మర్యాద రామన్నలపైనే అభాండాలా?

తెలుగుదేశం పార్టీ నేతలు  పార్టీలోనే కాదు..ప్రభుత్వంలోనూ చాలా క్రమశిక్షణతో ఉంటారు.
ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిథులు ఎక్కడికెళ్లినా  అందరూ మెచ్చుకునే రీతిలో మర్యాదగా వ్యవహరిస్తారు. మర్యాదకు అంత  ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే..  అప్పుడప్పుడు  వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఉదాహరణకు   టిడిపి ఎంపీ జే.సీ.దివాకర రెడ్డి  వ్యవహారాన్నే తీసుకోండి. విశాఖ నుండి విమానంలో బయలు దేరడానికి జేసీ  ఎయిర్ పోర్టుకు వచ్చారు. బోర్డింగ్ పాస్ కోసం మనుషులను పంపారు. అయితే  నిబంధనల ప్రకారం 45 నిముషాల ముందు వస్తేనే పాస్ ఇస్తారు. కానీ జేసీ ఇరవై నిముషాల ముందే వచ్చి పాస్ అడిగారు. దాంతో  ప్రైవేటు ఎయిర్ లైన్స్ సిబ్బంది పాస్ ఇవ్వలేమన్నారు.  చాలా అర్జంటు పనుల మీద హైదరాబాద్ వెళ్లాల్సిన జేసీకి  ఒళ్లుమండుకొచ్చింది.  ఎంపీ అన్న తర్వాత సవాలక్ష పనులు ఉంటాయి కదా. అన్ని పనులూ చూసుకుని వచ్చే సరికి ఎవరికైనా ఆలస్యం అవుతుంది కదా.  ఎంపీ అని కూడా చూడకుండా మరి జేసీకి పాస్ ఇవ్వకపోవడం దారుణమే కదా. అందుకే జేసీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయినా వెంటనే తమాయించుకుని  ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన ఫర్నిచర్ ను మర్యాదగా ధ్వంసం చేశారు.
అప్పటికీ కోపం చల్లారలేదు. అయినా సరే..చాలా కూల్ గా  ఎయిర్ లైన్స్  సిబ్బందిని వెనకనుంచి తోసేసి... గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించి పాస్ ఇవ్వనందుకు తగిన శాస్తి చేశారు.
మీడియాకి  వేరే పనిలేక జేసీ ఏదో అన్నేయం చేసేసినట్లు  ఒకటే సీన్  ని పదే పదే చూపించి హడావిడి చేశారు. జేసీ మాత్రం చాలా సౌమ్యంగా మౌనంగా ఉండిపోయారే తప్ప... మీడియా పై దాడికి దిగలేదు. ఇంతకన్నా మర్యాదస్తులు ఇంకెక్కడైనా ఉంటాయా?
అయినా ఎయిర్ పోర్టులో ఇలా చేయి చేసుకోవడం..నోరు పారేసుకోవడం జేసీకి కొత్తేమీ కాదు. గతంలో గన్నవరం ఎయిర్ పోర్టులోనూ ఇలాగే వ్యవహరించారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టే  పార్టీ అధినేత..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   జేసీని ఏమీ అనలేదు. ఆయనపై   ఎలాంటి చర్య తీసుకోలేదు.
జేసీయే కాదు.. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ ఎంత మర్యాదగా వ్యవహరించారు? ఆర్టీయే కమిషనర్  తాము చెప్పినట్లుగా తలూపలేదని కేశినేని,బోండా తీవ్రమనస్తాపానికి గురయ్యారు.  ఎంపీ స్థాయి నేత ఏమన్నా అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలే తప్ప యాగీ చేయకూడదన్న ఇంగితం కూడా కమిషనర్ కు లేనందుకు కేశినేని నొచ్చుకున్నారు. వ్యాపారంలో తమకి అడ్డొస్తోన్న ఆరెంజ్ ట్రావెల్స్ పై  ఏదో ఓ కేసు పెట్టాల్సిందిగా చిన్న కోరిక కోరితే..