కోమాలో తెలుగుదేశం


2014 మే నెలలో  ఎన్నికలు జరుగుతూ వుండగా  సుబ్బారావు  కోమాలోకి  వెళ్ళిపోయారు. చంద్రబాబు వాగ్దానాలు వినివిని  కళ్ళు  తిరిగి  ఆయన  ఆస్పత్రి  పాలయ్యారు.
      2016 లో కోమా  నుంచి  కోలుకున్నాడు.
   `` రెండేళ్ళ  తరవాత  మళ్ళీ  మామూలు  మనిషియ్యారు`` అన్నాడు  డాక్టర్ 
   ``రెండేళ్ళా ! అయితే  ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు జరిగిపోయి ఉంటాయి. ఇవన్నీ  చూసే  భాగ్యం నాకు లేకుండా పోయింది  డాక్టర్ ``అని సుబ్బారావు బోరున ఏడవసాగాడు. 
   `` మీరెందుకు  ఏడుస్తున్నారో  నాకు  తెలియదు. కానీ బయటికేలితే మీకు చాలా  అద్భుతాలు కనిపిస్తాయి `` అని  డాక్టర్  డిశ్చార్జ్ చేసి  పంపాడు.
     విజయవాడ నడిబొడ్డున  సుబ్బారావు నిలబడగానే ఒక  యువకుడు  ఎదురయ్యాడు `` బాబోస్తే జాబోస్తుందన్నారు. వచ్చిందా  బాబూ? `` అని  ఆ కుర్రాన్ని అడిగాడు  సుబ్బారావు.
    ``బాబేంటి? జాబేంటి ?`` అని  ఆ  కుర్రాడు భయంగా అడిగాడు.
     `` చంద్రబాబు  వస్తే  అందరికీ  ఉద్యోగాలు  వస్తాయన్నారు  కదా? ``
   `` ఆయనకీ  ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది. మాకెవరికీ జాబు రాలేదు, జవాబూ రాలేదు `` అని  వెళ్ళిపోయాడా కుర్రాడు.
      ఇంతలో ఒక బక్కచిక్కిన రైతు  కనిపించాడు.
   `` రైతన్నా, నీ రుణాలు మాఫీ  అయ్యాయా ? నీ  పంట  పండిందా ? అని అడిగాడు.
   ``పంట  ఏందీ, ఇంట్లో  వంట కూడా లేకుండా  పోయింది. అందుకే  వలస  పోతున్నాం``
   ``అదేంటి పరాయి  రాష్ట్రాల  నుంచి  ఇంజనీర్లు, డాక్టర్లు  మన అభివృద్ధిని చూసి వలస  వస్తారనుకుంటే  మీరే  వలస వెలుతున్నారా?``
   `` అభివృద్ధి  అంటే  నాయకుల  అభివృద్దే  కానీ, ప్రజల అభివృద్ధి కాదు  బాబూ``
   `` ఇంతకూ  రాజధాని  ఎక్కడ  కడుతున్నారు?``
   `` అమరావతిలో ``
   `` ఈ రెండేళ్ళ లో కట్టేశారా ?``
   `` రైతుల భూములన్నీ  కొట్టేశారు ``
   ``మరి  ఈ  రెండేళ్లలో  ఏం చేశారు ?``
   ``3 డి  సినిమా  చూపించారు ``
   `` అంటే ?``
   `` తెలుగుదేశం  అద్దాలు  పెట్టుకున్నవారికి  అభివృద్ధి  కళ్ళముందు  ఎగురుతూ  వుంటుంది. అద్దాలు  లేని వాళ్లకి  అంతా మసకే `` అని రైతు వెళ్ళిపోయాడు.
    సుబ్బారావు  గందరగోళంగా  వెళుతుంటే ఒక కార్మికుడు  కనిపించాడు .
   ``ఏమయ్యా, పరిశ్రమల‌ల్నీ  తరలి వచ్చాయా ? `` అని  అడిగాడు
  `` పరిశ్రమలంటే  ఏంటది ?`` అని బుర్రగోక్కుంటూ  అడిగాడు  కార్మికుడు 
  ``అదేంటి, చంద్రబాబు  అధికారంలోకి  వస్తే  వందలు వేల పరిశ్రమలు  వస్తాయన్నారు. ``
   `` రాష్ట్రానికి  ఏ మోచ్చాయో  తెలియదు కానీ, మాకు  మాత్రం  పోయే కాలం  వచ్చిందండి. పనిలేదు, తిండి లేదు ``
  `` ఇంతకూ  ప్రత్యేక హోదా  వచ్చిందా  లేదా ? ``
   `` హోదానా? అంటే ఏంటండి ? సాదా పాన్ తెలుసు  కానీ  ఈ హోదా  అంటే  ఏంటో తెలియదండి ``
    చదువులేని వాళ్ళతో మాట్లాడి  లాభం  లేదనుకుని దారిన  వెళ్తున్న  ఒక  ఉద్యోగిని  ఆపి `` ఏమండి,  రాష్ట్రానికి  ప్యాకేజీ  వచ్చిందా ? `` అని  అడిగాడు.
    `` ప్యాకేజీ  కాదు కదా, స్టీల్ క్యారేజీ కూడా  రాలేదండీ``
   ``మరి ఈ రెండేళ్లలో  ఏం జరిగింది ?``
  `` చంద్రజాలం, కనికట్టు, అరచేతిలో స్వర్గం ``
`` నదుల అనుసంధానం  కూడా  జరగలేదు``సుబ్బారావు  బుర్ర గోక్కుని  మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళిపోయాడు.
   ``డాక్టర్  నన్ను  మళ్ళీ కోమాలోకి  పంపండి ``
   `` ఎందుకలాగా ?``
    ``బయట ప్రభుత్వమే  కోమాలో వున్న‌ప్పుడు ప్ర‌జ‌లు ఉంటే తప్పేంటి ``

తాజా ఫోటోలు

Back to Top