చంద్రబాబు హోలీ మొదలుపెట్టాడు. అందరిపైన రంగులు చల్లాడు. ఏ పనిలో అయినా మైక్ తీసుకొని గంటల తరబడి మాట్లాడటం అలవాటు కాబట్టి, అదే తరమాలో మైక్ తీసుకుని స్పీచ్ ప్రారంభించాడు.
`` ప్రియమైన ప్రజలారా, మా హయాంలో మీకందరికీ రంగుపడుద్ది, రంగులంటే నాకు చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్లో వుంచడానికి ఇష్టపడతాను. బేసిక్‌గా నాకు అన్ని రంగులు ఇష్టం.

నలుపంటే చీకటి, అంటే తెరచాటు పనులన్నీ చీకట్లోనే చేయాలి. మామకి వెన్నుపోటు పొడిచినా,ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్ని కొన్నట్టు కొన్నా... అన్నీ బ్లాక్‌లోనే జరగాలి. నలుపు నారాయణ మెచ్చు అంటారు. అంటే ధైవభక్తి కూడా చీకట్లోనే చేయాలి.

తెలుపంటే అందరూ కాంతి అనుకుంటారు. కానీ తెల్లజెండా అంటే ఇష్టం నాకు ... తోకముడిచినపుడు తెల్లజెండా చూపాలి. సమస్యలు ఎదురైనపుడు తెల్లజెండా వూపాలి. ఓటుకు నోటు కేసులో ఇరుకున్నపుడు నేను మోదీ దగ్గర తెల్లజెండా ఎత్తాను. అందుకే రాష్ట్రానికి ఎంత హాని జరిగినా నోరువిప్పను.

పసుపు గురించి మీకంతా తెలుసు. అది మా పార్టీ గుర్తు, పార్టీలోనే పచ్చకామెర్లు వుండటం వల్ల జాండీస్ వచ్చినా మేము భయపడం. లోకమంతా పచ్చగా మాకెందుకు కనిపింస్తుంది అంటే అది కామెర్ల ప్రభావమే, పచ్చ అద్దాలు పెట్టుకుని చూడండి. రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా మీకు కనిపించదు.

ఇక ఎరుపంటే డేంజరా, ఎరుపు రంగుని ఇష్టపడడం వల్లే అంగన్‌వాడీలని గుర్రాలతో తొక్కించాను. వామపక్షాలను తుపాకీలతో కాల్పించాను. వాళ్ళ పార్టీ రంగుని వాళ్ళ కళ్ళకు చూపించాను. ఇప్పుడు కూడా నిజాన్ని బయటకి తీసేవాళ్ళపై దాడులు చేయించినా, విలేకరులపై కేసులు పెట్టించినా ఈ ఎరుపు రంగుపై నాకు వుండే మమకారం వల్లే. `` ఇలా బాబు చెబుతూ వుండగా రంగుల నీళ్లు తెచ్చి బాబు పై పోసారు. ఆశ్చర్యంగా ఒంటిమీద రంగులన్నీ రకరకలుగా మారిపోయాయి. పసుపు నీలంగానూ,ఆకుపచ్చ ఎర్రగా, ఇలా ఏ రంగు మునుపటిలాలేదు.

అందరి వైపు నవ్వుతూ చూస్తూ బాబు `` ప్రజలారా మీరు కంగారు పడకండి. అది రంగుల కంపెనిలోపం కాదు. నా స్పెషాలిటీ, వూసరవెల్లిలా రంగులు మార్చే అలవాటు వుండడంవల్ల, నా శరీరంపై ఏ రంగు వేసినా అది ఆటోమేటిగ్గా వేరే కలర్‌లోకి మారిపోతుంది. రంగులు మార్చడం వల్లే ఇన్నాళ్ళుగా రాజకీయాల్లోవున్నా. నిజానికి నేను నడిచే హోలీని. రకరకాల రంగుల వేషాలతో తిరుగుతూ వుంటా. నా అసలు రంగేంటో నాకే తెలియదు. I am a ruler with different colours. మీ జీవితం మారదు. నా జీవితం రంగుల మయం కావడానికే నాలో ఈ రంగులు మార్చే గుణమే కారణం.’’ అని బాబు లెక్క తేల్చారు.