నదీ తీరంలో నిర్వాసితుల యాత్ర

విజయవాడ ఇంద్రకీలాద్రి మీద నుంచి తొంగి చూస్తే కృష్ణా నది ఒడ్డున పరిగెడుతున్నారు కొంత మంది. వాళ్లలో కొందరు సూటు, బూటు వేసుకున్నారు. కొందరు పంచలు కట్టుకున్నారు. కొంతమంది మరచెంబులు పట్టుకుని ఉన్నారు. కొంతమంది కొమ్మలు, రెమ్మలు చంకనెట్టుకుని పరుగెడుతున్నారు. కాస్త బైనాక్లర్స్ పెట్టుకుని చూద్దుం కదా…అందరి కంటే ముందు పసుపచ్చని డ్రెస్సేసుకున్న చింపిరి గడ్డపాయన ఆపసోపాలు పడుతూ పంచరైన సైకిల్ ని తొక్కుతున్నాడు. ఆయన వెనకాలే రొప్పుతూ రొష్టు పడుతూ మిగిలిన వారు పోతున్నారు. 
ఇంతలో ఓ పెద్దాయన ఆ సైకిల్ ని ఆపాడు. ఏమిటండీ బాబూ అలా పరెగెడుతున్నారు అన్నాడు. 
అబ్బా వెళ్లనీవయ్యే లేదంటే…కొంప మునుగుతుంది అన్నాడు సైకిల్ బాబు పెడల్ మీద కాలు పెట్టి…
మీ కొంప ఎలా మునుగుతుంది సర్…మునుగుతుందని తెలియక కట్టుకున్నారేంటి కృష్ణా నదిలో ఇల్లు అన్నాడాయన అడ్డు లేవకుండానే…
తప్పుకోవయ్యా వెనకాల అది తరుముకొస్తుంటేను అన్నాడు ఆ సైకిల్ బాబు ఒంటికాలితో సైకిల్ ని ఆపి. 
తరుముకొస్తోందా…భలే వాళ్లుబాబూ మీరు…నది నెత్తిమీద ఇల్లు కట్టి కూర్చుంటే ఆ కృష్ణమ్మే మిమ్మల్ని తరమ లేకపోయింది…ఇంకెవరు మిమ్మల్ని తరిమేది అన్నాడాయన పరిహాసంగా…
నోటీసులయ్యా...నోటీసులు నాతోపాటు  57 మందికీ వచ్చాయి. కొంపలు ఖాళీ చేసి పొమ్మని అన్నాడు ఏడుపు మొహంతో సైకిల్ బాబు…
అవును అన్నారు వెనకాలే ఉన్న పెద్ద మనుషులంతా…
అలాగా…ఎందుకంటా…? రెట్టించాడు పెద్దాయన..
నదీ తీరంలో ఆధ్యాత్మిక వనం పెంచుకోకూడదా గురుదత్తా అడిగాడో కాషాయాంభరధారి
ప్రకృతిలో వైద్యం చేసుకోవడం నేరమా అండీ…అడిగాడు కొమ్మలు చంకలో పెట్టుకున్న తెల్లడ్రెస్ ఆయన…
రిక్రియేషన్ కోసం రివర్ బేస్ లో స్టే చేయకూడదేంటి…డాబుగా అడిగాడో సూట్ బూటు వ్యక్తి…
రాజకీయాల్లో అలసిపోయి కాస్త కృష్ణా తీరాన రెస్టు తీసుకోకూడదా అడిగాడో సీనియర్ పొలిటికల్ పెద్ద….
వాళ్లందరినీ చూసాడు సైకిల్ ని ఆపిన పెద్దాయన….
ఇదిగోండి బడా బాబూ…ముక్కు మూసి జపం చేసుకోడానికి కొండలు, కోనలు ఉన్నాయి…
వైద్యం చేసుకోడానికి ఊరంతా ఖాళీ ఉంది…
రిక్రీయేషన్ కి రోడ్ల పక్కనే బోలెడు షాపులు ఎలాగూ మూయకుండా ఉంచారు…
రెస్టు తీసుకునేందుకు బంగారంలాంటి బంగ్లాలు దేశమంతా కట్టుకోవచ్చు….
అందుకు మీకు నదీ తీరాలే కావాల్సి వచ్చాయా బాబులారా…పచ్చగా ఏది కనిపించినా…మీ కళ్లు ఊరుకోవేం…అన్నాడు ఈసారి కోపంగా…
ఎవరయ్యా నువ్వూ బాబు అడిగాడు…
మర్చిపోయినట్టున్నారు…
నదీ తీరాల్లో, పచ్చని పంట పొలాల్లో…నిర్మాణాలు వద్దయ్యా బాబూ అని నీకు చెబితే మీ అనుచరులతో దారి కాయించి గొడవ చేసావు గుర్తుందా…అడిగాడు పెద్దాయన…
ఆకాశంలోకి చూసి ఆలోచనలో పడ్డాడు సైకిల్ బాబు…
నన్ను అందరూ వాటర్ మాన్ అంటారులే…నే చెప్పినా, ప్రజలు తిట్టినా, ప్రతిపక్షాలు గోలెట్టినా వినలేదుగా…
చివరికి ప్రతిపక్ష ఎమ్మెల్యే పుణ్యమా అని హైకోర్టు జోక్యం చేసుకుని మీకు తగిన బుద్ధే చెప్పింది…. …అనుభవించు…అని చక్కాపోయాడు పెద్దాయన…
ఘొల్లుమంటూ మూటా ముల్లెతో మళ్లీ బయలు దేరారు బాబులు…
ఆ పక్కనే కృష్ణమ్మ కిలకిలా నవ్వులు వినిపిస్తున్నాయి…
రాష్ట్రానికో ప్రతిపక్షం ఇలాంటిదుంటే చాలు అనుకుంది బంగారు కృష్ణమ్మ..

తాజా ఫోటోలు

Back to Top