గాంధీగోరికన్నా.. మా బాబుగోరే...!



మహాత్మ గాంధీగోరికీ.. మా చెందర బాబుగోరీకీ  చాలా పోలికలున్నాయండి బాబయా.
గాంధీగోరిని పుటోల్లోనూ...విగ్రహాల్లోనూ చూడ్డమే తప్ప  మామూలుగా నేరుగా ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబుగోరినైతే  రోజూ టీవీల్ల చూస్తా.
గాంధీగోరు ఏటన్నారండీ బాబూ? కల్లు తాక్కండిరా నాయనలారా అని  చెప్పారు.
సారా తాగితే సెడిపోతార్రా ఎదవల్లారా అని  మంచి చెప్పారు.
మరి మా చెందరబాబుగోరు కూడా అలానే చెప్పును. కానీ... గాంధీగోరి టైం వేరు. బాబుగోరి టైం వేరు మరి. ఇపుడు ఎవరూ మందు తాగకపోతే   రూలింగ్ లో ఉన్న  ఎమ్మెల్యేలూ..వాళ్ల బామ్మర్దులు.. వేలు విడిచిన బంధువులు.. మట్టికొట్టుకుపోతారు.  గాంధీగోరే చెప్పారు కదా గ్రామ సొరాజ్జెం రావాలని.మరి గ్రామాలకు సొరాజ్జెం ఎలా వస్తుంది. అందరూ వ్యాపారాలు చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించాలి కదా. అందుకే చంద్రబాబుగోరు  అధికారంలోకి రాగానే.. వాళ్ల మావగారు పెట్టిన మద్య నిషేధాన్ని తీసి పారేశారు. 

అప్పటినుండి వైన్ షాపులు కల కల్లాడిపోతుననాయి. ఆ పైసలతో పెబుత్వ కజానా గల గల లాడిపోతోంది. వైన్ షాపులు లేవనుకోండి...పాపం యువతకి ఉపాధి కూడా ఉండదు. వైన్ షాపులు ఉంటే.. చీకులు...బోటీలు అమ్ముకునే.. కల్తీ సారాలు తయారు చేసో..  చాలా మంది బతుకుతున్నారు అందుకే  గ్రామసొరాజ్జెం కోసం మా చెందరబాబుగోరు మందుని అందరికీ అందుబాటులోకి తెచ్చారండి బాబయా.
గాంధీగోరేటన్నారంటే... అరద రాతిరి ఆడది  వీధిలోకెళ్లి సేమంగా వస్తేనే దేశానికి నిజంగా సాతంత్రం వచ్చినట్టురా నాయనలారా అన్నారు.
మరం చందరబాబుగోరు అలాగనలేదు మరి. ఎందుకనలేదంటే..  అరదరాతిరేటండీ బాబూ..ఇపుడు పట్టపగలు కూడా  ఆడబిడ్డలపై గోరాలు జరిగిపోతున్నాయి. ఆ గోరాలు చేసేవాళ్లు కూడా  చందరబాబుగోరి పార్టీలోనే ఉన్నారు. ఇక ఆయన వేరే వాళ్లకేటి సెబుతారు. అందుకనే  గమ్మున ఉండిపోనాడాయన.
రైతులు పొలాల్లో   పనులు చేసుకుంటూ ఉంటే.. పొలాలన్నీ పచ్చగా కల కల్లాడిపోతూ ఉంటే... ఆ దేశమే బాగుపడిపోతుందని గాందీగోరు చెప్పారు.
మరి మా చెందరబాబుగోరు ఏటి చెప్పారు?
ఇపుడు ఎగసాయం అంత నాబంగా నేదు కదండీ. అందుసేత పొలాలు మాకిచ్చీయండ్రా..మీకు వేరే చోట జాగాలిప్పిస్తాను.. మీ పొలాల్లో సక్కగా  సింగపూరు మేస్త్రీల చేత బిల్డింగులూ గట్రా కట్టిస్తానూ అని  అంటున్నారు.

