మహర్జాతకం...మసక చీకట్లు

రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఓ రహస్య మందిరంలో   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..కొంతమంది సీనియర్ మంత్రులతో  సమావేశమయ్యారు.
చంద్రబాబు చాలా అసహనంగా ఉన్నారు.
చాలా కోపంగా ఉన్నారు.
తలచుకుంటోంటేనే ఒళ్లు మండిపోతోంది ఆయనకి.
గంభీరంగా ఉన్న చంద్రబాబు నాయుడి మూడ్ మార్చడానికి  మంత్రి అచ్చెంనాయుడు కల్పించుకుని తవరిది మహర్జాతకం సామీ అన్నాడు.
చంద్రబాబుకు కోపం రెట్టింపయ్యింది.
మహర్జాతకమా...గాడిద గుడ్డా? ఏంటయ్యా ఇది?
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ  ఒకటే  దరిద్రం.
ఒక దాని తర్వాత ఒకటి. అన్నీ సమస్యలే.
ఒకటి చల్లారిందనుకుంటే మరోటి. ఛ..ఛ..ఎదవ జాతకం..ఎదవ జాతకమాని అని అగ్గి ఫైరైపోయారు.
ఇంతలో రావెల కిషోర్  అందుకుని " బాబుగారూ తమరు కంగారు పడకండి సార్...మీ జాతకం బాగుండ బట్టే కదా   ఇక మన వల్ల కాదనుకున్న అధికారం మనకి వచ్చింది. "అని పళ్లికిలిస్తూ  చెప్పుకొచ్చారు.
"వచ్చాం లేవయ్యా? బొటాబొటీ మెజారిటీతోటి. చాలా చోట్ల చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచాం. సరే ఏదో ఒకటి ఒక పరుగుతో గెలిచినా.. వంద పరుగుల తేడాతో గెలిచినా గెలుపు గెలుపే కదా అని అనుకుంటే ఈ సమస్యలేంటయ్యా  నాకర్ధం కాదు" అని చంద్రబాబు చికాగ్గా మొహం పెట్టి అన్నారు.
"అయినా ఇపుడు తవకొచ్చిన కష్టం ఏటున్నాదండీ బాబూ అంత  ఇదైపోతున్నారు  కూసింత రిలాక్స్ అవ్వండి ముందుకాల" అని సలహా  ఇచ్చారు పల్లె రఘునాథ రెడ్డి.
జేబులోంచి రుమాలు తీసుకుని కళ్లొకసారి తుడుచుకుని చంద్రబాబు అందరి కేసీ చూశారు.
" కష్టం ఏంటని నెమ్మదిగా అడుగుతావేంటయ్యా..నీకు తెలీదా? ఒక పక్క టెన్షన్ తో ఛస్తోంటే.
గెలిచిన వెంటనే రుణమాఫీ గురించి గోల.
దాన్ని ఎలాగోలాగ దారి మళ్లించేసేనా...శేషాచలం ఎన్ కౌంటర్.
మన పోలీసులకు ఎన్ కౌంటర్లు చేసుకోవడం కూడా రాదయ్యా బాబూ.
అదీ  మన  పలుకుబడితో  పక్కన పెట్టించేశామా...వెధవది ఓటుకు నోటు.
ఆ రేవంత్ రెడ్డికి అస్సలు తెలివితేటలు లేవు. ఇష్టం వచ్చినట్లు అంతా వాగేసి మన కొంపలమీదకి తెచ్చాడు. కేంద్రంలో మనకి తెలిసిన  మంత్రులతో ఆ గండం నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నామా...ఆ చింతమనేని  ఒకడు.గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ప్రతీ విషయంలోనూ గొడవకు పోవడమే? తహసిల్దార్ వనజాక్షిపై దాడి చేసి మన పరువు తీశాడు. అదీ తప్పించుకున్నాంరా బాబూ అనుకుంటోంటే ...పుష్కరాల్లో యాత్రికులూ మనల్నే ముంచారు. ఒకర్నొకరు తోసుకుంటూ పోయి స్నానాలు చేయకపోతే కాస్త ఆగచ్చు కదా. అందరూ తోసుకుని ఓ పాతిక మందికి పైగా ప్రాణాలు తీసుకుని మన ప్రాణాలమీదకి తెచ్చారు.అది కూడా మన తప్పు కాదని బుకాయించి బయట పడ్డాంరా నాయనా అనుకుంటోంటే..ఈ రితేశ్వరి కేసు."
దేవుడు మన మీద కక్ష కట్టేశాడయ్యా. లేకపోతే ఏంటీ జాతకం. " అంటూ చంద్రబాబు కళ్లనీళ్ల పర్యంతమయ్యారు.
అంతలో సీనియర్ మంత్రి యనమల  నెమ్మదిగా చంద్రబాబు సీటు దాకా నడిచొచ్చి...సార్ ఈ త్రైమాసికంలో మనం అనుకున్న అబ్కారీ ఆదాయం రాలేదు. మన టార్గెట్లకు దరి దాపుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగలేదు" అని చెవిలో ఊదారు.
