చెత్త పలుకుల క్షుద్రజ్యోతి

"నేను యూ టర్న్ తీసుకోలేదు. మీరే
తీసుకున్నారు"

"నేను మోసం చెయ్యలేదు ...మీరే
మోసం చేశారు"

"నేను అబద్ధాలు చెప్పడం లేదు...మీరే
అబద్ధాలు చెబుతున్నారు"

"నేను మీకంటే సీనియర్ ను"

"నేను పాకేజికి ఒప్పుకోలేదు"

నలభై సంవత్సరాల అనుభవం కలిగిన
నాయకుడినుంచి ఇలాంటి ప్రకటనలు ఊహించగలమా? "నేను పిచ్చోడిని కాదు... నువ్వే పిచ్చోడివి...నీ అబ్బ పిచ్చోడు.. నీ
తాత పిచ్చోడు" అని చిన్నపుడు పిల్లలు ఆదుకునే తొండాటలకు, చంద్రబాబు మాటలకు ఏమైనా తేడా ఉన్నదా?

చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి
మోడీ ప్రయత్నం చేశారట! మరి చంద్రబాబు చేసింది ఏమిటి? బీజేపీతో బంధాలు తెంచుకున్న తరువాత బీజేపీని దోషిగా నిలబెట్టడానికి
చెయ్యని ప్రయత్నం ఉన్నదా? నాలుగేళ్లు కేంద్రంలో అధికారాన్ని
పంచుకుని ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి చేసిన మహోద్యమానికి వెరచి, ఒక్కసారిగా పాకేజీ నుంచి ప్రత్యేకహోదాపై యూ టర్న్ తీసుకోవడం పరిణితి
అనిపించుకుంటుందా? అసలు పోలవరం నిర్మాణ బాధ్యత
కేంద్రానిది అని విభజన చట్టంలో ఉన్నపుడు అదేదో కేంద్రం నెత్తిన వెయ్యకుండా,
కమీషన్లకు ఆ పోలవరాన్ని బలవంతంగా లాక్కోవడం,
దాని కాంట్రాక్టును తెలుగుదేశం ఎంపీకి కట్టబెట్టడం
లో ఏమైనా పరిణితి ఉన్నదా? చట్టం ప్రకారం కేంద్రం పోలవరాన్ని
నిర్మించకపోతే అప్పుడు బీజేపీని దోషిగా నిలబెట్టినా ఒక అర్ధం ఉంటుంది. ప్రజలు కూడా
నమ్ముతారు. కానీ, చంద్రబాబు ఎందుకు ఆ పని చేయలేకపోయారు?
ఎవరికోసం తీసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం
సింగపూర్ కంపెనీల వెంటపడుతున్న చంద్రబాబు పోలవరాన్ని కూడా సింగపూరుకో, జపానుకో ఇవ్వక తన పార్టీ ఎంపీకి ఎందుకు కట్టబెట్టారు?

 ప్రత్యేకహోదా పేరుతొ ప్రజల
భావోద్వేగాలను రెచ్చగొట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఉన్నారని మరో చెత్త
వాగుడు! ప్రతిపక్ష నేత మీటింగ్స్ ను కవర్ చెయ్యడానికి కూడా పచ్చకామెర్లు
కమ్మినపుడు జగన్ చేస్తున్న పోరాటం ఎలా కనిపిస్తుంది? నిన్నకూడా ప్రత్యేక హోదా కావాల్సిందే అని జగన్ ప్రెస్ మీట్ లో
ఉద్ఘాటించిన విషయం వినపడకపోవడానికి చెవుల్లో చెట్లు మొలవడమే కారణం కావచ్చు!

ఇక రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ పార్లమెంట్ లో దంచేసారు అని మెచ్చుకున్నారు బాధాకృష్ణ.
ఎస్... ఆ ఇద్దరూ చక్కగా మాట్లాడారు. వారికి విషయపరిజ్ఞానం ఉన్నది, భాషాజ్ఞానం ఉన్నది. అలాంటి యువకులు మాకు గర్వకారణం అని తన వీపును
తానె చరుచుకున్న చంద్రబాబు నాలుగేళ్లక్రితం మోడీ కాబినెట్ లో మహా అసమర్ధుడు అశోక్
గజపతి రాజు, అవినీతి చక్రవర్తి సుజనాచౌదరిలకు
బదులుగా రామ్మోహన్, గల్లాలను ఎందుకు చేర్పించలేదు? అసలు కేంద్రంతో పోరాటం చెయ్యాలని, కొట్లాడి సాధించుకోవాలని మూడేళ్ళక్రితం రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో
వాదించినపుడు అతని ఆవేశాన్ని చంద్రబాబు ఎందుకు అణిచివేశారు? పోట్లాడితే ఏమీ రాదని ఎందుకు నిరుత్సాహపరిచారు?

