బాబు పీడ




చంద్రబాబు చీడపీడల గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి వ్యవసాయం గురించి వేదికల మీద ప్రసంగాలు ఇస్తున్నాడు. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటున్నాడు. అప్పుడప్పుడు అన్నదాతలు రైతులు అని కూడా మాట్లాడుతున్నాడు. వినేవాళ్లకు విడ్డూరంగా, చూసేవాళ్లకు చత్వారం గా అనిపిస్తోంది. బాబు ఏమిటి... బాబుకి వ్యవసాయంపై ఈ ప్రేమ ఏమిటి?? అని ఆశ్చర్యంలో తలమునకలై పోతున్నారు. 
వ్యవసాయ సదస్సు పెట్టడం ఏమిటో దానికి చంద్రబాబు హాజరవ్వడం ఏమిటో ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. పైగా ఈమధ్య పంటలు వాటికి వచ్చే తెగుళ్ళు, మొక్కలను ఆశించే చీడపీడలు, వ్యవసాయంలో మెళుకువలు... వీటన్నిటి గురించి చంద్రబాబు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. చూడబోతే చంద్రబాబు వ్యవసాయం చేస్తున్నాడా లేక వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడా అనే అనుమానం వస్తోంది. కత్తెర పురుగును కంట్రోల్ చేశాం, కాండం తొలిచే పురుగును కనపడకుండా చేశాం, వేరుపురుగు వేళ్ళు విరిచేసాం అని చంద్రబాబు చెబుతుంటే, రైతుల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. బాబు ఎప్పుడు పొలం లో దిగాడో... ఎప్పుడు ఈ పురుగులు అన్ని పోయాయో తెలియక అన్నదాతలు ఆశ్చర్యపోతున్నారు. 
సీమ లో ఇచ్చిన రైన్ గన్లు పని చేయలేదు. కోస్తాలో ఇచ్చిన ట్రాక్టర్లు సొంత కార్యకర్తల గూటికి చేరాయి. ఉత్తరాంధ్ర కు ఇంత వరకు ఉత్త చేయి చూపించారు. 
వ్యవసాయం కోసం బాబు చేసింది ఏమైనా ఉంటే వేదికల నెక్కి ఉపన్యాసాలు దంచడం, అగ్రి టెక్ సదస్సుల పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేయడం. 
కానీ అదేమిటో మైకు ముందుకు వచ్చినప్పుడు బాబుకు తాను వ్యవసాయ రంగానికి రైతులకు ఏవేవో చేసేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆయన నోట్లోంచి అలవోకగా అబద్ధాలు ఆశువుగా అసత్యాలు రాలిపడుతుంటాయి. ప్రకృతి వ్యవసాయానికి పితామహుడు తానే అని చెబుతాడు. అసలు వ్యవసాయం కనిపెట్టిందే నేను అంటాడు. 
బాబు మాటలు విన్న రైతులు మాత్రం మా పాలిట కుమ్మరి పురుగు చంద్రబాబే అంటారు. పంటకు పట్టిన చీడ కంటే రాష్ట్రానికి పట్టిన బాబు పీడ ప్రమాదకరం అని అంటున్నారు.


తాజా వీడియోలు

Back to Top