'కమ్మ'ని దైవం


'కమ్మ'ని పాలనలో ఆంధ్రప్రదేశ్ బోలెడు అభివృద్ధి చెందుతోంది అని చాటింపు జరుగుతోంది. ఆ అభివృద్ధి ఎందులో అనేది పక్కన పెడితే పనిలో పనిగా దేవీ దేవతలు కూడా ఈ ఒరవడిలో పడ్డారని టాక్. తెలుగునాట తిరుపతి వెంకన్న ఇందుకు ఆద్యుడయ్యాడు. టిటిడికి టిడిపికి మధ్య తేడా లేకుండా చేయాలన్న బృహత్ ఆశయంతో ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆరంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకుంటోంది. వివిధ ప్రాంతాల్లోని ఆ పార్టీ నాయకులు, అనుచరగణం తమ ప్రాంతాల్లోనూ ఆ ఒరవడిని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నార్ట. తెలుగుదేశం ప్రభ వెలిగిపోయేలా, ఏకంగా భగవంతుడే బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశం ఉంటే దాన్నెందుకు వదులుకోవడం అనుకుంటున్నార్ట. 
బెజవాడ కనకదుర్గమ్మను ఇకపై కనకదుర్గా చౌదరిగా పిలుచుకోవాలని తీర్మానిస్తున్నారని భోగట్టా.
 విభజనలో భద్రాద్రిరాముడు ఎటూ తెంలంగాణానికి చేరుకున్నాడు గనుక, మన ఒంటిమిట్ట రాములోరిని శ్రీరామచంద్ర నాయుడిగా సంభోధించాలని, పూజాదికాలు ఆ పేరనే నిర్వహించాలనే ఉత్తర్వులకోసం ఓ బృందం పనిచేస్తోందిట.
 ఇక సీమ వాసుల దైవం చెన్నకేశుని కూడా చెన్నకేశవ నాయుడిగా, నవ నరసింహ మూర్తిని నరసింహ నాయుడిగా (ఈ పేరు ఎలాగూ బాలకృష్ణ వల్ల పరమ పాపులర్ అయ్యుండటం ఆ భగవంతునికి ఓ ప్లస్ పాయింట్ అని కూడా డిమాండ్ చేస్తున్న వాళ్లు అంటున్నారు) తలుచుకోవాలనే తలంపుతు ఉన్నారని సమాచారం.
శ్రీశైల మల్లన్న మల్లన్నచౌదరిగా, అన్నవరం సత్యనారాయణుడు సత్యనారాయణ చౌదరిగా ఎందుకు మారరంటూ ఆ ప్రాంత టిడిపి నేతలు అరగంట నిరాహారదీక్షలు చేపడదామనుకుంటున్నార్ట. 
అరసవెల్లి సూర్యడు, కాణిపాకం వినాయకుడు, కసాపురం ఆంజనేయుడు ఇలా ప్రసిద్ధ ఆలయాల్లోని దేవతలందరి విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నాయట టిడిపి శ్రేణులు. 
భగవంతునికి అపచారం, దేవ ధిక్కారం, పాపం, పరిహారం అంటూ ఎవరైనా మాట్లాడేరు గనుక, ఆ ఏడుకొండలవాడి ప్రధాన అర్చకుడికే అతీగతీ లేకుండా పోయింది. సాక్షత్తూ శ్రీనివాసుడికే సెగ తగిలింది. ఇక రాష్ట్ర ప్రజలు ఏపాటి? భక్త పరమాణువులే పాటి? కనుక 'కమ్మ'గా ఆ భగవంతుని సేవించుకునేందుకు సిద్ధం కండి. 

Back to Top