కేసుల భయానికే బాబు డ్రామాలు

భేతాళ కథ
 

అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా...
విక్రమార్కుడు మళ్లీ చెట్టుమీది శవాన్ని భుజాలకెత్తుకుని ముందుకు నడవసాగాడు.
భేతాళుడు ఏమీ మాట్లాడ్డం  లేదు. విక్రమార్కుడికి డౌట్ వచ్చింది. ఏంటి భేతాళా బతికున్నావా..లేక  బాల్చీ తన్నేశావా? అని అనుమానంగా అడిగాడు. శవంలోని భేతాళుడు బద్దకంగా ఆత్మ విరుచుకున్నాడు. విక్రమార్కా బాగా మత్తుగా నిద్రపట్టేసిందయ్యా.. ఇప్పటికీ కళ్లు మూతలు పడిపోతున్నాయి...అంటూ గట్టిగా ఆవలించాడు. ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టు అన్నాడు విక్రమార్కుడు. భేతాళుడు హుషారుగా కదిలి విక్రమార్కా ఇపుడు నీకు రెండు కథలు చెబుతాను.  రెండు ప్రశ్నలు వేస్తాను. వాటిని సావధానంగా విని జవాబులు చెప్పు. వీటికి సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల  ఒక్కో ప్రశ్నకీ వెయ్యి చొప్పున రెండు వేల ముక్కలవుతుంది అన్నాడు.
చెప్పేదేదో సూటిగా సుత్తిలేకుండా..కథని సాగదీయకుండా చెప్పు అన్నాడు విక్రమార్కుడు. భేతాళుడు  చెప్పడం మొదలు పెట్టాడు.
విక్రమార్కా...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్  కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతలోంచి స్థాపించారు. అప్పటి నుంచీ కూడా కాంగ్రెస్, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. అయిదేళ్ల క్రితం ఏపీని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అని తిట్టారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని నిప్పులు చెరిగారు. అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇపుడు చంద్రబాబు నాయుడు చేతులు కలపడం..ఢిల్లీలో చంద్రబాబు దీక్షానాటకానికి కాంగ్రెస్ పెద్దలంతా తరలిరావడం విడ్డూరంగా లేదూ? ఆగర్భశత్రువుల మధ్య ఈ స్నేహం ఎలా చిగురించిందంటావ్?
అలాగే.. అయిదేళ్ల క్రితం బిజెపి వెంటపడి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లపాట  బిజెపిని పొగుడుతూనే వచ్చారు. ఏపీకి బిజెపి ప్రభుత్వం చేసినంత మేలు ఏ ప్రభుత్వమూ  చేయలేదని కొనియాడిన చంద్రబాబు కేంద్ర మంత్రులకు సన్మానాలు కూడా చేశారు .అలాంటి బిజెపిపై ఇపుడు చంద్రబాబు నాయుడు ఒంటికాలిపై లేచి  నోటికొచ్చిన తిట్లు తిడుతున్నారు. ఆప్తమిత్రుల మధ్య ఈ ఎడబాటుకు కారణం ఏంటి? దీని వెనుక ఏం మతలబు ఉంది? ఈ రెండు ప్రశ్నలకూ సరియైన సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యివక్కలైపోతుంది అని భేతాళుడు ముగించాడు. విక్రమార్కుడు చిన్నగా నవ్వేసి..చెప్పడం మొదలు పెట్టాడు. భేతాళా నువ్వనుకుంటోన్నట్లు కాంగ్రెస్టిడిపిల మధ్య శత్రుత్వం అనేది ఎన్టీఆర్ తోనే పోయింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సిఎం అయిన చంద్రబాబు నాయుడు అప్పటి నుంచే కాంగ్రెస్ తో అండర్ స్టాండింగ్ తో ముందుకు పోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత  చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కి మరింత దగ్గరయ్యారు. అందుకే కదా కాంగ్రెస్ హై కమాండ్ చెప్పిందానికి తలూపలేదని జగన్ మోహన్ రెడ్డిపై  కాంగ్రెస్ నేతలు అక్రమ కేసు  పెట్టినపుడు..ఆ కేసుతో చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఆ తర్వాత రైతులను ఆదుకోవడంలో విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే..చంద్రబాబు నాయుడు కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకొచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లును ప్రవేశ పెట్టినపుడు యూపీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నుండి బయటకు వచ్చేస్తే..చంద్రబాబు నాయుడి టిడిపి మాత్రం బయట ఉండి ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు ఆమోదం పొందేలా లోపాయికారి  సాయం అందించారు. ఏపీ విభజన సమయంలోనూ కాంగ్రెస్ అడిగిన వెంటనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన మొదటి పార్టీ తెలుగుదేశమే. అంచేత కాంగ్రెస్ చంద్ర‌బాబుల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. అంచేత ఇపుడు ఆ ఇద్దరూ కలవడంలో ఎలాంటి వింతా లేదు కూడా.
ఇక బిజెపితో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల తర్వాత  బిజెపితో తెగతెంపులు చేసుకోడానికి  అసలు కారణం ప్రత్యేక హోదా ఉద్యమంతో దూసుకుపోతోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే. హోదా ఉద్యమంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జనం గుండెల్లో సెటిలైపోతోందన్న భయానికే చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లుగా వద్దు వద్దన్న ప్రత్యేక హోదా కావాలని యూటర్న్ తీసుకున్నారు. ఇక నాలుగున్నరేళ్లలో పోలవరం,రాజధాని భూసేకరణ,పట్టిసీమ ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వ సంస్థ  అందించిన కాగ్ నివేదికలోనే తేటతెల్లమైంది. ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందేమోనన్న అనుమానమే చంద్రబాబు మదిలో పెనుభూతమై వెంటాడుతోంది. అందుకే కొంతకాలంగా చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేయిస్తారని..ఈడీ...సీబీఐ..కేసులు పెట్టి జైల్లోకి పంపేస్తారని కంగారు పడుతున్నారు. నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేసినా ..తన అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయడానికి  బిజెపి సిద్ధంగా లేకపోవడంతో చంద్రబాబు నాయుడికి ఒళ్లు మండిపోతోంది.అందుకే బిజెపిని  ఇప్పుడు ఆయన రోజూ తిట్టిపోస్తున్నారు. ఏపీని నిండా ముంచిన మోదీ..చంద్రబాబు ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా నుంచి ప్రజల దారిమళ్లించడానికే ఒకరినొకరు తిట్టుకుంటూ నాటకాలాడుతున్నారు‘ అని విక్రమార్కుడు ముగించాడు. విక్రమార్కుని సమాధానాలతో  సంతృప్తి చెందిన బేతాళుడు  రిలాక్స్ డ్ గా నవ్వేసి  విక్రమార్కుడి భుజాలపై మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు. వీర పిశాచి 

తాజా వీడియోలు

Back to Top