పవన్ కి ఒకరు చెప్పాలా?

పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడతారని
ఆయనకి చాలా విషయాల మీద స్పష్టత లేదని...చాలా మంది చాలా  రకాలుగా అంటూ ఉండడం నేను విన్నాను. 
అలా దుష్ప్రచారం చేసేవాళ్లకి నేను చెప్పేదొకటే.
పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్లారిటీ డక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకులకు కూడా ఉండదంటే నమ్మండి.
మొన్నటికి మొన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మోదీగారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఓ వ్యాఖ్య చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో  అందరూ ఆందోళనగా ఉంటే   ఏనుగుపై వాన పడ్డట్లు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు.
నిజానికి ఆయన  స్థానంలో ఇంకెవరున్నా..ఆఖరికి పవన్ గారి అన్నయ్య చిరంజీవి ఉన్నా.. దున్నపోతు పై వాన పడ్డట్లు అని ఉండేవారు.
కానీ అలా అంటే మోదీ గారికి కోపం వస్తుందని పవన్ కి తెలుసు. అందుకే దున్నపోతును  తన మాయతో ఏనుగు చేసేశాడు.
మొన్న తిరుపతి మీటింగ్ లోనూ  ఇపుడు కాకినాడ మీటింగ్ లోనూ కూడా వెంకయ్య నాయుడిపై విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్. అంతే కానీ నరేంద్ర మోదీ ని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే మోదీని నేరుగా అంటే  కొద్దిగా డేంజరుంటుందని పవన్  కళ్యాణ్ కు తెలుసు.
వెంకయ్య నాయుడు (బిజెపి)పాచిపోయిన లడ్డూలు తెచ్చి ఇచ్చారన్నారు పవన్.మరి ఆ లడ్డూలను వెండి పళ్లెంలో అందుకుని ముత్తయిదువ లా మురిసిపోయిన చంద్రబాబు నాయుడి గురించి ఒక్క మాట అనలేదు పవన్. చంద్రబాబు ను ఏమన్నా అంటే.. రాష్ట్రంలో తనకి కొన్ని పనులు అవ్వవనో.. లేదా చంద్రబాబుకు తనని దగ్గర చేసిన మీడియా పెద్దలకు ఇష్టం ఉండదనో..పవన్ కళ్యాణ్ కు భయం ఉండబట్టే చాలా  తెలివిగా బంతిని ఎటు తన్నాలో అటు తన్నారు.
రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా అని అడిగిన వాళ్లకి కూడా పవన్  కళ్యాణ్  బాబా రామ్ దేవ్ స్టయిల్లో చక్కటి సమాధానం ఇచ్చారు. కళ్లు మూసుకుంటే నిద్రపోయినట్లేనా..ధ్యానం చేస్తున్నానని ఎందుకు అనుకోరు? అని అద్భుతమైన తర్కాన్ని జేబులోంచి లాగి బయటకు వదిలేసరికి ఆయనగారి అభిమానులు కూడా ఆశ్చర్యంతో గుండెపోటు వచ్చినంతగా అదిరి పడాల్సి వచ్చింది.
ఇంతేనా..అసలు రాష్ట్ర విభజన సమయంలోనే కాంగ్రెస్ కు చెందిన ఏపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కావడం వల్లనే విభజన జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ కోప్పడ్డారు. అంతే తప్ప తన అన్న చిరంజీవిని పల్లెత్తు  మాట అనని గడుసు తనం పవన్ ది.
ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాని కాంగ్రెస్ చట్టంలో పెట్టి ఉంటే ఇపుడీ ఇబ్బంది వచ్చేది కాదని  వెంకయ్య తో పాటు చంద్రబాబు నాయుడు పాడిందే పాడరా పాచిపళ్ల గాయకా అన్నట్లు పదే పదే కతలు చెబుతూ ఉంటే..పవన్ కళ్యాణ్ కిమ్మనలేదు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చే సమయానికి ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదని టిడిపి-బిజెపిలతో పాటు పవన్ కళ్యాణ్ కీ తెలుసు. తెలిసుండీ  ..ఇపుడే ఏదో కనుగొన్నట్లు అందరూ డ్రామా ఆడేస్తూ ఉంటే..పవన్ కళ్యాణ్ తమాషా చూస్తున్నారు.
వీటన్నింటికీ కారణం ఒకటే.
ఆయనకు అన్ని విషయాల మీదా అవగాహన ఉంది.
ప్రసంగాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆధార పడతాడని ఆరోపించేవాళ్లు ఆరోపించవచ్చు కానీ... పవన్ కళ్యాణ్ కి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు.  ఏం మాట్లాడాలో ఒకరు నేర్పాల్సిన అవసరం లేదు. నమ్మిన ప్రజలకు ఎలా టెంకిజెల్ల కొట్టాలో ఒకరిని చూసి నేర్చుకోవలసిన స్థితిలో ఆయన లేరు.
కావాలంటే ఆయనే పది పార్టీలకు నేర్పగలరు.
మరంచేత పవన్ కళ్యాణ్ ని  ఎవరయినా సరే... పల్లెత్తు మాట అంటే..చెమ్డాలెక్కదీసేస్తానని ఇందుమూలంగా హెచ్చరించడమైనది.
---------------------------------------
-కవికాకి
Back to Top