పట్టిసీమ పుష్కరాలకీ బోయపాటే...!

"మొన్న  గోదావరి పుష్కరాలు..
నిన్న కృష్ణా పుష్కరాలు అద్భుతంగా జరిపేశారు.
ఇక వచ్చే ఏడాది పట్టిసీమ పుష్కరాలకు కూడా  ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి చూస్కోండి"
గోపాత్రుడు చంద్రబాబు పై  మితిమీరిన అభిమానంతో చెప్పుకుపోతున్నాడు.
"పట్టిసీమ పుష్కరాలేంట్రా?  పిలకతిరుగుడు పువ్వుకానీ వేసిందా ఏంటి?" అని కేకలేశాను.
ఒక్క సారిగా అరిచేసరికి పాపం కాస్త అవమాన పడ్డాడు.
మొహం చిన్నది చేసుకుని... ఎందుకండీ ప్రతీసారీ అలా అంటారు.. పట్టిసీమ పుష్కరాలంటే తప్పేముంది? అని అమాయకంగా అడిగాడు.
నాకు ఈ సారి కోపం రాలేదు. నవ్వొచ్చింది.
"ఒరే పిచ్చి సన్నాసీ... పుష్కరాలు నదులకు వస్తాయిరా బాబూ. కాలువలకీ..చెరువులకీ ఎవరూ పుష్కరాలు చేయరు. నాతో  అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. నవ్విపోతారు" అని నెమ్మదిగా చెప్పాను.

" మీకు తెలీపోతే మీరూరుకోండి గురూగోరూ. పట్టిసీమ కాలువని ఎవరన్నారు? అది ఇకనుంచి నది అని మా చంద్రబాబుగోరు చెప్పారు. " అని గోపాత్రుడు పేపర్ నాలెడ్జ్ ని బయట పెట్టాడు.
"వార్నీ పట్టిసీమ నదేంట్రా నాయనా? మీ చంద్రబాబు అలాగే చెప్తారు కానీ.. అది నది కాదురా బాబూ" అన్నాను.
"లేదండీ బాబూ  వచ్చే ఏడాది పట్టిసీమ పుష్కరాల షూటింగ్ కూడా సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకే అప్పగిస్తారని  అమరావతిలో అందరూ అనుకుంటున్నారు" అన్నాడు.
గోపాత్రుణ్ని చూస్తే నిజంగా జాలేసింది.
ఆ మధ్య కూడా  అంతే.

చంద్రబాబు నాయుడు 2019 లో  అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని మాట వరసకి అంటే.. అదే నిజమనుకుని గోపాత్రుడు  పెద్ద హడావిడే చేశాడు.
మొత్తం ప్రపంచంలోనే ఐటీని ప్రమోట్ చేసింది తానేనని చంద్రబాబు మొన్నటికి మొన్న మళ్లీ అంటే..  మైక్రోసాఫ్టు..ఫేస్ బుక్... స్మార్ట్ ఫోన్లు కూడా చంద్రబాబు ఆలోచనలోంచే వచ్చాయని మా గోపాత్రుడు నమ్మడమే కాదు అందరికీ చెప్తున్నాడు కూడా.
గోపాత్రుణ్ని ఊరికే ఉడికిద్దామని " అది సరేరా గోపాత్రుడూ.. మరి మీ చంద్రబాబు నాయుడు అమరావతిని కానీ ఓ దేశంగా మార్చేస్తాడా ఏంటి కొంపదీసి? అని అడిగాను.
గోపాత్రుడి మొహం మతాబులా వెలిగిపోయింది.

నిజవే గురూగోరూ. ఈ అయిడియా మా బాబుగోరికి వస్తే.. ఎంచక్కా ఆంధ్ర ప్రదేశ్  అంతా ఓ దేశమైపోతుంది. అపుడిక ప్రత్యేక హోదా ఎవరో ఇవ్వక్కర్లేదు. చంద్రబాబుగోరే ఇచ్చేస్తారు. దేశం అవుతుంది కాబట్టి ఆయన ప్రధాన మంత్రి అయిపోతారు. మా లోకేష్ బాబు గోరు ముఖ్యమంత్రి అవుతారు. అపుడు ఆంధ్ర ప్రదేశ్ కి తిరుగే ఉండదండీ బాబూ"
అని గోపాత్రుడు పూనకం వచ్చినట్లు చెప్పుకుపోతున్నాడు.
"అది సరే కానీ... ఇంకేంట్రా విశేషాలు" అని టాపిక్ మార్చడానికి అన్నాను.
" అసలు మా చంద్రబాబు మోదీ గోరి సీట్లో ఉంటే  ఈ పాటికి పాకిస్థాన్ పిలక పీకించేసి ఉండునండీ బాబూ" అన్నాడు.
మొదటి సారిగా నాకు గోపాత్రుణ్ని చూస్తే భయం వేసింది.
ఒరేయ్ రేపు మాట్లాడుకుందాం కానీ..నాకు అర్జంట్ పనుందని చెప్పి వెంటనే ఇంటి నుంచి బయటకు  నడిచాను.
---------------------
-కవికాకి
-----------------------

Back to Top