దిల్లీకి పయనం మళ్లీ మళ్లీ

చంద్రబాబు మరోసారి దిల్లీకి పయనం అవుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న తర్వాత దిల్లీకి వెళ్లిన 29 సార్లు లెక్క అక్కడితో ఆగిపోయింది. అప్పటి వరకూ ఏ కారణాలతో దిల్లీ వెళ్లినా అది మోదీ ఖాతాలోనే వేసేసేవారు బాబుగారు. కానీ బీజేపీతో చెడి తెగతెంపులు అయ్యాక ఇక మోదీని కలిసే సాకు లేకుండా పోయింది పాపం. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నట్టు పబ్లిక్ అయిపోవడంతో విధిలేని స్థితిలో ఏదో వంక లేనిదే దిల్లీ వెళ్లలేని స్థితిలో పడ్డాడు చంద్రబాబు. దాంతో తన లాలూచీల ప్రయాణానికి కొత్త పేర్లు వెతుక్కోవాల్సిన అగత్యం పట్టింది. 
ఏదో కారణంతో దిల్లీకి వెళ్లి చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రకరకాల సాకులు వెతుక్కోవాల్సిన గతి పట్టింది. ఇలాంటి సాకుల్లో ఇవి కొన్ని  ఏపీలో ఐటి, సిబిఐ రైడ్ జరిగితే దిల్లీ పరుగులెత్తి జాతీయ మీడియా ముందు శోకండాలు పెట్టడం చూసాం. ఎప్పటి నుంచో కూటమిగా ఉన్న యూపీఏలో గెంతులేసుకుంటూ చేరేందుకు పదే పదే దిల్లీ వీధుల్లో పరుగులు పెట్టడాన్నీ చూసాం. శాలువాలతో రాజకీయ బంధాల కోసం వెంపర్లాడటాన్నీ గమనించాం. ఇక ఇప్పుడు దిల్లీ పయనానికి మరో కథ కనిపెట్టాడు బాబు. అఖిలేష్ యాదవ్ పై సీబీఐ కేసు నమోదు చేస్తే బాబుగారు పరామర్శిస్తానంటున్నారు. ప్రతిపక్ష నేతలతో ఈ విషయంలో కూలంకషంగా చర్చలు జరిపేందుకే దిల్లీకి ప్రయాణం అంటున్నాడు. తెలంగాణా ఎన్నికల్లో కూటమితో వెళ్లినా కూలబడ్డ అనుభవం బాబుకు భవిష్యత్ పట్ల భయాన్ని అంచలంచెలుగా పెంచేసింది. ఓటమి తథ్యం అన్న సర్వేల నేపధ్యంలో మళ్లీ ప్రాభవం కోసం ప్రాపకం కోసం అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి వెంటాడుతోంది. ప్రజా కూటమిలో పెద్దన్న, బిజేపీ వ్యతిరేక ఫ్రంటుకు పునాది అని ఎంత డప్పు కొట్టుకున్నా ఆ పొత్తులో బాబు ప్రాధాన్యం సున్నా అన్న సంగతి బైటపడనే పడింది. కానీ కాళ్లా వేళ్లా పడి ఏదో జాతీయ ఫ్రంటులో చోటు దక్కించుకోకపోతే రాజకీయ పరువు దక్కదనే బాబు బెంగంతా. ఇక స్టేల ముసుగులో ఉన్న అవినీతిపై తెర తొలగకుండా కాపాడుకునేందుకు దిల్లీ దిక్కుకు దౌడు తీయక తప్పదు. కొత్తగా హైకోర్టు విభజన జరిగింది. తాత్కాలిక భవనాల్లో, తాత్కాలిక వసతుల్లో న్యాయ వ్యవస్థను ఎన్నాళ్లో మేనేజ్ చేయడం కష్టం అని బాబకు బాగా తెలుసు. అందుకే తన మేనేజ్మెంట్ స్కిల్స్ ను సుప్రీం స్థాయిలో వినియోగించేందుకు బాబు దిల్లీ ప్రయాణాలు అనివార్యం. అవసరం. బాబు పరిభాషలో చారిత్రక అవసరం. ప్రజాస్వామిక అవసరం. బాబు ఇలా మళ్లీ మళ్లీ దిల్లీ వెళ్తున్న అవసరాలు ఏమిటో, ఆ అవసరాల సారం ఏమిటో, ఈ దిల్లీ ప్రయాణాల ఫలితం ఏమిటో తెలియాలంటే బాబు రాజధానికెళ్లేదాకా కాస్త ఆగాలి మరి. 
 

Back to Top