కావ్ కావ్..

చంద్రబాబు నాయుడి మంచి తనాన్ని మంత్రులు చేతకాని తనంగా తీసుకుంటున్నారో...సాకుగా తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదు కానీ...ఆయన్ని మాత్రం ఆటపట్టించేస్తున్నారు. అంతే కాదు ఆయన పరువు తీసి బజారున పడేస్తున్నారు.
మంచి వాడు కదా ఏమీ చేయరురు లేనన్న ధీమాయే కావచ్చు మంత్రులు..ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.
ఎమ్మెల్యే కూడా కాకపోయినా.. నారాయణ కాలేజీలు పెట్టి విద్యా వ్యాపారం చేసుకుంటోన్న  నారాయణను పిలిచి  మంత్రి పదవి ఇచ్చారు పాపం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు అంత ఉదారంగా   పదవిని ఇస్తే..నారాయణ స్థానంలో ఇంకెవరున్నా జీవితాంతం చంద్రబాబుకు రుణపడి ఉండేవారు.
కానీ నారాయణ మాత్రం  తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు..పదవినిచ్చిన చంద్రబాబునే అప్రతిష్ఠ పాలు చేశారు.
అది కూడా చాలా పకడ్బందీగా..చంద్రబాబుకు ఏ మాత్రం తెలీకుండా..అత్యంత రహస్యంగా ..కుట్ర పన్ని మరీ చంద్రబాబు ప్రతిష్ఠను మంటగలిపారు.
నారాయన చేసిన పనికి రైతులంతా చంద్రబాబును ఓ విలన్ గా చూస్తున్నారు.
ఇంతకీ నారాయణ ఏం చేశారో తెలుసా?
నమ్మి మంత్రి పదవిని ఇస్తే... బుద్ధిగా ఆ ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేయకుండా రైతుల జీవితాల్లోకి తొంగి చూశారు.
రాజధాని నిర్మాణానికి భూములు కోసం పాపం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోండయ్యా అని మంత్రులకు..అధికారులకూ కూడా పదే పదే చెప్పారు.
బలవంతంగా భూసేకరణ చేస్తే రైతులు బాధ పడతారని చంద్రబాబు వారితో అన్నారు.రైతుల గురించి చంద్రబాబు ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తూ...పరిపాలనలో బిజీగా ఉన్నారు.
సరిగ్గా అదే అదను అనుకున్న నారాయణ రాజధాని  ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ కోసం నోటీసులు జారీ చేసేశారు.
దాంతో రైతులు లబో దిబో మన్నారు.
దాంతో మరి కొందరు మంత్రులకు చిర్రెత్తుకొచ్చింది.
నారాయణతో కుమ్మక్కయిన మంత్రులు రావెల కిషోర్ బాబు...పత్తిపాటి పుల్లారావు...దేవినేని కూడా చంద్రబాబుకు ఏ మాత్రం తెలీకుండా   రైతులను బెదిరిస్తూ పోయారు.
భూములు  ఇవ్వకుంటే బలవంతంగా లాక్కుంటామని హెచ్చరించారు.
మర్యాదగా భూములు ఇస్తే  ఏదో ఒక పరిహారం అయినా వస్తుందని..ప్రభుత్వమే బలవంతంగా భూములు గుంజుకుంటే దమ్మిడీ కూడా రాదని  భయపెట్టారు.
రైతులు గగ్గోలు పెడితే..భూసేకరణ వద్దంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
దానికి ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు మండి పడ్డారు.
భూసేకరణ జరపకుండా ఏం చేయాలో చెప్పండంటూ పవన్ పై కౌంటర్ వేశారు.
భూమిని సేకరించకుండా రాజధాని నగరాన్ని ఆకాశంలో కట్టాలా అని  నిలదీశారు.
మరో మంత్రి రావెల  కిషోర్ బాబు అయితే ఆఫ్ట్రాల్  మూడున్నర వేల ఎకరాల గురించి ఏంటీ రాద్దాంతం అని నొచ్చుకున్నారు.
దయ చేసి అభివృద్ధికి మోకాలడ్డు పెట్టకండని పవన్ కళ్యాణ్ కు హితవు చెప్పారు కూడా.
అది విని పవన్ కళ్యాన్ అక్కడికి పరిగెత్తుకు వెళ్లారు.
భూసేకరణ జరపకండంటూ మరో సారి చెప్పారు.
అప్పటి దాకా అసలక్కడ భూసేకరణ కోసం నోటీసులు జారీ చేసిన సంగతి కూడా తెలీని చంద్రబాబు షాక్ తిన్నారు. వేగులను పంపించి రైతులేమనుకుంటున్నారో కనుక్కుంటే అందరూ కూడా తనను తిట్టిపోస్తున్నారని తెలిసింది. జనమే కాదు...జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఏమంటారో చెప్పలేని పరిస్థితి.
ఒక్క నారాయణే కాదు..సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు...ఇతర మంత్రులు రావెల కిషోర్ బాబు..పత్తిపాటి పుల్లారావు..దేవినేని ఉమామహేశ్వరరావులు   భూసేకరణ కోసం ఇంత దుర్మార్గంగా..దౌర్జన్యంగా  రైతులపైకి దూసుకుపోవడం గురించి ఏ మాత్రం తెలీని చంద్రబాబు తీరా తెలిసాక మనస్తాపం చెందుతున్నారు.
దాంతో  భూసేకరణకు  నోటీసులు జారీ చేసిన నారాయణని పిలిచి నారాయణ ఇదేమన్నా బాగుందా అని అడిగారు.అప్పుడు  నారాయణ మీడియా వాళ్లని పిలిచి తన నేరాన్ని ఒప్పుకున్నారు.
ఇంతటి ఘోరానికి పాల్పడ్డా..మంచి మనసు కాబట్టి చంద్రబాబు నాయుడు నారాయణను ఏమీ అనలేదు.ఆయన్ని పదవి నుంచి తప్పించలేదు.
నారాయణే కాదు..ఆ మధ్య టిడిపి  ఎమ్మెల్యే చింతమనేని కూడా చంద్రబాబు కు ఏ మాత్రం తెలీకుండా ఇసుక మాఫియా చేసుకుంటూ..మహిళా తహసిల్దార్ పై దాడి కూడా చేశాడు.
కానీ చింతమనేని చాలా అమాయకుడని నమ్ముతూ వచ్చిన చంద్రబాబు నాయుడు  ఆయన్నే సపోర్ట్ చేసి అందరి దృష్టిలో  అవినీతికి మద్దతు నిచ్చే వ్యక్తిగా ముద్ర పడిపోయారు.
చేయని తప్పుకు చెడ్డపేరు తెచ్చుకొన్నారు.
అంతెందుకు  ఆడబిడ్డకు మంత్రి పదవినిచ్చి ప్రోత్సహించాలని  చంద్రబాబు నాయుడు ...పీతల సుజాతకు కేబినెట్ లో చోటిచ్చారు. ఆమె కూడా  అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆ చెడ్డ పేరు కూడా చంద్రబాబు ను కలచి వేస్తోంది.
ఇలా మంత్రులంతా కక్షకట్టినట్లు చంద్రబాబును  నానా ఇబ్బందులూ పెట్టి ఆయనకున్న మంచి పేరును పాడు చేస్తున్నారు.
ఈ మంత్రులందరినీ కేబినెట్ నుంచి తప్పించి  కొత్త మంత్రులను పెట్టుకుని  తనకున్న మంచి పేరును కాపాడుకోవాలని చంద్రబాబుకు నా విజ్ఞప్తి.
----------------------
-కవికాకి
Back to Top