రక్షించండి..రక్షించండి..చంపేస్తోందది..!

మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు.
మంత్రులంతా తమ తమ మంత్రిత్వ శాఖల్లో తెచ్చిన మార్పుల గురించి వివరిస్తున్నారు.
మధ్యాహ్నం భోజనం  అయ్యాక అందరూ చల్లటి ఏసీ గాలిలో సమావేశమయ్యారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తన శాఖ విషయాల గురించి చెబుతున్నారు.చంద్రబాబుకి బోర్ కొట్టేసింది. పైకి కనపడనియ్యకుండా కళ్లు మూసుకున్నారు. కడుపులో వెచ్చటి భోజనం..పైన చల్లటి గాలి.. క్షణాల్లో నిద్రపట్టేసింది చంద్రబాబు నాయుడికి.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉత్సాహంగా చెప్పుకుపోతున్నారు.
బాబు గురక మొదలైంది.
కొంత సేపటికి మంత్రి ప్రసంగం కన్నా బాబుగారి గురకే గట్టిగా వినపడుతోంది.
అందరూ బాబుగారి కేసే చూస్తున్నారు.
హఠాత్గుగా చంద్రబాబు నాయుడు భయంతో పెద్ద కేక పెట్టారు." రక్షించండి..రక్షించండి నన్ను చంపేస్తోందది రక్షించండి" అని గట్టిగా అరుస్తూ తన సీటులోంచి దిగి బయటకు పరుగులు తీశారు చంద్రబాబు.
మంత్రులంతా కంగారు పడ్డారు.
ఇదేంటి ఇలా భయపడుతున్నారని అందరూ  టెన్షన్ కి గురయ్యారు.
ఇద్దరు మంత్రులు వెళ్లి చంద్రబాబుకి చెరో వైపు నిలబడి ఆయన్ని నెమ్మదిగా తీసుకు వచ్చి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు.
బాబు కళ్లల్లో భయం అలానే ఉంది.
ఏం జరిగింది సార్ అంటూ యనమల  అడిగారు.
అప్పటికి కొంచెం స్థిమిత పడ్డ చంద్రబాబు నాయుడు అబ్బే ఏంలేదు ..ఏం లేదు... అని నవ్వేశారు.
.....................
సాయంత్రం అయ్యింది.
చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళ్లారు.
చక్కగా వేన్నీళ్లతో స్నానం చేసి.. లైట్ గా ఫలహారం చేసి కాసేపు టీవీ చూశారు. 
రాత్రి పెంద్రాళే పడుక్కున్నారు.
పడుక్కున్న పది నిముషాలకే బాబుగారికి నిద్రపట్టేసింది.
ఓ పావుగంట కాగానే చంద్రబాబు  నిద్రట్లోనే...రక్షించండి..రక్షించండి నన్ను చంపేస్తోందది అని గట్టిగా అరిచి ఒక్క ఉదుటన మంచం మీంచి కిందకు ఉరికి బయటకు పరుగులు పెట్టారు.
లోకేష్ బాబు..భువనేశ్వరి కంగారుగా చంద్రబాబు ను అనుసరించి ఆయన్ను పట్టుకుని హాలులో సోఫాలో కూర్చోబెట్టారు. ఓ గ్లాసు మంచినీళ్లు ఇచ్చారు. కొద్ది సేపు ఆయాస పడ్డ చంద్రబాబు తేరుకున్నారు.
ఏమైందండీ అని ఆత్రంగా అడిగారు భువనేశ్వరి,లోకేష్ బాబు.
అబ్బే ఏమీ లేదు అని చెప్పి చంద్రబాబు తన గదిలోకి వెళ్లి పడుక్కున్నారు.
...................
ఉదయాన్నే లోకేష్ బాబు ఫ్యామిలీ డాక్టర్ కి ఫోను చేశారు.
నాన్నగారు ఎందుకో భయపడుతున్నారు. 
