బాబు ఆవు వ్యాసం

తెలుగులో ఆవు వ్యాసం కథ బాగా పాపులర్. ప్రపంచంలో పరమాణువు నుండి రోదసీలోకి పంపే ఉపగ్రహాల వరకు ఏదైనా మొదలు పెట్టిన వెంటనే ఆవు దగ్గరికే రావడం ఆవు వ్యాసం ప్రత్యేకత. ఈ కాన్సెప్ట్ కొనసాగింపు బాబు వ్యాసం. కలామ్ ను రాష్ట్రపతిని చేసినా, వాజ్ పేయిని ప్రధానిగా కూర్చోబెట్టినా, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలుచోబెట్టినా, సెల్ ఫోన్ లు మార్కెట్లోకి వచ్చినా, టీవీలో బొమ్మ కనిపించినా, ఇంటర్నెట్ లో మెయిల్స్ వచ్చినా అన్నిటికీ నేనే కారణం, నా ముందు చూపే బాణం అంటూ ఆయన్ను ఆయనే పొగొడుకొని ఈ బాబు వ్యాసాన్ని రోజుకు మూడుసార్లు మీరందరూ కూడా బుద్ధిగా రాస్తూ, దాన్నే స్మరిస్తూ ఉండండని బహిరంగసభల్లో బహిరంగంగానే అడుగుతున్నారు. ఇదివరకు బాబును మిత్రమీడియా పొగిడేది. ఇప్పుడు కూడా పొగుడుతున్నా,అది చాలదని అనుకుంటున్నారేమో. ఆత్మస్తుతి స్తోత్ర పారాయణంలో ఇప్పుడు బాబుకు సాటి రాగల సమకాలీన రాజకీయ నాయకులు లేరు. 

                                 అమరావతి ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటి, అమరావతిలో అంతర్జాతీయ క్రీడలు, డ్యాన్సులు, హోటళ్లు, పార్కులు, రోడ్లు, చెట్లు, పుట్టలు..ఇలా ఈ అఖండ భూమండలంలో ఎక్కడ ఏది గొప్పది ఉన్నా-దానికంటే గొప్పగా అమరావతిలో ఉంటుందని బాబు గారు ఆవిధంగా ముందరికి పోయే పరిస్థితిలో తెలియజేసుకుంటారు. వంత మీడియా వంతులు వేసుకొని తాన తందాన అంటూ పాఠకుల చెవులకు బ్యానర్లు కట్టి, ప్రేక్షకుల కళ్లకు గ్రాఫిక్కులు పెట్టి తన్మయత్వంతో తనను తాను మరచిపోతుంది. ఇవన్నీ విని అమరావతి ఇంకెలా ఉండబోతుందో అని ఉవ్విళ్లూరిన వారి ఉత్సాహం మీద మొన్ననే నీళ్లు చల్లారు. రాజమౌళి లాంటి సినిమా ప్రముఖుల సహాయంతో కనువిందుగా-పైన పటారం లోన లొటారంలా ఉన్నా- కనీసం భారీ సెట్లయినా వేయిద్దామని బాబు సంకల్పించారు. చూసే వారికి వినోదం. బాలయ్యబాబు-సమయం లేదు మిత్రమా షూటింగ్ త్వరగా ముగించాలి-అని ఎప్పుడన్నా మీసం దువ్వితే అక్కడే శాతకర్ణి-2 తీసేయవచ్చు. బాబు ఏది చేసినా ఉభయతారకంగా ఉంటుంది. 

                                          నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా శాస్త్రవేత్త నోబెల్ అవార్డు తెచ్చుకుంటే వందకోట్ల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రిగా బాబు ప్రకటించడంలో కూడా చాలా ముందు చూపు ఉన్నట్లు ఇప్పుడు అర్థమవుతోంది. సెల్ ఫోన్ నుండి, ప్రధాని-రాష్ట్రపతి వరకు ఎన్నో వస్తువులను, వ్యక్తులను, వ్యవస్థలను ఆవిష్కరించిన తనకే నోబెల్ వస్తుందని బాబు నమ్మకం. అన్నీ ఆవువ్యాసంతో ముడినప్పుడు-నోబెల్ అవార్డు-వందకోట్ల ప్రోత్సాహం కూడా ఆవు వ్యాసం దగ్గరే ముగుస్తుంది. 
                                    హెరిటేజ్ కు కూడా ఆవు చాలా ప్రధానం!

Back to Top