కబ్జాల కింగ్

చంద్రబాబు ఆఫీసులో తల మునకలై పనిలో ఉన్నాడు. నంద్యాల ఎన్నికల టెంక్షన్ తో నిద్రగూడా పట్టక కళ్లు వాచిపోయి ఉన్నాయి. తన సొంత ఇంటిలిజెన్స్ వర్గాలే నంద్యాల్లో టిడిపి గల్లంతౌతుందని చెప్పిన మాటలు గుర్తుకువచ్చి తెగ టెంక్షన్ పడిపోతున్నాడు. ఈలోగా పి.ఎ వచ్చి సార్ మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఇప్పుడు ఎవ్వరినీ కలిసే మూడ్ లేదు వెళ్లిపోమను అన్నాడు బాబు. కాదు సర్ ఏదో ముఖ్యమైన విషయమంట. మీకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పాడు అన్నాడు. అలాగా అయితే రమ్మను అన్నాడు చంద్రబాబు. 
ఫుల్లుగా తెల్ల డ్రెస్ వేసుకున్న ఓ లావుపాటి పెద్దమనిషి వచ్చి నమస్కారం చేసాడు. 
ఏంటి చెప్పు అన్నాడు చంద్రబాబు. 
అదే సార్ మీ మనసులో మాట బైట పెట్టారు కదా. అది నెరవేరుద్దామని వచ్చా అన్నాడు తెల్ల డ్రస్సు పెద్దమనిషి. 
నా మనసులో మాట. అది బిజెపి మోడీగారి మన్ కి బాత్ కి తెలుగు మీనింగు కదా…నేనలాంటి ప్రోగ్రాం ఏమీ చేయట్లేదే అన్నాడు బాబు బుర్రగోక్కుని. 
అదికాదు సార్ మీకెంతో ఇష్టమైన పని. మీరెప్పుడూ చేసే పని. మీరు చేయాలనుకుని చేయకుండా ఆపేసిన పని నేను చేసిపెడతాను అన్నాడు. 
కంగారుగా చూశాడు చంద్రబాబు ఏంటది అన్నాడు.
అదే నండి మన డిజిపి ఆఫీసు సంగతి. మీరు మనసు పారేసుకున్నారు కదా కబ్జా చేయాలని. మీరు అనుకన్నవి చేయకుండా ఎప్పుడైనా ఉన్నారా? రాజధాని కోసం వందల ఎకరాలు, ప్రాజెక్టులకు వేల ఎకరాలు, అసైన్డ్, నాన్ సైన్డ్, పోరంబోకు, ఈనాం, డి.పట్టాలు, భూదానభూములు… ఇలా రకరకాలు భూములు ఇప్పటికే మన తాలూకా వాళ్లు కబ్జాలు చేసి, చుట్టకట్టి చంకలో దోపేసుకున్నారు కదా అన్నాడు.
అబ్బ నెమ్మదిగా మాట్లాడవయ్యా అన్నాడు బాబు చుట్టూ చూసుకుంటూ. 
ఎంతైనా మీరు గ్రేట్ సర్ అన్నాడు తెల్లడ్రస్.
ఎందుకో అన్నాడు బాబు కాస్త ఉబ్బిపోయి. 
కాస్త పచ్చగా, ఏపుగా, పుష్టిగా కనిపించినవన్నీ మీకు బాగా నచ్చుతాయి సార్. 
నాలుగు పంటలు పండే బంగారమంటి వ్యవసాయ భూమి, కృష్ణా నదీ తీరంలో చల్లగాలి వేసే సమతల భూమి, విశాఖలో అన్ని రకాల భూములూ అబ్బ మీ కన్ను పడ్డాక ఏ నేలైనా గాల్లో కలిసిపోతుంది సర్. అలాంటిది డిజిపి కార్యాలయం ఓ లెక్కా. మీరు ఉ అనండి చాలు దాని సంగతేదో నేను చూస్తాను. కాకపోతే ఫిఫ్టీ ఫిప్టీ మరి బేరానికొచ్చాడు తెల్లడ్రస్సు.
ఉండవయ్యా అసలే ఈ స్కాముల పాములు మెడకు చుట్టుకుని ఎట్టా పీక్కోవాలా అని నేను కిందా మీదా పడుతుంటే నువ్వింకోటి అంటావ్. బయల్దేరు బయల్దేరు అంటూ లోపలికి వెళ్లిపోయాడు బాబు. 
అబ్బా మంచి డీల్ పోయిందే అనుకుంటూ గదిలోంచి బయటకు వెళ్లాడు తెల్లడ్రస్సు. 
లోపలకి వెళ్లిన చంద్రబాబు ముసి ముసిగా నవ్వుకున్నాడు. ఏదో నోరు జారి కబ్జా చేస్తాను అని అనేసాను కాని, అక్కడ నా మాట కాదని ఈగ కదలదు కదా. నెమ్మదిగా నా పని నేను చేసుకు పోతాను. అందుకు ఇంకోళ్లకు వాటా ఎందుకు అనుకున్నాడు తెల్లగడ్డాన్ని దువ్వుకుంటూ. 


Back to Top