కథలు చెప్పే బాబు

చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశాడు.
 `` థాయ్ ల్యాండ్, స్విట్జ‌ర్ ల్యాండ్ విశేషాలేంటి సార్ ?`` అని అడిగారు విలేకరులు
 `` విదేశాలు  చూసినప్పుడల్లా, మన  రాష్ట్రాన్ని  ఆ  దేశాలులాగా తీర్చిదిద్దాలని  నా  కోరిక. చిన్నప్పుడు  అక్షరాలు దిద్దాను. తరవాత రాజకీయాల్లో  ఓనమాలు  దిద్దాను. ఆ అనుభవంతో  మా మామ ఎన్టీఆర్ నామం  దిద్దాను. అందుకే  రాష్ట్రాన్ని  సరిదిద్దలేను.  థాయ్ ల్యాండ్ మసాజ్ లకి ఫేమస్. అక్కడి  నుంచి  నిపుణులని రప్పించి మసాజ్ సెంటర్లను   వోపెన్ చేస్తే  వేలమందికి ఉపాధి  దొరుకుతుంది. ప్రజలు కూడా  రిలాక్సావుతార్``
  `` సూపర్ ఐడియా సార్ ``
  `` ఇక స్విట్జర్ ల్యాండ్ స్పెషాలిటీ  ఏంటంటే అక్కడ  చాలా  చల్లగా  ఉంటుంది. విజయవాడ  వేడిగా ఉండండం వల్ల  అనవసరంగా  ఇక్కడ  రాజకీయాలు  వేడెక్కుతున్నాయి. అలా కాకుండా  రాజధాని  మొత్తాన్ని  స్విట్జర్ ల్యాండ్ గా చేయడం వల్ల  అందరూ  కూల్ అయిపోతారు.``
   `` రాజధానిని స్విట్జర్ ల్యాండ్  ఎలా చేస్తారు ?``
   ``పెద్ద  పెద్ద  ఏసీ ప్లాంట్ లు నిర్మించి, కొళాయిల  ద్వారా  నీళ్ళని ఎలా పంపిస్తామో అలాగే  చల్లగాలిని ఇంటింటికి పంపుతాం. ఇంటింటికి నెట్ ని ఇస్తున్నపుడు ఏపీ ని ఇవ్వలేమా ?``
    `` నెట్ ని ఎప్పుడిచ్చారు ?``
    `` ఇస్తామని చెపుతున్నాం కదా !``
    `` ఇంతక ముందు  సింగపూర్ చేస్తామన్నారు ?``
    `` రోడ్లు, భవనాల నిర్మాణంలో సింగపూర్  మనకి ఆదర్శం. వాతావరణం లో స్విట్జర్ ల్యాండ్  ఆదర్శం ``
    `` స్విస్ బ్యాంకుల్లో డబ్బు  దాచుకోడానికే  మీరు  విదేశాలకి వెళతారటగా ``
    `` నా జీవితం తెల్లకాగితం.....అవి గిట్టని వాళ్ళ  మాటలు ``
    ``మీరు  పదవిలోకి  వచ్చి రెండేళ్లయ్యిందిగా , ప్రజలకి  ఏం చేశారు ? ``
    `` ఏమైనా చేస్తే  ప్రజలు  వూరుకోరు. ఏమీ చేయని  వాళ్ళనే  అభిమానిస్తారు  అయినా  ఏమైనా  చేయడానికి  డబ్బు లెక్కడున్నాయి ? కేంద్రం పైసా కూడా  ఇవ్వదు ``
     `` గట్టిగా అడగొచ్చు కదా ``
     `` అడిగినా ఇవ్వరు, అరిచినా ఇవ్వరు ``
     `` మరి  మిత్రపక్షంగా  వుండడమెందుకు ? ``
     `` స్నేహం  వుంటే  సెంటర్ లో  కొన్ని  పెర్సనల్ పనులు జరుగుతాయి ``
     `` మరి  జనం  సంగతో ? ``
     `` జనం, మా  రాజకీయనాయకుల  భోజనం ``
     ఇంతలో  ఒకావిడ చంకన  పిల్లాడితో సమావేశంలోకి  వచ్చింది
      `` ఎవరమ్మా  నువ్వు ? `` అడిగాడు  బాబు
      ``  నేను  తెలుగు  తల్లిని, వీడు తెలుగు బిడ్డ`` అని చెప్పింది.
      `` తెలుగంటే నాకు  చాలా గౌరవం. మా  పార్టీ లోనే  తెలుగుంది. ఇంతకూ  ఏంటి నీ  ప్రాబ్లం ``
      `` ఆకలి అంటూ ఏడుస్తున్నాడండి. మీరేదైనా  కథ  చెపితే ఏడుపు ఆపుతాడు ``
      ``ఓ యస్, దానికేం. రెండేళ్లుగా  నేను  కథలే కదా  చెబుతున్నా `` అని  పిల్లాన్ని  చేతిలోకి తీసుకొని
      `` చూడు బాబూ, అనగనగా  అమరావతి, దూరంగా  సింగపూర్, పడమర థాయ్ ల్యాండ్, తూర్పున  స్విట్జర్ ల్యాండ్ మధ్యన రైతుల ల్యాండ్  అదంతా ఆక్రమించేయాలి తినేయాలి.
       రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి. ఇంకుడు గుంతలు కట్టాలి. ఆ గుంతలో  దూకి  ఈత కొట్టాలి......``
       `` ఇంకో మూడేళ్ళు  ఇలాగే  కథలు చెప్పండి. ఆ  తరువాత ఎలాగూ  దించేస్తారు. కథ కంచికి, మనం  ఇంటికి `` అని  విలేకరులు  వెళ్ళిపోయారు.
Back to Top