అందరినీ అన్ని సార్లూ మోసం చేయలేరు

కావ్...కావ్..!
------------------------------

-----------------------------
"కొంత మంది కలిసి ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ..ఆ అబద్ధమే  నిజమైపోతుందిరా "   అన్నాను  మా గోపాత్రుడితో.
వాడు నమ్మలేదు. "ఊరుకోండి గురూగోరూ అబద్ధం నిజం ఎలా అవుతుందండీ మీ చాదస్తం కానీ" అని వెర్రి నవ్వొకటి నవ్వాడు.
"అయితే ఓ కథ చెబుతాను వినరా ఆ తర్వాత నువ్వే ఒప్పు కుంటావు "అని  చెప్పడం మొదలెట్టాను.
" ఓ బ్రాహ్మణుడి దగ్గర   ఓ మేక ఉండేది.ఆ మేక పాలు పితుక్కుని ఇంటి అవసరాలు తీర్చుకునేవాడు.ఆ మేకపై కన్నేసిన ఇద్దరు ఓ  కుట్రపన్నారు. బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్తోంటే..ఏంటి పంతులుగారూ  మీరు గజ్జికుక్కును తీసుకెళ్తున్నారేంటండీ బాబూ " అని  ఆశ్చర్యం నటిస్తూ అడిగారు. 
బ్రాహ్మణుడు  కొంచెం కంగారు పడినా..వెంటనే తేరుకుని
"సరిగ్గా చూసుకోవయ్యా..ఇది కుక్క కాదు మేక అని చెప్పాడు."
మరి కొంత దూరం వెళ్లేసరికి మరో వ్యక్తి తారస పడి ఏంటి పంతులుగారూ కుక్కను తీసుకెళ్తున్నారేంటి? అని అడిగాడు. 
బ్రాహ్మణుడికి అనుమానం వేసి వెనక్కి చూసుకున్నాడు. తన వెనకాల మేకే ఉండడంతో  ఊపిరి పీల్చుకుని..
"నీకేదో తేడా చేసిందిరా అబ్బీ..నా వెనకాల మేకే ఉంది కుక్క కాదు" అని చెప్పి ముందుకు సాగాడు.
కొంత దూరం పోయాక మరో వ్యక్తి ఎదురుపడి 
"ఏంటి పంతులుగారూ   ... ఆచార వ్యవహారాలు అవీ ఉంటాయి కదా మీరేంటండీ కుక్కని తీసుకెళ్తున్నారు " అన్నాడు.
అందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధం  చెప్పే సరికి పాపం బ్రాహ్మణుడు కూడా దాన్ని నమ్మేశాడు..
 తన వెనకాల కుక్క ఉండడం నామోషీ అనిపించి...దాన్ని అక్కడే వదిలేసి  ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లి  పోయాడు.
"బ్రాహ్మణుడు వదిలేసిన మేకను తీసుకుపోయిన మోసగాళ్లు దాన్ని శుభ్రంగా వండుకుని తిన్నారు."
అని కథ ముగించాను.
"గోపాత్రుడు   నవ్వేసి..ఏదో  ఎప్పుడో రాసిన కథలోని బ్రాహ్మణుడిలా  అబద్ధాన్ని  నిజం అని నమ్మేసేంతటి  వెర్రోళ్లు  ఈ కాలంలోఎవరూ లేరండీ బాబూ. "  అన్నాడు.
వాడి అమాయకత్వం చూసి నాకు జాలేసి పిచ్చోడా అని వాడి తల నిమిరాను.
వాడికి బాగా కోపం వచ్చింది." ఏటండీ మీ ఉద్దేశం అంత వెర్రోళ్లు ఉన్నారనా ఏంటి? "
అని అడిగాడు.
నేను నవ్వేసి...ఉన్నార్రా బాబూ ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడే నీకు రుజువు చూపిస్తాను అన్నాను.
వాడు ఏం చెబుతానా అని  చెవులు రిక్కించి  వింటున్నాడు.
