చంద్ర‌బాబు రూటే.. సెప‌రేటు..!

పట్టు వదలని విక్రమార్కుడు హుషారుగా ఉన్నాడు.
తనలో తానే నవ్వుకుంటూ శవం కోసం చెట్టువైపు  నడుస్తున్నాడు.
విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడికీ నవ్వొచ్చింది.
విక్రమార్కుడు దగ్గరకు రాగానే .....
"ఏంటి విక్రమార్కా..! ఏంటి సంగతి?" అని అడిగాడు.
దానికి విక్రమార్కుడు   నవ్వేసి...
" బేతాళా  ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశాలు అయిదు రోజుల పాటు నిర్వహించారు. ఎన్నో ముఖ్యమైన అంశాల పై చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి...సమావేశాలను కనీసం 15 రోజుల పాటు అయినా జరపాలని ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్నిరోజులు సమావేశాలు జరపలేం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా..అయిదు రోజుల సమావేశాల్లోనే ఏ అంశం  పైన అయినా తాము చర్చకు రెడీ అన్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాక ఏ అంశం పైనా ప్రతిపక్ష నేత మాట్లాడ్డానికి వీల్లేకుండా మైక్ కట్ చేసేశారు.

ప్రత్యేక హోదా పై  కంగాళీగా మాట్లాడి మరింత అయోమయం సృష్టించారు. రిషితేశ్వరి అంశం లో ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎందుక చర్యలు తీసుకోలేదో చెప్పలేదు. కరవు పై చర్చకు అడిగితే  ప్రభుత్వం  వెనుకంజ వేసింది. పట్టి సీమ ప్రాజెక్టు  విషయంలోనూ ..పోలవరం ప్రాజెక్టు పైనా క్లారిటీ ఇవ్వలేదు.చివరకు సమావేశాల అయిదో రోజున ఓటుకు  కోట్లు కేసు పై చర్చకు పట్టుబట్టిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు సమావేశాలకే రాలేదు. ఏ విషయం పైన అయినా చర్చిస్తామన్న చంద్రబాబు ఎందుక మొహం చాటేశారు? అసెంబ్లీ లో ఉండీ కూడా సభలోకి ఎందుకు రాలేదు? " వీటికి సమాధానాలు తెలిసీ కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి చెక్కలైపోతుంది " అని బేతాళుడు ముగించాడు.

విక్రమార్కుడు  చిరునవ్వు చిందించి...
" బేతాళా.. నీకు రాజకీయాలు..లాజిక్కులూ ఓ పట్టాన అర్ధం కావయ్యా బాబూ. అదే నీతో వచ్చింది. సరే చెబుతాను విను. వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ  అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరపాలని అడిగినపుడే తెలుగుదేశం పార్టీ నేతలకు..చంద్రబాబుకూ కంగారు పట్టుకుంది. సభలో ఏ అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే లేదు.

ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో అసలు హోదా అవసరమే లేదని టిడిపి భావిస్తోంది. ఆ విషయాన్నే చంద్రబాబు బయట పెట్టారు కూడా. హోదా సంజీవని కాదని ఆయన అన్నది అందుకే. ఇక రిషితేశ్వరి కేసే తీసుకో..ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని నివేదికలు సూచించినా  తెలుగుదేశం  ప్రభుత్వం ప్రిన్సిపాల్ ను కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి అంశంపై అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడగలుగుతారు.

పట్టి సీమ ప్రాజెక్టు మీద ఆయన మాట్లాడినపుడు కూడా.. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వర్ధంతి రోజున ఆయనకు నివాళి అర్పించుకోడానికి ఇడుపుల పాయ వెళ్లిన సందర్బాన్ని చూసుకుని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడాం అనిపించారు. కానీ చాలా అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు. పోలవరం పై క్లారిటీ కూడా ఇవ్వలేదు. కరవు పై చర్చ లో పాల్గొంటే... రైతుల రుణమాఫీ కాకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న  భయంకర వాస్తవాన్ని  ప్రతిపక్షం లేవనెత్తుతుంది. అందుకే ఆ చర్చకూ ప్రభుత్వం వెనకాడింది.

చివరాఖరుగా ఓటుకు కోట్లు అంశం పై  చంద్రబాబు సభలోకి రాలేదేం అని అడుగుతున్నావు కానీ..వచ్చి ఆయనేం మాట్లాడగలుగుతారు?  రేవంత్ రెడ్డికి  డబ్బులిచ్చి పంపింది కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. స్టీఫెన్ సన్ కి చంద్రబాబు భరోసా ఇస్తూ మాట్లాడినదంతా టేపుల్లో రికార్డు అయ్యింది. ఫోరెన్సిక్  ల్యాబ్ నివేదికలు ఆ వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించేశాయి. ఎటూ తప్పించుకోడానికి లేదు కాబట్టే..సభలోకి వస్తే..ప్రతిపక్షం బోనులో నిలబెడుతుందని చంద్రబాబు భయ పడ్డారు. ప్రతిపక్షానికి ఆ అవకాశం ఇవ్వకూడదనే ఆయన  శుభ్రంగా అసెంబ్లీలోని తన ఛాంబర్ లో రిలాక్స్‌డ్  గా కూర్చుని టీవీలు చూస్తూ.. కాలక్షేపం చేశారు" అని విక్రమార్కుడు ముగించాడు.

విక్రమార్కుడు కళ్లకు కట్టినట్లు వివరించడంతో సంతుష్టుడైన బేతాళుడు అమాంతం మాయమై చెట్టుకి వేలాడాడు.
-వీర పిశాచి.

తాజా ఫోటోలు

Back to Top