తక్కువేమి మనకు జేసీ ఒక్కడుండు వరకు..!

మంచి మిత్రుడు ఒక్కడు చాలు.
వంద మంది శత్రువులను సైతం ఓడించి పారేయచ్చు.
తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా అలాంటి  మంచి మిత్రులు ఉన్నారు.
అందరిలోకీ ఆప్తమిత్రుడు జే.సి.దివాకర రెడ్డే.
జే.సీ.దివాకర రెడ్డి దగ్గర మాయ మర్మాలు  ఉండవు.
మనసు లోపల  ఓ మాట బయట ఓ మాట ఉండవు.
ఏదైనా సరే మనసులో అనిపిస్తే  దాన్ని బయట పెట్టేస్తారంతే.
తాజాగా అనంత పురం జిల్లాలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..జే.సీ దివకార రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
చంద్రబాబు  కూర్చున్న వేదిక పైనే దివాకర రెడ్డి మాట్లాడుతూ మనసులో మాట బయట పెట్టారు.
"చూడండి చంద్రబాబు నాయుడుగారూ..మీరు  ఏవేవో కలలు కంటూ ఉంటారు.  దానికి తగ్గట్లుగా ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటారు. కాకపోతే మీరు కన్న కలలు ఒక్కటి కూడా నెరవేరదండీ బాబూ" అని దివాకర రెడ్డి నిర్మొహమాటంగా నిజం చెప్పేశారు.
పోలవరం ప్రాజెక్టును 2019లోపే పూర్తి చేస్తానని చంద్రబాబు పదే పదే అనడాన్ని గుర్తు చేసిన దివాకర రెడ్డి...బాబును ఉద్దేశించి..మీరేమో 2018 కల్ల పోలవరం అయిపోతుందంటున్నారు. మీ ఆశయం మంచిదే కానీ..ప్రాజెక్టు మాత్రం అవ్వదు.  అయినా అది అవుతుందని మీరెలా చెప్తారండీ బాబూ అంటూ గాలి తీసేశారు. చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడ్డారు.
ఈ ఊపులోనే దివాకర రెడ్డి మరో మాట కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేదు కాబట్టి..వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశంలేదు కాబట్టి  గత్యంతరం లేని పరిస్తితుల్లోనే తాను టిడిపిలో చేరానన్నారు జే.సీ. అంటే   మంచి  అవకాశం దక్కి ఉంటే టిడిపిలో చేరేవాడిని కాదని ఆయన కల్మషం లేకుండా  నిజం చెప్పారు.
అనంతపురం జిల్లాలో  హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెబుతోన్న  చంద్రబాబు నాయుడి దగ్గర ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు లేనే లేవని కూడా జేసీ చెప్పేశారు. జేసీ మాట్లాడుతున్నంత సేపూ పాపం చంద్రబాబు నాయుడు ముళ్ల కుర్చీమీద కూర్చున్నట్లు ఇబ్బందిగా కూర్చున్నారు.
ఇప్పుడే కాదు గతంలోనూ జేసీ  ఏం మాట్లాడినా నిజమే మాట్లాడే వారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారన్న నమ్మకం తనకు ఏ కోశాన లేదని టిడిపి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జేసీ అన్నారు. ప్రత్యేక హోదా కు చంద్రబాబు వ్యతిరేకమని జేసీకి మొదట్నుంచీ తెలిసినట్లే ఉందని అప్పట్లో  లోకులు కాకులై  గోల గోల చేశారు కూడా.
పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చెబుతారని ఆ తర్వాత దాని ఫాలో అప్ మర్చిపోతారని  జేసీ అన్నారు. జేసీ లాంటి మంచి మిత్రుని పక్కన కూర్చోబెట్టుకుని కార్యక్రమాల్లో పాల్గొంటే ఉన్న పరువుకూడా పోతుందని చంద్రబాబుకు  సన్నిహితంగా ఉండే వారు బాబు చెవిలో గుస గుస లాడుతున్నారట.
బాబుకి కూడా జేసీపై పీకల దాకా కోపంగా ఉన్నా ఏమీ అనలేని పరిస్థితి.
ఇపుడు అందరినీ కలవర పెడుతున్నది ఒక్కటే.
ప్రత్యేక హోదా కు అడ్డు పడ్డ చంద్రబాబు నాయుడు...పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారా ఏంటని రైతు సంఘాల నేతలు  కంగారు పడుతున్నారు.
మరి జేసీ మాటలకు బాబే జవాబు చెప్పాలి.

Back to Top