బాబు మందోపనిషత్తు

ఐఎఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు
మీలో ఈ వాలెట్ వాడుతున్నవాళ్లు చేతులెత్తండి అన్నాడు బాబు
కొద్ది మంది మాత్రమే చేతులెత్తారు
మీకంటే  ముందుబాబులే నయం. సాయంత్రమయ్యే సరికి కార్డుగోకి గుర్రమెక్కుతున్నారు. మీరింకా పాతపద్దతుల్నే పట్టుకొని వేలాడుతున్నారు అన్నాడు బాబు
ఐఎఎస్ అధికారుల కంటే మందుబాబులే మేలని అన్న మొదటి ముఖ్యమంత్రి మీరే. మందుబాబులపైన మీకెందుకంత ప్రేమ అని అడిగాడో అధికారి
చంద్రబాబు గొంతు సవరించుకొని మందు అనే పదంలోనే మనది అనే స్వార్థముంది. తాగడం వల్ల మెదడు పనిచేయదు. మెదడు పనిచేయకపోవడం ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది. నిజంగా జనానికి మెదడే పనిచేస్తే నన్ను మళ్లీ ఎన్నుకుంటారా?
అందువల్ల మత్తు మానవ మనుగడకి ఎంతో మంచిది. ఇది తెలియక ఎన్టీఆర్ మద్యనిషేధం పెట్టాడు. మందుబాబులంతా ఆయనపై పగబట్టారు. నేను వెన్నుపోటు పొడిచినా జనం నమ్మకపోవడానికి ఇదే కారణం. కాస్త అలజడి రేగాలంటే మందుండాలి కదా.
ఈ కిటుకుని కనిపెట్టి అధికారంలోకి రాగానే మద్యనిషేధం ఎత్తివేశాను. వూరూరా బెల్ట్ షాపులు పెట్టించాను. తాగుబోతులతో పెళ్లాలు గొడవపెట్టుకుంటారు. ఎవడికి వాడు సొంత సమస్యల్లో ఇరుక్కుపోతే ఇక రాష్ట్ర సమస్యలెవడు పట్టించుకుంటాడు. అన్నాడు
మందు బాబులపై మీ ప్రేమకి కారణం ఇదన్నమాట అన్నాడో అధికారి
ఇంకా వినండి. మందువల్ల వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడపొచ్చని ఇండియాలో మొదట కనిపెట్టిన ముఖ్యమంత్రి నేనే. అందుకే హైవేల్లో మందు, డాబాల్లో మందు, వూళ్లో మందు, ఇంట్లో మందు. ఎటుచూసినా మందే.
ఇంకో విషయం తెలుసా. ఓటుకి క్వార్టర్ బాటిల్ సప్లయి విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా నేనే. విచక్షణ వుంటే ప్రజాస్వామ్యం బతకదు. అది సరిగ్గా పనిచేస్తే నాలాంటి వాళ్లు ఎన్నికకారు. క్వార్టర్ తో పాటు వాటర్ పాకెట్ ఇచ్చిన క్రెడిట్ కూడా నాదే.
కానీ మీరు మహిళల దగ్గర మందుబాబుల్ని తరిమికొట్టండి అంటూ వుంటారే
ఆడవాళ్లు అల్ప సంతోషులు. అలాగే చెప్పాలి. లేకపోతే వాస్తవాల్ని గ్రహిస్తారు. పగలు పాలించి రాత్రిళ్లు దోచుకోవడమంటే ఇదే. మగోళ్లంతా మందు మానేస్తే ప్రభుత్వాలు చిప్పపట్టుకొని పోవాలి. అందువల్ల ఆడోళ్లకి కూడా మందు నేర్పిస్తే ఖేల్ కతమ్. వైజాగ్ బీచ్ ఫెస్టివల్ ప్లాన్ ఇదే.
అసలు సురులు అంటే ఎవరు? దేవతలు. అంటే సురతాగితే దేవతలంటారు. సుర నుంచి పుట్టిందే సారా. వెనుకటికి నేనిచ్చిన ఐడియాతోనే మా మామగారు వారుణివాహిని పథకం పెట్టారు. ఆయన ప్లాస్టిక్ కవర్లలో ఇస్తే నేను దాన్ని బాటిలోకి మార్చాను.
గుర్రమెక్కుతారు కాబట్టి మందుబాబులకి హార్స్ పవర్ ఎక్కువ. అందుకే గుర్రంలా తూలుతూ పరిగెత్తుతారు. వాళ్లు పవర్ పుల్ కాబట్టే మీకంటే ముందుగా టెక్నాలజీ వాడ్డం నేర్చుకున్నారు. 
అయితే సైకిల్ కి బదులు బాటిల్ గుర్తు పెట్టుకుందామా సార్
గుర్తులక్కర్లేదు. మందుబాబులే మన బ్రాండ్ అంబాసిడర్లు అన్నాడు బాబు

తాజా వీడియోలు

Back to Top