా మనవి.
---------------------------
-కవి కాకి

Back to Top