సిఎంగాలితీసిన జెసి

జేసీ దివాకర్ రెడ్డి
సెల్ఫ్ మేడ్ ఎకె 47 అనొచ్చు. ఆయన ఫైరింగ్ మొదలుపెడితే ముందుగా బలయ్యేది టిడిపి నాయకులే. ప్రతిపక్షం కంటే అధికార
పక్షనేతలనే ఎక్కువగా విమర్శిస్తాడాయన. టిడిపి వైఖరి గురించి, చంద్రబాబు గురించి, తెలుగు తమ్ముళ్ల గురించి
మరోసారి ఉన్నదున్నట్టు చెప్పేసారు జెసి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మూన్నాళ్లుగా సిఎం రమేష్
చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు వచ్చి నేను దీనికి మద్దతివ్వడానికేం రాలేదు అన్నాడు. అసలు మీరు చేసేదే దండగమారి
దీక్ష, అసలిదెందుకు చేస్తున్నట్టు? అని దీక్షా స్థలిలోనే కుండబద్దలు కొట్టాడు. ఓ ఎమ్.పి ఓ ఎమ్మెల్సీ కలిసి
దీక్ష చేస్తే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తుందా అని కూడా సూటిగా అడిగేశాడు.

సిఎమ్ చంద్రబాబు లాగే
ఏదో దీక్ష పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుందామని, ప్రజల్లో కాస్త మైలేజ్ సంపాదిద్దామని ప్లానేసిన తెలుగు
దేశం నాయకులు సిఎం. రమేష్, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినంత
పనైంది. ఈ దీక్షలు శుద్ధ దండగ, పరమ వేస్టు అంటూ చెప్పడంతో అనుకున్నదొక్కటి అయినది
ఒక్కటి అయింది. ఇదే సమయంలో జెసి వైఎస్సార్ గురించి కూడా మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి
అంటే తనకెంతో అభిమానం అని చెప్పాడు. ఆయన వల్లే గండికోట ప్రాజెక్టు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. కేంద్రం నుంచి దేన్నైనా
సాధించుకోవడం ఆయనకే చెల్లిందనే ఉద్దేశ్యంలో జెసి మాట్లాడుతున్నాడని అక్కడున్న అందరికీ
అర్థం అయ్యింది. ముఖ్యమంత్రి కానీ, సిఎం. రమేష్ ఇంకా ఎంపీలు కానీ రాష్ట్రానికి అలాంటి ఒక్క ప్రాజెక్టును
సాధించుకోలేకపోయారనే విషయాన్ని క్లియర్ గా తన మాటల్లో వ్యక్తం చేసాడు జెసి.

వైఎస్సార్ గురించి మాట్లాడాక
చంద్రబాబుపైకి గురిపెట్టాడు జెసి. బాబు మాయలోడు, జిత్తులమారి అని సర్టిఫై చేసాడు. ఆయన ఏదైనా చేయగల సమర్ధుడంటూ
చురకలంటించాడు. రాష్ట్రానికి కావాల్సినవేం సాధించపోయినా ఏదో ఒకటి చేసి రాజకీయాలు చేయగలడని
బాబును బాహాటంగానే విమర్శించేశాడు జెసి. ఇది విన్న దీక్షా శిబిరంలోని తెలుగు తమ్ముళ్లకు నిరాహారదీక్ష
కంటే ఎక్కువగా నీరసం ముంచుకొచ్చేసింది. జెసి వాక్ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ
చేయలేకపోయారు. ఎందుకంటే గతంలో మహానాడులో చంద్రబాబు ముందే ప్రసంగాన్ని ఆపమంటే గదమాయించి మరీ
తాను అనుకున్నదంతా చెప్పిన విషయం వాళ్లందరికీ గుర్తుండే ఉంటుంది.  పావుగంట పాటు టిడిపిని ఉతికారేసి కానీ స్టేజ్ దిగలేదు
జెసి. మొత్తానికి టిడిపి చేస్తున్న ఉక్కుదీక్ష రాజకీయం ఉత్తి దీక్ష అని తేల్చేసి
చక్కా పోయాడు జెసి దివాకర్ రెడ్డి. సెల్ప్ గోలింగ్ విషయంలో టిడిపి నేతలు ఒకరినిమించి ఒకరున్నారని
నవ్వుకోవడం ప్రజల వంతైంది. 

Back to Top