ఆ కోరిక కూడా  నెరవేర్చని కమిషనర్ పై  కేశినేనికి కొద్దిగా కోపం వచ్చింది. అయినా సరే ఆయన రెచ్చిపోకుండా కమిషనర్ కు కాస్త భయం  చెప్పాలని ఆయన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ  కమిషనర్ ను బెదిరించడానికి  నోటికొచ్చిన తిట్లు తిట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఎంపీకి  తోడు నీడగా ఉందామని వచ్చారు కాబట్టి కమిషనర్ గన్ మెన్ ను   ఓ తోపు తోశారు.అంతమాత్రానికే కొంపలు అంటుకుపోయినట్లు మీడియా అంతా గగ్గోలు పెట్టేసింది.
అందుకే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేశినేని, బోండాలను మర్యాదగా పిలిపించి.. ఆర్టీకే కమిషనర్ కు మర్యాదగా సారీ చెప్పాల్సిందిగా ఆదేశించారు. చేసేది లేక ఇద్దరు నేతలూ సారీ చెప్పారు.
మరో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని గుట్ట చప్పుడు కాకుండా  ఇసుక మాఫియా ఆట ఆడుకుంటూ ఉంటే.. ఓ మహిళా తహసిల్దార్ అడ్డుపడ్డారు. ఇంకెవరన్నా అయితే చాలా కోపంగా..చాలా దారుణంగా ప్రవర్తించేవారు. కానీ చింతమనేని మాత్రం ఎంతో సంయమనంతో..ఇంకెంతో వినయంతో..మంచి మర్యాదతో ఆ తహసిల్దార్ పై చేయి చేసుకుని పాలక పక్ష నేతల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తప్పవుతుందని వివరంగా చెప్పి వదిలేశారు. గిట్టని విపక్షాలు..యాగీ చేయడమే అలవాటుగా పెట్టుకున్న మీడియా వాళ్లు చింతమనేనిపై అన్యాయంగా అభాండాలు వేశారు.అయినా చింతమనేని హుందగానే ఉండిపోయారు.
ఇలా టిడిపి నేతలంతా మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటే.. గిట్టని వాళ్లు మాత్రం  టిడిపి నేతలను గూండాలుగా చిత్రీకరిస్తూ  నానా రాద్ధాంతం చేస్తున్నారు.
నందిగామ లో జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో  ఏవో కొన్ని ప్రాణాలు గాల్లో కలిస్తే.. ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి చాలా దారుణంగా వ్యవహరించారు. పోస్ట్ మార్టం చేయకుండానే మృతదేహాలను తప్పించేసి..ఎలాంటి కేసులేకుండా పాలక పక్ష నేతలను కాపాడుకోవాలని  ప్రభుత్వ వైద్యులు.. కలెక్టర్  ప్రయత్నిస్తోంటే.. జగన్ మోహన్ రెడ్డి దాన్ని బట్టబయలు చేశారు. అందుకే  మరి ప్రభుత్వానికీ..పోలీసులకూ కూడా ఒళ్లుమండి  జగన్ మోహన్ రెడ్డిపై కేసులు బనాయించారు.  
అప్పుడు ఏ తప్పూ చేయని జగన్ మోహన్  రెడ్డిపై కేసులు పెట్టారు కదా..ఇపుడు  దారుణంగా ప్రవర్తించిన టిడిపి నేతలపై కేసులు ఉండవా అని  మేథావులు నిలదీస్తున్నారు. ఎంత దారుణం?
కలికాలం కాపోతే ఏంటి చెప్పండి?
అందుకే మా సెంద్రబాబుగోరి తరపున నేనే చెప్తున్నా.
"ఇది మా పెబుత్వం. మా ఇష్టం వచ్చింది చేస్తాం. మాకు నచ్చకపోతే కేసులు పెడతాం. మా మాటినక పోతే కొట్టి కొట్లోకి తోస్తాం." ఖబడ్దార్..!
--------------------------

తాజా వీడియోలు

Back to Top