చింతమనేని ధర్మాగ్రహం

చట్టాల  సాకుతో  ప్రభుత్వాధికారులు   ప్రజాప్రతినిథులను వేధించుకు తింటున్నారు.
పాలక పక్షంలో ఉండీ కూడా అలాంటి ప్రజాప్రతినిథులు ఎంతో సహనంతో సద్దుకుపోతున్నారు.
సహన శీలతకు నిలువెత్తు నిదర్శనం మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే.
కొల్లేరు  సరస్సులో ఆహ్లాదకరమైన పక్షుల అభయారణ్యం లో   చింతమనేని ఓ రోడ్డు నిర్మించారు.
ప్రజాప్రతినిథిగా పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా ..అర్ధరాత్రి  ఒంటిగంట  ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మించారు. రోడ్డుతో చుట్టు పక్కల వారికి రవాణా సదుపాయం కలుగుతుందని చింతమనేని ఆలోచన.

అయితే  అపార్ధం చేసుకున్న అటవీశాఖ  అధికారులు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోబోయారు. ప్రజలకోసం ఓ మంచి పని చేస్తోంటే  అడ్డుపడతారా అని ఆగ్రహించిన చింతమనేని అనుచరులు అటవీ శాఖ  సిబ్బందిపై దాడి చేసి రెండిచ్చుకున్నారు. ఇది చింతమనేని ధర్మాగ్రహం అని అర్ధం చేసుకోవాలి.

చింతమనేనికి ధర్మాగ్రహం రావడం అనేది ఇదే మొదటి సారి కాదు.
తరచుగా ఆయనకు ధర్మాగ్రహం వస్తూనే ఉంటుంది.
ఇళ్లు కట్టుకునే వారికి సకాలంలో  ఇసుక దొరకడం లేదని తెలుసుకుని..  ప్రజాసంక్షేమం కోసం... నిబంధనలు ఒప్పుకోవని తెలిసీ కూడా చింతమనేని  గతంలో ఇసుక  తవ్వకాలు చేపట్టినపుడు తహసిల్దార్ వనజాక్షి అడ్డు పడ్డిన సంగతి తెలిసిందే. అప్పుడూ ధర్మాగ్రహం గుండెల్లోంచి తన్నుకొచ్చేసి..వనజాక్షిపై చింతమనేని దాడి చేయక తప్పింది కాదు.

రెవిన్యూ, అటవీశాఖ అధికారులే కాదు..పోలీసు అధికారులూ చింతమనేనిని పదే  పదే విసిగిస్తూనే ఉన్నారు. వాళ్లు విసిగించినప్పుడల్లా చింతమనేనికి ధర్మాగ్రహం రావడం...చింతమనేని అనుచరులు ఆ పోలీసులపై దాడులు చేయడం కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది.
నాకు ధర్మాగ్రహం తెప్పించకండర్రా అని చింతమనేని ఎంత శాంతంగా విజ్ఞప్తి చేసినా..చేతులు జోడించి ప్రాధేయపడినా..అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

ఓ సారిలాగే పండగరోజుల్లో  అందరికీ కాలక్షేపంగా ఉంటుందని చింతమనేని  కోళ్ల పందేలు, పేకాట  పెట్టించారు. వాటిలో ఆయన కూడా పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కానీ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దాంతో చింతమనేనికి ఒళ్లు మండుకొచ్చినా దాన్ని అణచివేసుకుని... ఆ పోలీసు అధికారి జేబులోని తుపాకీ లాక్కుని  ఊరికే బెదిరించి పంపేశారు చింతమనేని.  అంత శాంతమూర్తి అన్నమాట.
పదే పదే పోలీసులు విసిగించినా  రెచ్చిపోకుండా సంయమనంతో ఉండే చింతమనేనిని ఏమీ చేయలేక పోలీసులు..ఆయన పై రౌడీ షీట్ కూడా తెరిచారు. చింతమనేని పై పోలీసులు గిట్టక  పెట్టిన కేసులు 40 దాకా ఉంటాయి.

ఎంత కోపం వచ్చినా ధర్మాగ్రహంతో సరిపెట్టేసుకుంటారు కాబట్టే  చింతమనేని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వల్లమాలిన ఇష్టం.ఆ కారణంగానే  చింతమనేని కి  ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చి  ప్రోత్సహించారు చంద్రబాబు. ఇసుక దందాలో వనజాక్షిని పిలిచి మందలించారే తప్ప చంద్రబాబు నాయుడు చింతమనేనిని ఏమీ అనలేదు. ఎందుకంటే ఏమన్నా అంటే చింతమనేనికి ఎక్కడ ధర్మాగ్రహం వస్తుందో ..అది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని చంద్రబాబు  డైలమా.

ఇంతకీ మన  చింతమనేని కొల్లేరు లో  నిర్మించిన రోడ్డును ఆనుకునే చింతమనేనికి సంబంధించిన  వందలాది ఎకరాల చేపల చెరువు కూడా ఉందట. ఆ విషయం నిజానికి చింతమనేనికి గుర్తు లేదు. ప్రజలకోసమే ఆయన రో్డ్డు కట్టారు.కానీ అధికారులు మాత్రం ఆయన తన  చేపల చెరువ కోసమే రోడ్డు కట్టారని..రూల్స్ తప్పారని ఏవేవో ఆరోపణలు చేసి కేసులు కూడా పెట్టారు.
అయినా ఏం ఫర్వాలేదు.

నిజాయితీ పరులను కాపాడ్డానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ....
చింతమనేనికి ఏమీ కాదు.

-కవికాకి
---------------------
Back to Top