ఆదాయం ఆరు వ్యయం ఆరువందల అరవై ఆరు

నీతికి మారు పేరు చంద్రబాబు అయితే..నిజాయితీకి మారు పేరు లోకేష్ బాబు.
ఎవరూ అడక్కపోయినా.. తనకున్న ఆస్తులను  మొత్తం లోకానికి చాటి చెప్పారు లోకేష్ బాబు.
ఆయన దర్జాలు..హోదాలు చూసి వేల కోట్ల ఆస్తిపరుడని మనం అనుకుంటాం కానీ..పాపం లోకేష్ బాబు ఆస్తి జస్ట్ 14 కోట్లు. అంత ఆస్తి పెట్టుకుని..  అప్పులు కూడా చేశాడాయన. 8కోట్ల పై చిలుకు అప్పులు కూడా ఉన్నాయి. అంటే  అప్పులోళ్లకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆయనకి మిగిలేది పాపం ఆరు కోట్లే.
ఇంత పేదరికంలోనూ కూడా ఓ 92 లక్షల రూపాయల వాహనంలో నిరాడంబరంగా తిరుగుతున్నారాయన. అంతటి నిగర్విని..నిరాడంబరినీ కూడా ఈ లోకం వదలడం లేదు.
హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ను లోకేష్ బాబు  బెదిరిస్తోన్నట్లు మాట్లాడ్డం..దానికి రాజప్ప వణికిపోతూ తల వంచుకుని నిలబడ్డం  సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం అంతా చూసింది. అంత మాత్రానికే పత్రికలు  లోకేష్ బాబుని ఎండగట్టేశాయి.
అయినా లోకేష్ బాబు ఎవరి మీద కోపం ప్రకటించలేదు. కొంచెం చూసుకుని రాసుకోండయ్యా అని చాలా శాంతంగా చెప్పారాయన.

సరే ఇది పక్కన పెడదాం.ఆయన ఆస్తుల విషయానికి వద్దాం.
ఆరు కోట్ల ఆస్తులతో సాదాసీదాగా గడుపుతోన్న లోకేష్ బాబుని   ...దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న హెరిటేజ్ ఫుడ్స్ ఆస్తుల మాటేంటని మీడియా మిత్రులు అడిగారు.
ఇంకోరు ఇంకోరు అయితే   ఒంటికాలిమీద లేచి నిలబడి అగ్గిమీద ఫైరైపోయేవారే.లోకేష్ బాబు మాత్రం  చిరునవ్వు చెదరనివ్వలేదు.
హెరిటేజ్ ఫుడ్స్ గురించి లోకం అంతటికీ తెలుసు కాబట్టి దాని గురించి అడక్కండన్నారాయన.
మరి పార్టీ జాతీయ కార్యదర్శి కూడా లోకేష్ బాబే కదా.

అందుకే మరో మీడియా ప్రతినిథి మీ తెలుగుదేశం పార్టీకి కోట్లకు కోట్ల నిధులు వస్తున్నాయి కదా వాటి లెక్కలేమన్నా..? అని అడిగారు.
ఆ ప్రశ్న పూర్తికాకుండానే లోకేష్ బాబు  కల్పించుకుని పార్టీ అనేది బహిరంగ వ్యవహారం. దాని ఆస్తి పాస్తుల గురించి అందరికీ తెలుసు అది వదిలేయండి అన్నారు.
ఇంత పారదర్శకంగా లోకేష్ బాబు సమాధానాలు ఇస్తోన్నా... కొంతమంది మీడియా వాళ్లకి సంతృప్తే లేదు. ఓ ముసలి జర్నలిస్టు లేచి.. అయ్యా  హెరిటేజ్, తెలుగుదేశం ఆస్తుల గురించి పోనీ అడగం లే ..కానీ.. మరి అమరావతి రాజధాని నగరం చుట్టు పక్కల  మీ బినామీలు..మీ నాన్నగారి బినామీలు..అలాగే మీ మంత్రుల బినామీల పేర్ల మీద కొన్న ఆస్తుల వివరాలు కూడా చెప్దురూ..ఏమీ తోచి చావడం లేదు అని  అడిగారు.
లోకేష్ కి కోపం వచ్చింది. ఎప్పుడు ఏం అడగాలో తెలీకుండా  జర్నలిజంలో ఇన్నేళ్లు ఎలా ఉన్నారండీ బాబూ అని లోలోపలే  సణుక్కున్నారు.

మరో జర్నలిస్టు లేచి అయ్యా మరి సింగపూర్ లో  తమరికి  ఏదో స్టార్ హోటల్ ఉండాలి కదా..దాని లెక్కలు ఏమన్నా చెప్పకూడదూ.. కాలక్షేపంగా ఉంటుంది అని  పళ్లికిలిస్తూ అడిగాడు.
లోకేష్ కి నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి.కర్చీఫ్ తో తుడుచుకుంటూ.. మౌనంగా ఉండిపోయారు.
ఇంకో జర్నలిస్టు కూర్చునే...పట్టిసీమ కాంట్రాక్ట్ లోనూ.. ఇసుక వేలం పాటల్లోనూ  చాలా పెద్ద మొత్తంలో  హార్డ్ క్యాష్ వచ్చిందట కదండీ..దాని ఆడిటింగ్ ఏమన్నా చేయించారేంటి? అని అడిగాడు.
లోకేష్ బాబుకి ఈసారి భయం వేసింది.

పిఏని పిలిచి ఎక్కడ చచ్చావయ్యా..పాపం జర్నలిస్టులందరికీ కూల్ డ్రింక్స్..టిఫిన్లూ అందాయో లేదో చూడు. మర్యాదలకి లోటు రానీయద్దు. అని ఆదేశించాడు.
మీడియా మిత్రులకేసి చూసి  అయ్యా నాకో అర్జంటు పని ఉంది మళ్లీ వస్తాను మీరు ఏం మొహమాటం పడకుండా ఏం కావాలో అది పుచ్చుకోండి మా పియే ఇక్కడే ఉంటాడు " అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్లిపోయాడు.
మరుసటి రోజు  పత్రికల్లో  మెజారిటీ పత్రికలు "  క్షణ తీరికలేని లోకేష్. ఆస్తులు వివరించి...ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో తలమునకలైన లోకేష్" అని బ్యానర్ ఐటెమ్స్ ప్రచురించాయి. 
రెండు మూడు పత్రికల్లో మాత్రం ఆస్తుల వివరాలు అడిగితే  నెమ్మదిగా జారుకున్న లోకేష్ అని కథనాలు ప్రచురించాయి.
-------------------
-----------------l

Back to Top