చేతులు చెబుతున్న సత్యం

మోకాల్లోతు బురదలో కాళ్లీడ్చుకుంటూ స్టేడియంలోకి వెళ్లిన అంగనవాడీలకు చంద్రబాబు తీరు అసహనానికి గురిచేసింది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించకపోగా, ప్రభుత్వానికి ప్రచారం చేయండంటూ పదేపదే అడగడం చిరాకు తెప్పిస్తోంది. అంగన్ వాడీ కార్యకర్తల అవగాహనా సదస్సు విజయవాడలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు అక్కడకు వచ్చారు. లోపలికి వెళ్లడమే ఓ యాతన అంటే, అక్కడ బాబుగారి ప్రసగం మరో యమ యాతన అనుకుంటున్నారు. సెల్ ఫోన్లు ఇచ్చాం కదా, అందుకున్నవారు చేతులెత్తండి అని అడిగారు ముఖ్యమంత్రి. ఇంత వరకూ ఫోన్లు అందకపోయినా ముఖ్యమంత్రి అలా అడగడంతో ఆశ్చర్యపోయారు అంగన్ వాడీ కార్యకర్తలు. మాకేఫోన్లూ అందలేదంటూ సమాధానం ఇచ్చారు. ఆగస్టులో అందరికీ ఫోన్లు ఇస్తాం, బాగా పని చేయండి, సేవ చేయండి అని చెప్పారు ముఖ్యమంత్రి. సేవ అంటే మా ఉద్యోగంలో చేయాలా, మీ ప్రభుత్వం గురించి ప్రచారం చేసి మీకు చేయాలా అనుకూంటూ మండి పడ్డారు కొందరు కార్యకర్తలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మళ్లీ అడగొద్దు అనేశారు చంద్రబాబు. మీకు జీతాలు పెంచాం అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. 
బాబుతీరుతో అధికారులు, అటు ఉద్యోగులూ బేజారౌతున్నారు. జీతం పెంచాం ప్రభుత్వం గురించి ప్రచారం చేయండి అంటున్నారు బాబుగారు. ఎంత మంది నా పాలనలో సంతృప్తిగా ఉన్నారో చేతులెత్తండి అంటున్నారు. గ్రామ సభల్లో పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయా చేతులు పైకెత్తండి అంటున్నారు. నాకు ఓట్లేస్తారు కదూ! వేసేవాళ్లంతా చేతులెత్తండి అంటున్నారు. కానీ ఎక్కడా బాబుగారు ఆశించినట్టు చేతులు పైకి లేవడం లేదు. ఇది బాబుగారిని చాలా అసంతృప్తికి గురి చేస్తోంది. రాష్ట్రంలో సంతృప్త స్థాయిని పెంచలేక, తన అంసతృప్తికి మందు లేక తెగ మదన పడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తానికి బాబు గారి సర్వేల కన్నా ఇలా సభల్లో చేతులెత్తమన్నప్పుడే సరైన రిజల్టు తెలిసిపోతోందిట.  


 
Back to Top