"ఒరేయ్ గోపాత్రుడూ...ఇపుడు మీ చెంద్రబాబే ఉన్నాడురా. ఆయనేం చెబుతున్నాడిపుడు?  గోదావరి.....కృష్ణా నదుల అనుసంధానం అయిపోయిందని అంటున్నాడా లేదా? " అని అడిగాను.
"అవును గురూగోరూ అన్నాడు.అది నిజమే కదా" అన్నాడు.
"ఏంట్రా నిజం ? గాడిద గుడ్డూ నువ్వూను. పట్టిసీమ దగ్గర పనులే పూర్తి కాలేదు. పంపులు లేవు.కాలువలు లేవు. ఏవీ లేకుండా అనుసంధానం  ఎలా అయిపోయిందిరా " అని అడిగాను.
గోపాత్రుడు బిత్తర పోయాడు. 
"నిజవే గురూ గోరూ అనుసంధానం కాలేదు కదా. మరి అలా ఎందుకు చెబుతున్నట్లు? అని అడిగాడు.
జనాన్ని మోసం చేయడానికిరా. అన్నాను
"మరి చెందర బాబు తో పాటు మంత్రులు కూడా అనుసంధానం అయిపోయిందని అంటున్నారు కదండీ "
అన్నాడు  పేపర్  నాలెడ్జ్ తో గోపాత్రుడు.
"మంత్రులే కాదురా బాబూ..కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప పని చేశాడు...ఆయన చేసింది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శం అని" ఒకటే పొగిడార్రా బాబూ. అన్నాను.
"మరి ఆయనెందుకు అబద్ధం ఆడారండీ" అన్నాడు గోపాత్రుడు.
అందరూ కలిసి అబద్ధం ఆడితే నిజవైపోతుందని తెలుసు కదా. అందుకే చందర బాబు నాయుడే తన మనుషులందరి చేతా ఈ అబద్ధం ఆడిస్తున్నారన్నమాట" అన్నాను.
"మరి జనం నమ్ముతారా గురూగోరూ "అని నిలదీశాడు గోపాత్రుడు
జనం అంత ఈజీగా నమ్మర్రా. కానీ వీళ్లు మాత్రం నమ్మించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఉదాహరణకి రుణమాఫీయే తీసుకో అది కూడా అందరికీ కాలేదు కదా. కానీ చంద్రబాబు కానీ..ఆయన మంత్రులు కానీ ఏమంటున్నారు? రుణమాఫీ చేసేశాం..విజయ యాత్ర చేసేస్తాం" అని డప్పు కొట్టేయడం లేదూ" అని అడిగాను.
"అవును గురూగోరూ  మా ఊళ్లో కూడా  ఎవరికీ రుణమాఫీ కాలేదు. కానీ అందరికీ చేసేశాం అని మా ఎమ్మెల్యే అంటున్నారు." అన్నాడు.
"చూస్తూ ఉండరా మీ ఊళ్లో కూడా రుణమాఫీ విజయ యాత్ర చేసేసి మీ చేతనే చప్పట్లు కొట్టించేసుకుంటారు" అన్నాను.
గోపాత్రుడికి  తల కొట్టేసినట్లయింది.
నిజవే గురూ గోరూ  ఆ  అమాయక బ్రాహ్మణుడికన్నా కూడా  మన జనమే వెర్రోళ్లనిపిస్తోంది" అన్నాడు.
వాడిని దగ్గరగా తీసుకున్నాను.
ఒరేయ్  ఒక్కరిని ఎన్ని సార్లయినా మోసం చేయచ్చు.
అందరినీ ఒక్క సారి మోసం చేయచ్చు.
కానీ అందరినీ అన్ని సార్లూ మోసం చేయడం సాధ్యం కాదురా..ఎందుకంటే జనంలో చైతన్యం అనేది ఒకటుంది.అది  సరైన సమయం వచ్చినపుడు విప్లవాన్ని తీసుకొస్తుంది.
మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పేదాకా ఆ చైతన్యం నిదురపోదురా" అని చెప్పేసరికి
గోపాత్రుడి కళ్లు ఆనందంతో మెరిశాయి.
--------------------------------------------------

Back to Top