వీడ్కోలు సన్మానాలు

చంద్రబాబుకు
దండేసి దణ్ణం పెడుతున్నారందరూ.
శాలువాలు కప్పి సన్మానించేస్తున్నారు. వివిధ వర్గాల
వారు వంతుల వారీగా వచ్చి ముఖ్యమంత్రి అభినందన సభలు ఏర్పాటు చేస్తున్నారు. వారంలో నాల్గురోజులు ఈ సన్మాన, సత్కార, ఘనకార్య గీతాలాపన కార్యక్రమాలు ఉండితీరాలని ఎవరు పట్టుబడుతున్నారో ప్రత్యేకంగా
చెప్పుకోనక్కర్లేదనుకోండి. నిన్నటి రోజు హోంగార్డులు,
డప్పు కళాకారులు చంద్రబాబును సన్మానించుకున్నారు. హోంగార్డుల జీతాల పెంపుదల, చర్మకారులు, డప్పు కళాకారుల పింఛన్ల ప్రకటన చేసినందుకు చంద్రబాబుకు ఈ ఘన సత్కారం జరుగుతున్నట్టు
ప్రకటించడమైనది.

ఇంతకు
ముందు అంగన్వాడీ టీచర్లు తమ జీతాలను పెంచినందుకు సన్మానం చేసి వెళ్లారు. బాబు ఆశపడ్డట్టు సన్మానం,
సత్కారం అయితే చేసారు గానీ, ప్రభుత్వం గురించి
ప్రజల్లో ప్రచారం చేస్తారా అన్నప్పుడు ఒక్కరూ చేస్తామని ఒప్పుకోడానికి సిద్ధపడలేదు.
దాంతో రోషం వచ్చినా గట్టిగా అడిగితే నాలుగేళ్లు ఏడిపించి, ఇప్పుడెందుకు వేతనాలు పెంచారో మాకు తెలుసంటూ వాళ్లు రివర్స్ అయితే సీను సితార
అవుతుందని గ్రహించి మిన్నకుండిపోయాడు బాబు. కానీ తన ప్రయత్నాలను
మాత్రం ఆపడం లేదు. అటకెక్కించిన హామీలను దింపి, బూజు దులిపి, ప్రతిపక్ష నాయకుడు ఏ వర్గానికి ఏ హామీ ఇస్తున్నాడో
చూసుకుని వెంటనే వాటిని అమలు చేసి చూపిస్తున్నాడు. ఇంత చేసినా
ఎవ్వరూ శెభాష్ అనడం కానీ, మా ఓటు మీకే అని అనడం గానీ చేయడం లేదన్నది
బాబుగారి దిగులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి
వెళ్లి, చెట్టుమీదున్న శవాన్ని దించి, భుజాన
వేసుకుని వెనుతిరిగి చూడకుండా నడిచినట్టుగానే, బాబుగారు కూడా
మురగబెట్టేసిన హామీలను తెచ్చి, వరాలుగా ప్రకటించి, ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటున్నట్టు ప్రచారం చేసుకోవడం మొదలెట్టారు.
ఆ స్టంట్ లో తొలి భాగం బాబుగారి హామీల ప్రకటన మలి భాగం హామీ అందుకున్న
వారు చంద్రబాబును సత్కరించడం.

ఎన్నికలు
దగ్గర పడుతున్నప్పుడు చంద్రబాబు చేస్తున్న ఈ స్టంట్లకు మెచ్చి జరుగుతున్న సత్కార కార్యక్రమాలపై
నిపుణుల విశ్లేషణలు మరోలా ఉన్నాయి.
అవినీతిలో కూరుకుపోయి, ప్రజలను విస్మరించి,
పాలనలో గడ్డు రోజులు చూపించిన చంద్రబాబుకు అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న
వీడ్కోలు సత్కారాల్లా ఇవి ఉన్నాయంటూ రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓట్ల సమయం వచ్చింది కనుక, ప్రజా సంకల్ప యాత్రతో
ప్రతిపక్ష నేత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పదేపదే ప్రశ్నిస్తున్నారు గనుక చంద్రబాబు ప్రభుత్వం
వేతనాలు, పింఛన్లు, గృహనిర్మాణ రాయితీలు
అంటూ తొందరపడుతోందని, ప్రజల మాత్రం ఈ కపట నాటకాలకు లొంగేందుకు
సిద్ధంగా లేరని కూడా అంటున్నారు కొందరు సీనియర్ నాయకులు. ఇన్నేళ్ల
బాబు పాలనకు చివరగా ధన్యవాదాలు చెప్పేందుకు ఇన్ని సన్మానాలు జరుగుతున్నట్టున్నాయి అంటున్నారు.
ఇక ప్రభుత్వం నియమించుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కోట్ల రూపాయిల
బిల్లులు ఎలాగూ చెల్లిస్తున్నారు కనుక, సాధ్యమైనన్ని కార్యక్రమాలు
ఇలా చేపడితే అటు వినియోగం, ఇటు ప్రచారం రెండూ జరిగినట్టే అని
ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. 

Back to Top