చంద్రన్న స్పెషల్స్..!

   అధికారులు అత్యుత్సాహంతో  చంద్రన్న స్టాల్ ఏర్పాటు చేసి  చంద్రబాబునాయుడిని  ఆహ్వానించారు.

`` ఇది చంద్రన్న  ఆయింట్మెంట్ సార్ `` అని చెప్పాడో అధికారి

``ఎందుకిది ?`` అయోమయంగా  అడిగాడు  బాబు

`` పార్టీలో వాళ్ళు  కొట్టుకుంటే  దీన్ని పూస్తాం. ఇది గాయాలని నయం చేయదు. ఇంకా ఎక్కువ  చేస్తుంది. పుండు  మీద కారం చల్లడమే మీ స్టయిల్ కదా. సమస్యని పరిష్కరించకుండా ఇంకో  కొత్త  సమస్యని తీసుకురావడం మీ పద్ధతి ``

 ఇంకో అధికారి  వచ్చి ``ఇది  చంద్రన్న  టూత్ పేస్ట్ సార్. పార్టీలో ఎవరైనా తిట్టు కోవాలనుకుంటే ఈ పేస్ట్ తో పళ్ళు తోముకుని తిట్టుకోవచ్చు`` అన్నాడు.

 `` వెరీగుడ్ `` అని ప్రశంసించాడు బాబు

  `` ఇది చంద్రన్న ఫినాయిల్. పార్టీలో కంపు పోగొట్టడానికి వాడతాం. కంపుకే కంపుకోట్టడం దీని ప్రత్యేకత``

  `` ఇది చంద్రన్న  సెల్ ఫోన్. అవతల పార్టీ వాళ్ళతో బేరసారాలు జరిపేటప్పుడు రేవంత్ రెడ్డిలా దొరికిపోకుండా  కాపాడుతుంది. ఈ ఫోన్ లో మాట్లాడితే  మీ గొంతు  మీదిలా  ఉండదు``

  ఆ ఫోన్ తీసుకుని  చంద్రబాబు  పరిశీలించి `` అమ్మకాలు, కొనుగోళ్ళు  అన్నీ ఇక పై ఈ ఫోన్ తోనే జరగాలి`` అని ఆదేశించాడు.

  ``ఇది చంద్రన్న చీపురు. పార్టీలో వున్న చెత్తకి, అదనపు  చెత్తని యాడ్ చేస్తుంది. ఇది చంద్రన్న సైకిల్. రెండు చక్రాలు లేకపోవడమే దీని ప్రత్యేకత. పెడల్స్  వుంటాయి కానీ తొక్కలేం. బెల్లు వుంటుంది కానీ మోగించలేం. ఇది వంద కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటుందని మనం ప్రచారం చేస్తాం. జనం  నమ్ముతారు. ఒక రకంగా  ఇది మన ప్రభుత్వం లాంటిది ``

   బాబు ఆ సైకిల్ ని చూసి ``దీనికి  హ్యాండిల్ కూడా లేదు`` అన్నాడు.

   `` మీరు హ్యాండిల్ చేయడం  మొదలు పెట్టినప్పటి నుంచి  దాని హ్యాండిల్ మాయమైంది ``

   ఇంకో  అధికారి వచ్చి  `` ఇది  చంద్రన్న బల్బ్, ఇప్పటి వరకూ  వెలగలేదు. ఇక వెలుగుతుందనే  ఆశ లేదు. ఇది చంద్రన్న కత్తెర. పన్నుల పేరుతో జనం జేబులు కత్తిరిస్తుంది.``

   `` నా పేరుతో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా ? `` ఆశ్చర్యం గా అడిగాడు  బాబు

   ``ఇంకా చాలా వున్నాయి. ఇది చంద్రన్న మద్యం. ఇది తాగితే కిక్ ఎక్కుతుంది. దిగిన తరువాత తిక్కపడుతుంది.

   `` ఎందుకలాగా? ``

   `` మొత్తం కల్తీ కాబట్టి``

    `` ఇవి చంద్రన్న బియ్యం. ఉడికినా  రాళ్లలాగే వుంటాయి. ఉడక్కపోయినా రాళ్ళే. ఎందుకంటే బియ్యం కంటే రాళ్ళే ఎక్కువ కాబట్టి. ఇది చంద్రన్న  కంప్యుటర్ ఆన్ చేస్తే స్క్రీన్ కి బదులు మీ బొమ్మే కనిపిస్తుంది.``

   `` అంటే డేటా ఏమీ వుండదా ? ``

   `` ఏమీ వుండదు. పైకి కంప్యూటర్, లోపల డొల్ల. మన ప్రభుత్వం లాగా కీ బోర్డ్ వుంటుంది. కీస్ పని చేయవు. మౌస్ వుంటుంది. తోకకి కనెక్షన్ ఉండదు.``

      ఇంతలో  ఒకాయన వచ్చి `` అయ్యా, బాబూ  నీ పేరుతో ఏమేం నడుస్తున్నాయో  నీకే  తెలియదు. రెండేళ్లుగా  పాలిస్తున్నావు. నిద్ర పోకుండా కష్టపడుతున్నా అంటావు. అసలు  నీ ప్రభుత్వమే నిద్రపోతూ వుంది ఒకసారి చూడు`` అన్నాడు.

     `` నువ్వెవరు? `` అడిగాడు బాబు కోపంగా

    ``కామన్ మ్యాన్ ``

     `` నీకు కామన్ సెన్స్  లేదు ``

     `` లేదు కాబట్టే నిన్ను గెలిపించాను. తప్పు దిద్దుకోడానికి  ఇంకా మూడేళ్ళు  ఎదురుచూడాలి `` అని సామాన్యుడు వెళ్ళిపోయాడు. 

 

Back to Top