బుల్లెట్ బాబు

చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం

"ఈ రాష్ట్రాన్ని బుల్లెట్ వేగంతో తీసుకెళ్ల‌డ‌మే నా ధ్యేయం. బుల్లెట్ వెళుతున్న‌ప్పుడు కంటికి క‌న‌ప‌డ‌న‌ట్టే. నేను చేసే అభివృద్ధి కూడా క‌ళ్ల‌కు క‌న‌ప‌డ‌దు. నేను జ‌పాన్ వెళ్లిన‌ప్పుడు బుల్లెట్ రైలుని చూశా. అలాంటి రైలుని అమ‌రావ‌తికి తీసుకొస్తా. ఆ స్పీడ్‌కి క‌ళ్లు తిర‌గ‌కుండా జ‌నానికి ఉచితంగా క‌ళ్ల‌జోళ్లు ఇస్తాం. విజ‌య‌వాడ నుంచి క‌నురెప్ప తెరిచేలోగా అమ‌రావ‌తిలో వుంటారు" అన్నాడు బాబు
"మ‌రి వీట‌న్నిటికి డ‌బ్బులు?" అడిగారు విలేక‌రులు
అదే స‌మ‌స్య‌. మ‌న ద‌గ్గ‌ర క‌ల‌లున్నాయి, కానీ పైస‌లు లేవు. కేంద్రం ఒక్క‌పైసా ఇవ్వ‌దు. అయినా అభివృద్ధి ఆగ‌దు. నా దృష్టిలో ఈ రాష్ట్ర‌మే ఒక స్టార్ట‌ప్ కంపెనీ. కానీ ఇది ఎప్పుడు స్టార్ట‌వుతుందో తెలియ‌దు. 
"ఎన్ని స‌మ‌స్య‌లున్నా రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి ఉద్యోగ‌మిస్తా. ఇంటింటికి నెట్ ఇవ్వ‌డం వ‌ల్ల, నిరుద్యోగులు త‌మ‌ని తాము ఈజీగా న‌మోదు చేసుకుంటారు. దీంతో ఉద్యోగాలు నేరుగా యాప్స్ రూపంలో నిరుద్యోగుల చేతిలోకి వెళతాయి" 
"డ‌బ్బులేన‌ప్పుడు, ఉద్యోగాలు ఎలా వ‌స్తాయి?" 
"డ‌బ్బుల‌కి, ఉద్యోగాల‌కి సంబంధం లేదు. సంక‌ల్ప బ‌లం వుంటే అన్ని జ‌రుగుతాయి. ఆ సంక‌ల్పంతోనే ఎప్ప‌టిక‌ప్పుడు విమానాల్లో తిరుగుతూ, జ‌నం డ‌బ్బు ఖ‌ర్చుపెడుతూ అభివృద్ధి గురించి ఆలోచిస్తువున్నాను. నేనేం చేసినా బుల్లెట్ వేగంతో చేస్తా"
"ప్ర‌భుత్వాన్ని మీరు కంపెనీతో ఎందుకు పొలుస్తున్నారు."
"కంపెనీ అన్న త‌రువాత లాభాలు, న‌ష్టాలు వ‌స్తుంటాయి. కాక‌పోతే మా కంపెనీలో లాభాలు నాయ‌కుల‌కి, న‌ష్టాలు ప్ర‌జ‌ల‌కు వ‌స్తాయి. కంపెనీ బ్రాండ్‌ని మేము ప్ర‌మోట్ చేస్తువుంటాం. ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెట్టి కంపెనీని న‌డుపుతూ వుంటాం"
"మీ కంపెనీ ఏమి అమ్ముతుంది"
"ఆశ‌ల్ని, క‌ల‌ల్ని అమ్ముతుంది. అమ‌రావ‌తి అనే తెల్ల ఏనుగు మా ప్రాడ‌క్ట్‌. ఆ ఏనుగు ప్ర‌జ‌ల్ని వూరేగించ‌దు. కాళ్ల‌తో తొక్కుతుంది. చికెన్ లేకుండా చికెన్ బిరియాని వ‌డ్డించ‌డ‌మే మా ఎజెండా"
"మీ కొత్త ప్ర‌ణాళిత ఏంటి"
"ప్ర‌జ‌లంద‌రికీ గ్రేడ్లు నిర్ణ‌యిస్తాం. ఆధార్‌కార్డులాగా ప్ర‌తి ఒక్క‌రికి ప‌ర్స‌న‌ల్ మార్కులిస్తాం. ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారిని స‌న్మానిస్తాం. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో పోటీత‌త్వం పెరుగుతుంది."
"ఈ మార్కులెవ‌రేస్తారు?"
"ఇంకెవ‌రు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు"
"జ‌నానికి అర్థంకానీ ప‌ద‌జాలంతో మాట్లాడ్డ‌మేనా, నిజంగా రాష్ట్రానికి ఏమైనా చేస్తారా?"
"నేనెప్పుడైనా ఏమైనా చేసానా?  టెక్నిక‌ల్ ప‌దాల‌తో తిక‌మ‌క‌పెట్టి ఏదో చేస్తాన‌ని భ్ర‌మ క‌లిగించ‌డ‌మే నా టెక్నిక్‌."
"ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను ఎందుకు కొంటున్నారు?"
"కొన‌డం, అమ్మ‌డం నా వృత్తి. కూర‌గాయ‌ల‌కీ, మ‌నుషుల‌కీ నా దృష్టిలో పెద్ద తేడా లేదు. అందుకే హెరిటేజ్ పెట్టాను."
"ఎంత‌కాలం మాట‌ల‌తో మ‌భ్య‌పెడ‌తారు?"
"నా ద‌గ్గ‌రున్న‌ది డ‌మ్మీబుల్లెట‌ని జ‌నం తెలుసుకునే వ‌ర‌కూ"
"రాష్ట్రాన్ని ఏదో ఒక రోజు వోలెక్స్ కంపెనీలో అమ్మేస్తారు మీరు"
"ఆల్రెడీ అమ్మేశాను"
Back to Top