మంత్రి వర్గ సమావేశంలోనూ..తర్వాత ఇంట్లోనూ కూడా చాలా భయం భయంగా ఆయన పరుగులు తీశారు. ఎవరి నుంచో ఆయనకు ప్రాణహాని ఉంది మీరు అర్జంట్ గా వచ్చి ఓ సారి చూడాలి అని అన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ తెలిసిన మానసిక వైద్యుణ్ని కూడా తీసుకుని అమాంతం చంద్రబాబు క్యాంప్ ఆఫీసుకు వచ్చారు.
అందరినీ బయటకు వెళ్లిపొమ్మని..మానసిక వైద్యుడు..ఫ్యామిలీ డాక్టర్ ఇద్దరే చంద్రబాబు తో ఉన్నారు. మానసిక వైద్యుడు చంద్రబాబు ముందుకు వచ్చి..  మిమ్మల్ని ఎవరు చంపాలనుకుంటున్నారు?  మీరెందుకు భయపడుతున్నారు? అని అడిగారు.
చంద్రబాబు ఒక్కక్షణం శూన్యంలోకి చూశారు. ఉన్నట్లుండి రక్షించండి ..రక్షించండి అది చంపేస్తోంది అంటూ అరిచారు.
మానసిక వైద్యుడు చంద్రబాబు ను పట్టుకుని కంగారు పడకండి దాన్ని నేను చంపేస్తాను అని ధైర్యం ఇచ్చారు. చంద్రబాబు తేరుకుని సోఫాలో కూర్చున్నారు.
మానసిక వైద్యుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు.
ఎక్కడా క్లూ దొరకడం లేదు.
హఠాత్తుగా మానసిక వైద్యుడికి ఓ అనుమానం వచ్చి చంద్రబాబు  పిఏని పిలిచి  మంత్రివర్గ సమావేశానికి ముందు చంద్రబాబు ఏమేం చేశారని  నెమ్మదిగా చెవిలో అడిగారు.
పి.ఏ. తడుముకోకుండా.. పొద్దున్నే టిఫిన్ తిన్నారండి.. ఆ తర్వాత పాలు తాగారు. ఆ తర్వాతేమో పేపర్లన్నీ చదివారు. తర్వాత ఫ్రూట్ జ్యూసి తాగారు. ఆ తర్వాత ..ఆ...కొద్ది సేపు టీవీ చూశారండి అన్నాడు.
మానసిక వైద్యుడి ఆతృతగా టీవీలో ఏం చూశారు? అని అడిగారు.
వార్తలే చూశారండి.  అని వివరించాడు.
మానసిక వైద్యుడు చంద్రబాబు దగ్గరకు వచ్చి... అది మిమ్మల్ని ఎలా చంపాలనుకుంటోంది? అని అడిగారు..చంద్రబాబు ఒక్క సారిగా పొడిచి చంపేస్తుంది అంటూ పరుగులు పెట్టారు.
మానసిక వైద్యుడికి విషయం అర్ధమైంది.
లోకేష్ బాబు దగ్గరక వచ్చారు. 
మీ నాన్నగారిని కొద్ది రోజుల పాటు టీవీ చూడద్దని చెప్పండి.
ఆయనకి ఏమీ కాలేదు. కానీ  .. టీవీలో జల్లికట్టు వార్తలు చూస్తేనే ఆయనకు భయం పుట్టుకు వస్తోంది. ఆ దున్నపోతు తనని పొడిచి చంపేస్తుందని భయపడుతున్నారు. అంతకు మించి భయపడాల్సింది ఏమీ లేదు. జల్లికట్టు గొడవ సద్దుమణిగేదాకా టీవీలు బంద్ చేయించండి సరిపోతుంది అని చెప్పాడు.
హమ్మయ్య అని లోకేష్ బాబు ఊపిరి పీల్చుకుని  తండ్రి ఉన్న గదిలోకి వెళ్లారు.
అప్పుడే టీవీ ఆన్ చేసిన చంద్రబాబు జల్లికట్టు ఉద్యమ వార్త  కనపడగానే రిమోట్ కింద పడేసి బయటకు పరుగులు తీశారు.వెనకాలే లోకేష్ పరుగులు పెట్టారు.
-------------------------
-కవికాకి
-----------------------------

Back to Top