ఊరికే ఎగసాయం చేసి రైతులు నట్టపోతారనే... చందరబాబుగోరు రునమాపీ కూడా చేయకుండా ఆగిపోనారు. డబ్బులు నేకపోతే  రైతులు ఎగసాయం చేయనేరు కదా. 
చూశారా గాంధీగోరిలాగే మా చెందరబాబుగోరు ఏం చేసినా  అయింసతోనే చేత్తారు.
అయింస అంటే అంత ఇట్టం కాబట్టే... ఏ పని చేసినా అపోజిసనోళ్లకి ఏమీ సెప్పకుండా చేత్తారు. ఎందుకంటే బాబూ.. అపోజిసనోళ్లని పిలిచి ఒరేయ్ నాకు నచ్చిన చోట రాజదాని కడతాన్రా అని మంచిగా చెప్పారనుకోండి..వాళ్లూరుకోరు కదా. చట్..ఇక్కడ కట్టడానికి వీల్లేదని యాగీ చేత్తారు.గొడవ చేత్తారు. అపుడు వాళ్లని  లాటీలతో కొట్టించి బొక్కలోకి తోసేయాల్సివస్తుంది. అయన్నీ ఎందుకులే అని..పాపం చెందరబాబుగోరు  ఏం చేసినా తానూ.. తన కొడుకు  లోకేస్ బాబు కలిసి ఆలోచించే   చేయాల్సింది చేసుకుపోతున్నారు. అపోజిసనోళ్లకి ఇక వేరే పనేదీ ఉండదు కదండీ..అందుకే చంద్రబాబుగోరు ఏకపచ్చంగా  ఎవ్వారాలు నడుపుతున్నారని  పెచారం చేస్తున్నారు.

అసలు పట్టిసీమ పక్కనే సబర్మతి ఆసరమంలా ఓ ఆసరమం కట్టాలని చెందరబాబుగోరు కూడా ఆలోచించారండీ బాబూ... అందుకే పట్టి సీమ కాలువని ఈ మధ్యనే నది కింద మార్చేశారు. అంతా గాందీగోరి లెక్కే అనుకోండి.
గాందీగోరేమో అప్పుడు ఇదేసీ  వస్తువులననీ తగల బెట్టించీసినారు.
అన్ని  సొదేసీ సామాన్లే వాడాలని  చెప్పినారు.
ఇపుడు రోజులు మారిపోనాయి కదండీ. అందుకే మా చెందరబాబుగోరు  సొదేసీ  ఇంజనీర్లు..వాళ్ల డిజైన్లు వద్దని చెప్పేసినారు.
చక్కగా సింగపూరు..జపాను.. చైనా.. దేశాల  వింజనీర్లని రప్పించి  రాజదాని బవనాలని కట్టిస్తున్నారు.
 గాందీగోరేమే సత్యమేవ జయతే అన్నారు.

మా సెందరబాబుగోరు  కేందరం కన్నా ..అందరి కన్నా తెలివైనోరు కదండీ..అందుకే గాందీగోరు సత్తెకాలపు మడిసి..ఆయనకి ఏటీ తెలీదు..అని..   కనిపెట్టీసినారు.
అందుకే  అసత్యమేవ జయలే అని చెందరబాబుగోరు చెబుతున్నారు.
అది కరెట్టేగదండీ. అదండీ మరి మా బాబుగోరి లెక్క.
గాంధీబాబుగోరి దగ్గరైనా కర్ర ఉందండి.ఎవరినైనా కొట్టడానికి.
పాపం మా చెందరబాబు దగ్గర ఆ కర్రకూడా ఉండదండి. 
చాలా పెసాంతమైన మడిసండీ బాబూ.
గాందీగోరిలాగే.. మా సెందరబాబుగోరి పుట్టిన రోజు నాడు కూడ దేశానికి సెలవు ఇవ్వాలని నేను డిమాండ్ చేత్తన్నానండి బాబయా.
మీలో ఎవరికైనా  మోదీ గోరు పరిచయం ఉంటే.. బాబుగోరి పుట్టినరోజకి సెలవిప్పించమని చెప్పండి మరి.
---------------
Back to Top