"హోదా వలన ఏమీ రాదని, హోదా కలిగున్న రాష్ట్రాలు ఏమి బావుకున్నాయని, అందుకే ఒక సీనియర్ నాయకుడిగా, ఒక విజన్ ఉన్నవాడిగా, ఒక ముఖ్యమంత్రిగా నేను పాకేజికి
అంగీకరించాను" అని చంద్రబాబు అసెంబ్లీలో గుండెలు బాదుకుంటూ ప్రకటించలేదా?
ఆ సమయంలో పాకేజీ వద్దని జగన్ మోహన్ రెడ్డి
మొత్తుకున్నా అది ఆ గాంధారి సుతుల పేరోలగంలో అరణ్యరోదన కాలేదా? మరి తెలుగుదేశం ఎంపీల ఆవేదన అంతా అరణ్యరోదన అయిందని బాధాకృష్ణ
మొత్తుకోవడంలో అర్ధముందా?

ఇక మోడీ వ్యక్తిత్వాన్ని భ్రష్టు
పట్టించడానికి బాధాకృష్ణ నానా వ్యర్ధయత్నాలు చేసాడు. బీజేపీకి ఎనలేని సేవలు చేసిన,
తన ఎదుగుదలకు దోహదం చేసిన అద్వానీని మోడీ
తొక్కేశారట! మరి చంద్రబాబు చేసింది ఏమిటి? కాంగ్రెస్
పార్టీలో ఓడిపోయినా, కేవలం అల్లుడు అనే బంధుప్రీతితో తన
పార్టీలో చేర్చుకుని, అనేకపదవులు ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, చివరకు మంత్రిని
కూడా చేసిన మామ ఎన్టీఆర్ కు ఏకంగా స్వర్గలోకానికే టికెట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది
కాదా?

ప్రధాని తీరు ఇలాగా అంటూ హేళన చేసిన
బాధాకృష్ణకు చంద్రబాబు తీరు ఎలా ఉన్నదో కనిపించడం లేదా? ప్రతిపక్షం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలను, ఎంపీలను పశువులకన్నా హీనంగా కొనుగోలు చేసి, ప్రతిపక్షం గొంతును అసెంబ్లీలో నొక్కేసి, చివరకు వారు సభను బహిష్కరించేంత తీవ్రచర్యకు పూనుకోవడానికి కారకులు
చంద్రబాబు కాదా?

 ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు తమ
పదవులను తృణప్రాయంగా వదులుకున్నప్పుడు, హోదా కావాలని
నిజంగా అనుకుంటే తెలుగుదేశం ఎంపీలు కూడా ఎందుకు రాజీనామాలు చెయ్యలేదు? ఇప్పటికైనా మునిగింది లేదు. నెలరోజుల లోగా హోదా ఇవ్వకపోతే రాజీనామా
చేస్తాం అని చంద్రబాబు ప్రకటిస్తే కేంద్రం దిగివస్తుంది. హోదా తెచ్చిన ఖ్యాతి
చంద్రబాబు ఖాతాలోకే వెళ్లనీ, మళ్ళీ చంద్రబాబే అధికారం చేపట్టనీ....
అభ్యంతరం లేదు. అసలు అలా సవాలు విసిరే సాహసం చంద్రబాబుకు ఉన్నదా?

నాకు బాగా గుర్తుంది. గత నాలుగేళ్లలో
చంద్రబాబు ఇరవైతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్ళినప్రతిసారి మోడీ, కేంద్రమంత్రులు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకరి భుజాలు ఒకరు
తట్టుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. కానీ, ఎప్పుడైతే
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పోయారో... ఆ తరువాత మోడీ ఆయనకు
అపాయింట్మెంట్ ఇవ్వలేదు! కావాలంటే ఒకసారి పాత పత్రికలూ, వీడియోలు తిరగేసుకోండి! చంద్రబాబు ఆ కేసులో బుక్ కావడమే ఆంద్రప్రదేశ్
పతనానికి తొలి మెట్టు వేసింది!

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి,
ప్యాకేజీలు రాకపోవడానికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడానికి కారకులు ముమ్మాటికి
చంద్రబాబే. ఇతరుల నెత్తిన మన్నువేసి తాను తప్పించుకోవాలనుకుంటే ప్రజలు సహించరు.
క్షమించరు.

అప్పుడెప్పుడో చంద్రబాబు ను యూ టర్న్
అంకుల్ అని సంబోధించారు విజయసాయిరెడ్డి. మొన్న మోడీ కూడా అదే మాట అన్నారు.
మనుషులను బట్టి దోషులకు సంబోధనలు మారవు!

"మోడీ...ఏపీ చేసిన పాపం ఏమిటి?"
అని ప్రశ్నించారు బాధాకృష్ణ.. చంద్రబాబును
ఎన్నుకోవడమే ఏపీ చేసిన మహాపాపం!

Written by Ilapavuluri

Back to Top