దీని భావమేమి తిరుమలేశా


చంద్రభాగ్ రహస్య సమావేశం జరుగుతోంది. ముఖ్యనేతలతో సీక్రెట్ ఆపరేషన్ గురించి సీరియస్ డిస్కషన్ జరుపుతున్నారు. మరో అపురూపమైన అవకాశం. జనాల్లో మన పేరు మారిమోగిపోతుంది అంటున్నాడు ఓ నాయకుడు. అవును ఈసారి కోడు గుడ్లు లాంటివి ఉపయోగిస్తే మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది సలహా ఇచ్చాడు మరో నేత. కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేసినా ప్రజలు మనల్ని నమ్మడం లేదు. కనీసం ఇలా హడావిడి చేసైనా కేంద్రంతో మనం పెద్ద ఫైటింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం అంటున్నాడు ఇంకో నాయకుడు. కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా, వారి మీద కార్యకర్తల దాడి జరిగిందనిపించేలా ఎలాంటి పథకం వేయాలన్న ఆలోచనలో భాగంగా సాగుతున్న సమావేశం అది. 
అన్నీ విన్న చంద్రభాగ్ ఇలా అన్నాడు. తొందరపడకండి. నన్ను ఓ నిర్ణయం తీసుకోనీయండి. మనం ఓ పక్కనించి వాళ్లతో తెగతెంపులు చేసుకున్నట్టు డ్రామా ఆడుతుంటే, వాళ్లేమో మన బండారం అంతా బైటేస్తున్నారు. వచ్చే కేంద్రంమంత్రి కామ్ గా వచ్చి వెళ్లక, నేనొస్తున్నా, చంద్రభాగ్ ని కలుస్తున్నా, కలిసి గోలవరం పర్యటనకు వెళుతున్నా అని అధికారికంగా ప్రకటించేశాడు. దాంతో చూసావా పైకేమో వీళ్లూ వాళ్లూ పేచీ, కానీ లోపలంతా లాలూచీ అని ప్రతిపక్షం వాళ్లు ఏకిపారేస్తున్నారు. దాన్ని కవర్ చేద్దామనే కదా తిరపతిలో ఒకళ్ల మీద రాళ్లేయించింది. నిన్నటికి నిన్న అనంతలో అంతులేని గొడవ చేసిందీ. ఆ పార్టీకి చెందిన నాయకుల మీద ఒంటికాలిమీద లేస్తున్నట్టు హైప్ బిల్డప్ చేయడానికని మనం ఇంత ప్లాన్ చేస్తే అవతలి వాళ్ల ఫెర్ఫార్మెన్స్ సరిగ్గా లేక అందరం ఎలిమినేట్ అయ్యే పొజీషన్లో పడ్డాం అని తల పట్టుకున్నాడు చంద్రభాగ్. వ్యవహారం ఎటూ తేలలేదు. ఈలోగా ప్రెస్ వాళ్లొచ్చారని కబురు రావడంతో సిఎమ్ చంద్రభాగ్ రహస్య సమావేశం ముగించి ప్రసంగ సమావేశానికి వచ్చాడు. వెనకే నాయకులంతా కూడా బిలబిలమని వచ్చారు. 
చంద్రభాగ్ గారూ కేంద్రమంత్రి ఆప్కారీ గారితో గోలవరం పరిశీలనుకు మీరు వెళ్తున్నారట నిజమేనా అడిగాడో విలేకరి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికీ, మీకు పడటం లేదు అంటున్నారు గదా? మీరెలా కలిసి గోలవరానికి వెళుతున్నారు మరో జర్నలిస్టు ప్రశ్న. గోలవరం మా జాతికి వరం. ఆ వరాన్ని ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా మేము పూర్తి చేస్తాం అన్నాడు చంద్రభాగ్. మేం అడిగింది అదికాదు సర్ అన్నారు విలేకరులు. ఎవ్వరేమన్నా....నే చెప్పేదొక్కటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ విధంగా ముందుకు పోతున్నాం అంటూ లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు చంద్రభాగ్. 
ప్రజలను పిచ్చోళ్లని అనుకునే పసుపుదేశ నాయకులకు ఓ విషయం అర్థం కావడం లేదు. నిన్నటిదాకా రాసుకుపూసుకు తిరిగిన ఈ రెండు పార్టీల నేతలు, పైకి ఒకరినికరు తిట్టుకుంటున్నట్టు, కొట్టుకుంటున్నట్టు కనిపించినా అండర్ కరెంటుగా ఇద్దరూ ఒక్కటిగానే ఉన్నారనే విషయాన్ని ప్రజలు చాలా బాగా తెలుసుకున్నారూ అని. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్న వైరి పార్టీ చేస్తున్న ఆగడాలను, కుప్పిగంతులను, తమ పై వేస్తున్న అభాండాలను, విసురుతున్న రాళ్లనూ పట్టించుకోకుండా గమ్మునుందంటే దీనిభావమేమి తిరుమలేశా అని అనుమానంగా ప్రశ్నిస్తున్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top