చంద్రబాబుకు ఉక్రోషం వచ్చేసింది." ఏం....జనమంతా ఏం చేస్తున్నారు?  అందరికీ అందుబాటులో మందు షాపులు పెడితే తాక్కుండా ఏం నాటకాలాడుతున్నారు? ఇక పై  మద్యం సీసా కొంటే కానీ రేషన్ బియ్యం ఇచ్చేది లేదని చెప్పేయండి. రేషన్ బియ్యమే కాదు అసలు ప్రభుత్వం తరపున ఇచ్చే ఏ పథకాలూ దక్కవని చెప్పండి " అని ఆదేశించాడు. ఆ వెంటనే ..చూశావా ఇది తాజా సమస్య. ఇదేనా మహర్జాతకమంటే"  అంట అచ్చెంనాయుడి వైపు గుడ్లురిమి చూశారు.
ఇంతలో  నారాయణ సమావేశ మందిరం తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చారు. ఆయనతో పాటు ఓ జ్యోతిష్కుడు కూడా వచ్చాడు.వస్తూనే  అయ్యా తవరి చేయి చూపించండి ఈయన లోపం ఎక్కడుందో కనిపెట్టి..అది పోవాలంటే ఏం చేయాలో చెప్పేస్తారు అని నారాయణ  ...చంద్రబాబు కేసి వినయంగా చూస్తూ విన్నవించుకున్నారు.
ఇంతమందిలో నువ్వయ్యా  మంత్రంటే. అని చంద్రబాబు మెచ్చుకున్నారు.తన చేతిని ముందుకు చాపి జ్యోతిష్కుడి కి అప్పగించేశారు.
జ్యోతిష్కుడు చైనా నుంచి తెప్పించిన లేటెస్ట్ భూతద్దాన్ని జేబులోంచి తీసి చంద్రబాబు హస్త రేఖలను పరిశీలించడం మొదలు పెట్టాడు. గంట దాటిపోయింది. జ్యోతిష్కుడు చూస్తూనే ఉన్నాడు. భూతద్దాన్ని అంత సేపు అలా చేయిమీద పెడితే అదృష్ట రేఖలు చెరిగిపోతాయేమో " అని  మరో మంత్రి గంటా అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.
ఎంత సేపు చూస్తావయ్యా? చూసింది చాలు. ఇక చెప్పు అని అసహనంగానే అనేశారు.
జ్యోతిష్కుడు వేళ్లమీదనే ఏవో లెక్కలు పెట్టుకుంటూ..అయ్యా తవరిది మహర్జాతకమయ్యా అన్నాడు.
చంద్రబాబుకి కోపం నషాళానికి అంటుకుంది.
"మరో సారి ఆ మాట అన్నావంటే చెప్పుచ్చుకుని కొట్టేస్తాను.
ఏం నన్ను చూస్తోంటే వేళాకోళంగా ఉందా ఏంటి? పొగడ్తలు వర్ణనలు మాని  అసలు విషయం చెప్పు" అని సీరియస్ అయ్యారు.
జ్యోతిష్కుడు గజ గజ వణికి..తేరుకుని అయ్యా తవరి జాతకం అంతా బానే ఉంది కానీ..అదృష్ట  రేఖ మీద  ఎన్టీఆర్ గారు బేసం పట్టేసుకుని కూర్చున్నారయ్యా  అని అన్నాడు.
ఇంకెక్కడా ప్లేస్ లేనట్లు నా అదృష్ట రేఖ పై కూర్చోవడమేంటయ్యా బాబూ..అందరూ నా పై కక్ష కట్టేశారు. సరే ఇపుడేం చేయాలో అది చెప్పి చావు అని  అన్నాడు.
జ్యోతిష్కుడు  కాస్త దూరంగా జరిగి..జాగ్రత్త పడుతూ..మరేం లేదయ్యా...ఎన్టీఆర్ గారి కుర్చీ మీరు లాక్కున్నారు కదా..ఎన్టీఆర్ గారి ఆత్మ మీమీద కోపంగా ఉందన్నమాట.మీరు ఇమీడియట్ గా సిఎం పదవిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఇస్తే...మీ అదృష్ట రేఖ మీంచి ఆయన లేచి వెళ్లిపోతారు అని జ్యోతిష్కుడు చిట్కా చెప్పాడు.
చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టాయి.
ఏం తమాషాగా ఉందా.? సిఎం సీటు ఇచ్చేయాలా? అని కోపంగా అడిగారు.
ఇస్తేనే మంచిది అయ్యగారూ ..లేదంటే...ఎన్టీఆర్ ఆత్మ వెంటపడి..ఓటుకు నోటు కేసులోనో..మరో కేసులోనే తవరు అరెస్ట్ అయితే..అపుడు ఎలాగూ  సిఎం పోస్ట్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా? అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే మంచిదని జాతకం చెప్తోంది అని జ్యోతిష్కుడు చెప్తుండగానే చంద్రబాబు నాయుడు లేచి జ్యోతిష్కుడు జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయి మరో సారి ఈ దరిదాపుల్లో కనిపించావంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి లోనికి వచ్చారు.
అందరూ చంద్రబాబు వైపే చూస్తున్నారు.
లోనికి రాగానే చంద్రబాబు అందరి కేసీ చూసి..ఎవరూ ఎలాంటి ఆశలూ పెట్టుకోకండి. నేను తలలూ మార్చగలను.జాతకాలూ మార్చగలను. సిఎం పోస్టు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. అని అంటూ  స్పృహ తప్పి కింద పడిపోయారు. చంద్రబాబుకు ఏ ప్రమాదమూ లేదని.. భయంతో కూడిన...నీరసం వల్ల ఆయన అలా పడిపోయారని తేల్చి చెప్పారు.
మంత్రులంతా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
-కవికాకి
Back to Top