బ్రహ్మదేవుడు తపస్సు..ఇంద్రలోకానికి చంద్రబాబు

సప్త సముద్రాల్ పోటెత్తుతున్నాయి. 
ప్రళయ హోరుతో పదునాలుగు భువన భాండంములు అల్లకల్లోలాలయ్యాయి.
ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
భూగ్రహంపై ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు.
దేవుడా ఏంటీ బీభత్సం అని భక్తులు  నిలదీస్తున్నారు.
ప్రచండగాలుల తాకిడికి నారదుడే గాల్లో ఎగురుకుంటూ కైలాసాన్ని చేరుకున్నాడు.
అక్కడ  శివ పార్వతులు కూడా ఏం జరుగుతోందా అని అయోమయంగా చూస్తున్నారు.
నారదుడు కనిపించగానే..ఏం నారదా ఏం జరుగుతోంది? ఏంటీ వైపరీత్యం ? అని ఆరా తీశారు.
"ఏం చెప్పమంటావు పరమేశ్వరా? బ్రహ్మదేవుడు ఘోర తపస్సు చేస్తున్నారు. దాని ఫలితమే ఈ ప్రళయం" అన్నాడు.
ఏంటీ? బ్రహ్మదేవుడు తపస్సా? ఎందుకోసం? ఎవరికోసం? ఏ దేవుడి దివ్యదర్శనం కోసం? అని శివుడు ప్రశ్నల వర్షం కురిపించాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి భూలోకమున..భరత ఖండంబున..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంబందు నారా చంద్రబాబు నాయుడనే ముఖ్యమంత్రి ఉన్నాడు దేవా. ఆయన కోసమే నాన్నగారు తపస్సు చేస్తున్నారు అని  వివరించి  నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి బయలు దేరాడు.
వైకుంఠంలో విష్ణుమూర్తి పాలకడలిపై శ్వేత తల్పంబున పడుకున్నవాడు కాస్త అదిరి పడి లేచి..ఏంటీ నిద్రాభంగం? ఏం జరుగుతోంది? అని నారదుని అడిగాడు.
నారదుడు శివుడికి చెప్పిందే చెప్పాడు.
ముల్లోకాలూ వణికిపోతున్నాయి దేవా. తమరు ఏదో ఒకటి చేయక తప్పదు అన్నాడు.
విష్ణు మూర్తి కళ్లుమూసుకుని జరిగిందంతా  తెలుసుకుని నారదుడి చెవిలో ఓ విషయం చెప్పారు.
భూలోకంలో నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన కార్యాలయంలో కూర్చుని సింగపూర్ కంపెనీ ప్రతినిథులతో రాజధాని నిర్మాణ కాంట్రాక్టు గురించి మాట్లాడుతున్నారు. పూర్తి కాంట్రాక్ట్ ఇచ్చినందుకు తన వాటా ఎంతో తేల్చాల్సిందిగా ఆయన  అంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే   నారదుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబుతో పాటు.. సింగపూర్ ప్రతినిథులు కూడా ఉలిక్కి పడ్డారు.  ఎవరయ్యా నువ్వు? దేవీ నవరాత్రి నాటకోత్సవాలు  అయిపోయాయి కదా ఇంకా మేకప్ తియ్యలేదా ఏంటి? అయినా  సరాసరి నా ఆఫీసులోకి వచ్చావేంటి? ఎవరు రానిచ్చారు నిన్ను? అని ఆశ్చర్యం..కోపం కలగలిపిన గొంతుతో ఆరా తీశారు చంద్రబాబు.
దానికి నారదుడు నవ్వి..నారాయణ.  నేను నాటకాల్లో నారదుణ్ని కాదు  నాయనా..నిజం నారదునే. మీ జర్నలిస్టులంతటి దుర్మార్గుణ్ని కాను . లోక కళ్యాణం కోసమే ఇలా వచ్చా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక్క సారి కళ్లు నులుముకుని.. అవును నిజం నారదుడే అయి ఉంటాడు. లేదంటే  సెక్యూరిటీని దాటుకుని ఇక్కడికి ఎలా వస్తాడు? అని నిర్ధారించుకుని.. ఏం పని మీద వచ్చారు మహాశయా? అని అడిగారు.
చూడు నాయనా.. నీకోసం మా నాయన ఘోరంగా తపస్సు చేస్తున్నారు. ఓ సారి ఆయనకి దర్శనమిచ్చి ఆయన కోరిన తీర్చేస్తే  ప్రపంచాన్ని ప్రళయం నుండి కాపాడిన వాడివవుతావు అని  నారదుడు సెలవిచ్చాడు.
తన గురించి బ్రహ్మదేవుడే తపస్సు చేస్తున్నాడని తెలియగానే చంద్రబాబు మురిసిపోయారు. మీడియాకు ఈ వార్త వెంటనే తెలియజేయాల్సిందిగా  పరకాల ప్రభాకర్ ను ఆదేశించారు. మొత్తం మీడియాను వెంటబెట్టుకుని చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న చోటకు  వెళ్లారు.
బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న తీరును చూసి చంద్రబాబు మీడియా మిత్రులతో బాగా కవర్ చేయండి. లైవ్ లో చూపించేయండి అని ముచ్చటగా అడిగారు.
