వ‌న‌జాక్షి క‌థ‌లో అస‌లు ట్విస్టు..!

మడిసన్న తర్వాత కూసింత కామన్ సెన్స్ ఉండాలి.
అస్సలు సెన్సే లేకుండా పని చేసేవాళ్లతో పని చేయించుకునే వాళ్లకి ఎప్పుడూ ప్రమాదమే.
పరిపాలనా దక్షుడిగా.... అయిన వాళ్ల చేత అభినందనలు అందుకోవడం వ్యసనంగా మార్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైతే...కామన్ సెన్స్ లేని వాళ్లని కాల్చి పారేయాలంటారు కూడా. పని చేసే వాళ్ల కామన్ సెన్స్ పై మొన్న రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ విస్తరణలో కాసేపు ముచ్చటించుకున్నారు. కేబినెట్ ముచ్చట్లు మూడో కంటికి తెలీవు. మంత్రులు తమంతటగా తాము చెబితే కానీ అవి బయటకు రావు. లేదంటే కర్ణపిశాచులన్నా మన చెవుల్లో ఊదాలి. అయితే ఆ అవసరం లేకుండా మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఓ ముచ్చట చెప్పారు.
పాలక పక్షం అంటేనే ఆట పట్టించాలని అనుకునే ఆకతాయి మీడియా ప్రతినిథుల్లో ఓ ఉత్సాహి .. ** ఏమండీ కేబినెట్ మీటింగ్ లో వనజాక్షి విషయం చర్చకు వచ్చిందా** అని ఆరా తీశారు.
వనజాక్షి అంటే ...మొన్నా మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని అండ్ కో దాడిలో తీవ్ర అవమానం పాలయిన బాధిత తహసిల్ దార్ అన్నమాట. అప్పట్లో ఆ కేసు విచారణకు ఓ కమిటీని వేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందేమోనన్న అమాయకత్వంతో ఆ మీడియా ప్రతినిథి వనజాక్షి గురించి అడగ్గానే పల్లె రఘునాథ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులందరికీ అవసరమైన ఓ రహస్య నీతి సూత్రాన్ని చెప్పారు.
కేబినెట్ మీటింగ్ లో అన్ని విషయాలూ మాట్లాడుకుంటూ..మధ్యలో ఆట విడుపుగా వనజాక్షి విషయం కూడా చర్చకు వచ్చిందట.
ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు తీసుకునేముందు కొద్దిగా ఆలోచించకపోతే ఎలాగ అని చంద్రబాబు నాయుడు కొద్దిగా కోప్పడ్డారట.
ఈ వార్త తెలియగానే..చెప్పొద్దూ నాక్కూడా వనజాక్షి పై కాస్త కోపం వచ్చింది.
కావడానికి ఆమె తహసిల్దారే కాదనడం లేదు.
ఇసుక అక్రమాలో మరోటో జరిగితే ఆమె అడ్డుకోవలసిందే..అందులో తప్పేలేదు.
అలాగని ఇసుక అక్రమంగా తవ్వుకోడానికి వచ్చిన వాళ్లు ఎవరో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా అడ్డుకోవడం మాత్రం క్షమించరాని నేరం.
పాపం ఇసుక తవ్వుకోడానికి వచ్చిన చింతమనేని స్వతహాగా సాధువు. అత్యంత సౌమ్యుడు.
ఆయన ఎంత సౌమ్యుడంటే..ఆయన మీద 17కి పైగా కేసులు పెట్టినా పోలీసులపై ఏనాడూ దాడి చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా అని నమ్మే వెర్రి బాగులోడు పాపం.
ఏదో మొన్నటి ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు చేతి చమురు వదిలింది కాబట్టి...గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి...పార్టీ నేతలు అవినీతికి పాల్పడితే వెన్ను తట్టి ప్రోత్సహించే చంద్రబాబు వంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి...ఇసుక అనే బంగారం చాలా మందికి అవసరం కాబట్టి.. దాన్ని అమ్ముకుని ఎన్నికల ఖర్చును వెనక్కి రాబట్టుకోవాలన్న చిన్న ఆశతోనే
చింతమనేని ఇసుక తవ్వుకోడానికి అక్కడికి వచ్చారు.
వచ్చిన వ్యక్తి తమకు జీతాలు ఇచ్చే ప్రభుత్వంలోని పాలక పక్షానికి చెందిన వ్యక్తి అని కూడా చూడకుండా వనజాక్షి ఆయన్ను అడ్డుకోవడాన్ని ఏమనాలి? మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎమ్మెల్యే మనుషులనే అడ్డుకోవడం దారుణమని తహసిల్ దార్ స్థాయి అధికారి అయిన వనజాక్షికి తెలీదనుకోవాలా? తనను అడ్డుకున్నారన్న కోపంలో చింతమనేని ..దాడి చేస్తే చేసి ఉండొచ్చు. మహిళ అని కూడా చూడకుండా తోసేస్తే తోసేసి ఉండొచ్చు. దాన్ని పంటి బిగువున భరించి భూమాతలా సహనంతో ఉండాల్సింది పోయి మీడియా వాళ్ల దృష్టిలో పడేలా బాధ పడ్డం ఏంటి? ఇలా ఏ ఆలోచనా లేకుండా...హద్దులు మీరి ప్రవర్తించారు కాబట్టే వనజాక్షిని మందలింపులతో వదిలిపెట్టేయాలని ప్రభుత్వం భావించింది. ఎంతో ఔదార్యం ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడిగారి ప్రభుత్వం వనజాక్షిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వదిలేసిందని నేను నమ్ముతున్నాను. అయినా...ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటూ.. పాలక పక్ష నేతలను గౌరవంగా చూసుకోవాలన్న ఇంగితం ఉండొద్దా అని వనజాక్షిని నిలదీస్తున్నాను.
అవును తల్లీ..కూసింత ఆలోచించొద్దా మరి.

-కవి కాకి.

తాజా వీడియోలు

Back to Top