చంద్రబాబు...దెయ్యం

సచివాలయంలోని తన ఛాంబర్ లో   ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు.
మంత్రులు, అధికారులకు కారణం తెలీడం లేదు.
ఏం జరిగిందో అడగడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు.
చివరికి పరకాల ప్రభాకరే కొంత ధైర్యం తెచ్చుకుని "ఏమైంది సార్? మాకు చెప్పండి. మేం అంతా ఉన్నాంగా .మీ కే సమస్యా రానివ్వం", అని నెమ్మదిగా అన్నారు.
చంద్రబాబు సీరియస్ గా వచ్చి తన కుర్చీలో కూర్చుని "నిన్న రాత్రి నుంచి  లోకేష్ బాబు కనపడ్డం లేదు. రాత్రి 12 గంటల వరకు  మంచం మీద నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లార కట్ట మూడు గంటలకు లేచి చూసేసరికి మంచం ఖాళీగా ఉంది .నాకు చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లడు. వాడికేమైందో అర్ధం కావడం లేదు.ఈ విషయం ప్రతిపక్షాల వాళ్లకి తెలీకూడదు. రహస్యంగా లోకేష్ బాబు గురించి  ఆరా తీయండి" అని పరకాల చెవిలో చెప్పారు చంద్రబాబు.

పరకాల వెంటనే డిజిపిని పిలిపించి విషయం చెప్పారు.
డిజిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులందరికీ విషయం చెప్పి గుట్టుగా ఆరాతీయమని చెప్పారు.
రెండు మూడు రోజులు దాటింది. ఎలాంటి ప్రయోజనమూ లేదు.
ఇంతలో పరకాలే ఏదో అయిడియా వచ్చిన వాడై..చంద్రబాబు దగ్గరకెళ్లి చెవిలో ఏదో చెప్పారు.
చంద్రబాబు  వెంటనే లేచి భూత మాంత్రికుడ్ని పిలిపించమని ఆదేశాలు ఇచ్చేశారు. 
భూత మాంత్రికుడు రాగానే విషయం చెప్పారు.
పెద్దపూజ చేయాలని మాంత్రికుడు చెప్పడంతోనే పూజకు అవసరమైన ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేయించారు. 
ఓ కపాలం..పక్కనే నిమ్మకాయలు... ఓ కోడి పుంజును పెట్టి చుట్టూరా ముగ్గు వేసి మాంత్రికుడు క్షుద్రపూజలు మొదలు పెట్టాడు.
అరగంట పూజ చేయగానే ముగ్గు మధ్యలో ఉన్న కోడి నెత్తురు కక్కుకుంటూ  చనిపోయింది. 

అందులోంచి ఓ దెయ్యం పొగ చెట్టులా లేచి నిలబడి భయంకరంగా నవ్వింది.
మాంత్రికుడు ఆ దెయ్యంకేసి చూసి.. ఎవరు నువ్వు? నీకేం కావాలి? లోకేష్ బాబును ఎందుకు ఎత్తుకు పోయావు? అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
దెయ్యం వెటకారంగా నవ్వి..ఎందుకా...మీ ముఖ్యమంత్రిగారినే అడుగు ఆయనే చెబుతారు అంది.పక్కనే ఉండి అంతా గమనిస్తోన్న చంద్రబాబు కంగారు పడ్డారు.

 నాకేం తెలుసు? నువ్వు మా అబ్బాయిని ఎందుకు ఎత్తుకుపోయావో నువ్వు చెప్పాలి కానీ..నన్నడగమంటావేంటి? అని తత్తర పడుతూ నిలదీశారు.
దానికి దెయ్యం నవ్వేసి..ఎందుకు తెలీదు సామీ...మొన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నువ్వేమన్నావు? ప్రభుత్వ పథకాలన్నింటినీ  దెయ్యాలు తినేస్తున్నాయని అనలేదూ అని గట్టిగా అడిగింది. దానికి చంద్రబాబు ఆశ్చర్యపోయి..అవును ఏదో మాట వరసకి అన్నాను అంత మాత్రానికే మా అబ్బాయిని ఎత్తుకుపోవడం అన్యాయం అన్నారు.

దెయ్యం కోపంగా చూసి.. మాట వరసకి అన్నావా? 
ప్రభుత్వ పథకాలు..ప్రజల నిధులు భోంచేయడానికి మేమేమన్నా  నీతి నిజాయితీ లేని నీ బినామీలు అనుకొన్నావా ఏమిటి...
మేం దెయ్యాల పుటక పుట్టాం కాబట్టి.. జనాల్ని పీక్కు తినాలని బగమంతుడు రాశాడు కాబట్టి ఆ పని చేస్తాం. అది కూడా నిజాయితీగానే చేస్తాం. అంతే కానీ మీలాగ మిమ్మల్ని గెలిపించిన ప్రజలనే ఉత్తి పుణ్యాన పీడించుకు తినే రకం కాదు మేం.
మా దెయ్యాల కన్నా  భయంకరమైన పిశాచాలు మీ పార్టీలోనే ఉన్నారు. 
చింతమనేని లా మేం ఇసుక తినేసి ...మహిళా అధికారిపై చేయి చేసుకున్నామా?
మంత్రి నారాయణలా రైతుల భూములు బలవంతంగా లాక్కుని.. రాజధాని చుట్టూరా కారు చవగ్గా భూములు కొని కోట్లకు పడగలెత్తామా?  రైతుల నెత్తుటి కూడు తిన్నామా?
మురళీ మోహన్ లా రాజధాని ఎక్కడ కడతారో ముందుగానే తెలుసుకుని అక్కడి రైతుల నుండి రహస్యంగా భూములు కొనేసి సొమ్ము చేసుకోవాలని మేం చూశామా?
మీలా అవసరం లేకపోయినా పట్టి సీమ ప్రాజెక్టు కట్టేసి కోట్లకు కోట్లు ముడుపులు మింగేశామా? ఏం చేశామని మా దెయ్యాలని పట్టుకుని అంత మాటన్నావు? అని అడిగేసరికి చంద్రబాబు నాయుడి నోట మాట రాలేదు. 

రెండు నిముషాల మౌనం తర్వాత... దెయ్యమే ప్రశాంతంగా నవ్వి..జాగ్రత్త ఇకనుంచైనా నిజాయితీగా ఉండు. జనాల్ని ముంచకు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. లేదంటే ఈ సారి లోకేష్ బాబును కాదు నిన్నే ఎత్తుకుపోతాం? అని వార్నింగ్ ఇచ్చి..లోకేష్ బాబును విడిచి పెట్టింది.
లోకేష్ బాబును చూడగానే ఆనందంతో చంద్రబాబు కొడుకుని కౌగలించుకుని..దెయ్యంగారూ చాలా థ్యాంక్స్ వచ్చే మంత్రి వర్గ విస్తరణలో మీక్కూడా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చిరుణం తీర్చుకుంటాను అన్నారు. దానికి దెయ్యం కంగారుపడి..వద్దు నాయనా.. నీ దిక్కుమాలిన మంత్రి వర్గంలో చేరితే మాకున్న పరువు కూడా పోతుంది.అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు నీ ఇంటా వంటా లేదు కదా. వద్దులే. ఇంకెప్పుడూ దెయ్యాల జోలికి రాకు అని చెప్పి దెయ్యం మాయమైంది.
చంద్రబాబు లోకేష్ ను తీసుకుని ఇంటికి బయలు దేరారు.
...........................
కవికాకి
-----------------------

Back to Top