నిష్ఠూరమైనా నిజమే చెప్పాడు!!

చంద్రబాబుకు ఊపిరి తిరక్కుండా చేసే జెసి మరోసారి బాణాలేసాడు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాను అని నిక్కచ్చిగా చెప్పేసాడు. అందేంటి సార్ మీరు అంటే పొలిటికల్ వాతావరణం బాగోలేదబ్బా అని పెదవి విరిచాడు. పొలిటికల్ వాతావరణం టిడిపిలో బాలేదా, లేక ఆయనకు ఆ వాతవరణం పడటం లేదా అన్నది అప్రస్తుతం. ఇక జెసి కుండ బద్దలు కొట్టిన మరో విషయం ఎపికి మోదీ ఏమీ ఇవ్వడు అని. మనం ఎంత లబలబ లాడినా మోదీ ఏం చేయడబ్బా అని చెప్పాశాడాయన. మరి ఈ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నట్టు అని విలేకరులడిగితే ప్రజల కోసం అని ఉన్న విషయాన్ని దాచుకోకుండా చెప్పేశాడు. 
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ఒక్కసారి కూడా అనుమతించని ఎన్డీయే ప్రభుత్వం, చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని తీరిగ్గా తేలగ్గా ఆమోదించడంలో మతలబేంటని కూడా జెసిని ఎవరైనా అడిగుండాల్సింది. హా... అడిగితే మాత్రం ఏం చెబుతాడులెండి అంటారా! అదీ నిజమే మరి. మహా అయితే బాబు కుమ్మక్కు రాజనీతి గురించి చెప్పేవాడేమో!
రాష్ట్రంలో ప్రజల ముఖం చూడలేక, హోదా కోసం నువ్వేంచేశావో చెప్పు అని నిలదీస్తే... అదిగో ఢిల్లీలో మోదీకి చెమటలు పట్టించాం, కేంద్ర ప్రభుత్వాన్ని స్థంబింపజేసి పార్లమెంటులోనే ఊపిరి ఆడకుండా చేశాం, అవిశ్వాసం పెట్టి ప్రపంచం మొత్తానికి హోదా గురించి తెలిసేలే లబలబలాడించాం అని చెప్పుకోడానికే చంద్రబాబు ఇదంతా చేస్తున్నాడని చెప్పేవాడేమో! అది తెలిసిన పిట్టకథే కదా అని ఆ ప్రశ్న దాటవేసుంటారు పాత్రికేయులు. 
అసలే జెసి, ఆపై అలిగాడు... ఇక ఆయన చంద్రబాబు ఎంత గుట్టువిప్పినా, బాబు బండారం బజారున మరో వందసార్లు టముకు వేసి చెప్పినా సరే నిప్పుగారు నోరు విప్పలేరనేది జగమెరిగిన సత్యం.
 
Back to Top