అన్ని ఛానెళ్ల వారూ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారని నిర్ధారించుకున్న తర్వాతనే..చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి  బ్రహ్మదేవా..దేవుళ్ల గురించి మా మనుషులు తపస్సు చేయడం  తెలుసు కానీ.. మనిషి గురించి దేవుళ్లు తపస్సు చేయడం ఏంటి  దేవా? చాలా ఆశ్చర్యంగా ఉంది?  అయినా మీరంతటి వారు తపస్సు చేశారు కాబట్టి నేను వచ్చేశాను. మీకేం కావాలి దేవా? రాజధాని ప్రాంతంలో మీకేమన్నా గుడి కట్టించమంటారా? లేకపోతే మీ అబ్బాయి నారదులు వారికి గుడి కట్టించమంటారా సరదాగా? అని  అడిగాడు.
బ్రహ్మదేవుడు కళ్లు తెరచి చంద్రబాబును చూడగానే ఉలిక్కి పడి "  నాయనా..నీకు చేతులెత్తి దండం పెడతా కానీ నువ్వు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయ్ నాయనా?  కావాలంటే దేవలోకానికి నిన్ను రాజుని చేస్తాను కానీ.. ఇక్కడ మాత్రం నువ్వు తప్పుకోవాలి తప్పదు..! అని బతిమాలాడాడు.
చంద్రబాబు కంగారు పడి..ఏం మాట్లాడుతున్నావు దేవా.. ముఖ్యమంత్రి పదవిని ఎలా వదులు కుంటాం? అయినా ఇలాంటి కోరికలు కోరతారా ఎవరైనా? అయినా నేనెందుకు రాజీనామా చేయాలో చెప్పు అని అడిగారు చంద్రబాబు.
బ్రహ్మదేవుడు మొహం చిట్లించి తమరి అమ్మ గారి కడుపు మాడ... మీరు ..మీ మంత్రులు.. మీ పరిపాలన.. నేను సృష్టించిన సకల జీవరాశులకూ నరకం చూపిస్తున్నాయి. వాళ్లంతా మమ్మల్నెందుకు పుట్టించావు దేవుడా అని నన్ను తిట్టుకుంటున్నారు. అన్నాడు బ్రహ్మదేవుడు.
మీరు సృష్టించిన ప్రాణులను నేనేం ఇబ్బంది పెడుతున్నాను దేవా? అని అమాయకంగా అడిగారు చంద్రబాబు.
బ్రహ్మదేవుడు  కోపంగా చూసి " రైతులని బతకనివ్వడం లేదు నువ్వు. రుణమాఫీ చేస్తానన్నావు. హామీని పక్కన పెట్టావు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు. ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. అదీ మాట తప్పావు.
మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉంటానన్నావు. ఆడవాళ్లని వేపుకు తింటోన్న మీ ఎమ్మెల్యేలు..మంత్రుల పరివారాలను చూసీ చూడనట్లు వదిలేశావు. నీ పాలనలో ఏ ప్రాణీ కూడా సుఖంగా లేదు. చివరకు పశువులకు మేత లేదు. ఎవ్వరికీ జీవించాలని లేదు.
బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది కానీ.. నువ్వు తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో ... ఆ మరుక్షణమే నిన్ను ఇంద్రలోకానికి అధిపతిని చేసేస్తాను అని బ్రహ్మదేవుడు ఆఫర్ ఇచ్చారు.
ఇంద్రలోకానికి రాజంటే ఇక  ఆ తర్వాత ఎన్నికలుండవా ? అని అడిగారు చంద్రబాబు.
బ్రహ్మదేవుడు నవ్వి. ఉండవు. కొన్ని వేల సంవత్సరాల పాటు నువ్వే రాజువి. అన్నాడు బ్రహ్మదేవుడు.
చంద్రబాబు  తనతో పాటు వచ్చిన మీడియా మిత్రుల్లో తనకి కావల్సిన వారిని కౌగలించుకుని ఇక నేనే ఇంద్రుణ్ని నేనే ఇంద్రుణ్ని అని ఆనందంగా ఎగిరి గంతేస్తున్నారు.
అంతలో హఠాత్తుగా ఎవరో తలమీద కొట్టినట్లయ్యింది. తల దిమ్మెక్కేసింది. ఎవర్రా నన్ను కొట్టింది అని గట్టిగా అరిచారు. 
కళ్లు తెరిచి చూసే సరికి  మంచం  పక్కన కింద పడి ఉన్నట్లు తెలుసుకున్నారు. లోకేష్ బాబు చంద్రబాబు చేతిని  చేతిలోకి తీసుకుని ఏం జరిగింది నాన్నారూ? ఏమన్నా పీడకలా?  మంచం మీంచి కిందపడిపోయారేంటి? అని అడిగారు.
చంద్రబాబుకి  లీలగా   గుర్తుకు వస్తోంది. ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
చుట్టూరా ఉన్న పరివారాన్ని చూసి  ఏమీ లేదు  ... నేను చాలా సేపయింది లేచి ఊరికే కింద యోగాసనాలు వేస్తున్నాను అని చెప్పి అందరినీ పంపించేశారు.
...............................
-కవికాకి

Back to Top