బాబొస్తే ...బాటిలొస్తుంది

-------------------
తూలేరావు బారు కెళ్లాడు.
ఎన్నడూ లేనిది బారులో నిలువెత్తు చంద్రబాబు నాయుడి ఫోటో గోడకి వేలాడుతూ కనిపించింది. ఇదేంట్రా బాబూ ఎప్పుడూ లేంది ఇయ్యాలే బాబుగోరి ఫోటో ఎందుకు పెట్టార్రా అనుకున్నాడు.
జేబులో పైసలు అయ్యే వరకు తాగాడు.
ఇంకా తాగాలనిపించింది. కానీ మందుకు సరిపడ డబ్బులు లేవు. 
పోనీలో ఓ సీసా కల్లు తాగి పోదాం అని కల్లు కాంపౌండ్ కి వెళ్లాడు.
కల్లు కాంపౌండ్ లో అడుగు పెట్టాడు. అక్కడా చంద్రబాబు నిలువెత్తు కటవుట్ కనిపించింది.
వార్నీ ఏమైందిరా ఈ నాయాళ్లందరికీ...  రాజకీయ నాయకుల ఫోటోలు   వాళ్ల పార్టీ కార్యాలయాల్లో ఉంటాయి...లేదంటే అధికారంలో ఉన్న పార్టీ అయితే ముఖ్యమంత్రి ఫోటో గౌర్మెంటు ఆఫీసుల్లో పెడతారు. కానీ కల్లు కాంపౌండ్లలోనూ..బార్లలోనూ సెంద్రబాబు ఫోటోలు పెట్టడమేంట్రా బాబూ అనుకున్నాడు.
పీకల్దాకా తాగేసి తూలుకుంటూ ఇంటికి బయలు దేరాడు.
దార్లో  ప్రతీ వైన్ షాపు పైనా పెద్ద పెద్ద చంద్రబాబు కటవుట్లు పెట్టి పెద్ద పెద్ద దండలు వేశారు.
అంత మైకంలోనూ  తూలేరావు ఆశ్చర్యపోయాడు.
ఇంటికెళ్లి బోయినం చేసి పడుక్కున్నాడు.
పొద్దున్నే లేచి ...టీ తాగుతూ పేపర్ అందుకున్నాడు.
ఫుల్ పేజ్ యాడ్  లో చంద్రబాబు ఫోటో కనిపించింది.
చంద్రబాబు నూరేళ్లు వర్ధిల్లాలని ఆంధ్ర ప్రదేశ్ వైన్ మర్ఛంట్స్ అసోసియేషన్ వారు జారీ చేసిన  యాడ్ అది.
వీళ్లకందరికీ ఏమైందిరా అనుకున్నాడు తూలేరావు.
బుర్ర తిరిగి పోయింది.రేడియో ఆన్ చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులంతా కలిసి చంద్రబాబుకు సన్మానం చేయబోతున్నట్లు రేడియోలో అడ్వర్ టైజ్ మెంట్ వచ్చింది.
ఇయ్యాల డ్యూటీ లేదు..గీటీ లేదు.. ఛలో బార్ అనుకుంటూ  ఇంట్లో పోపుల పెట్టిలో ఉన్న డబ్బులన్నీ జేబులో కుక్కుకుని బయలు దేరాడు.
దారి పొడవునా వీధుల్లో గోడలపై చంద్రబాబు పోస్టర్లు.
ఇపుడు కానీ ఎన్నికలు లేవు కదా అని ఓ సారి తన చేతిని తానే గిల్లుకున్నాడు.
మరో మూడేళ్ల దాకా ఎన్నికలు లేవు. మరి వీళ్లందరికీ ఏమైంది చంద్రబాబుని ఇంతలా పొగిడేస్తున్నారు అనుకున్నాడు. లాభం లేదని తన చిన్నప్పటి స్నేహితుడి బార్ కి వెళ్లాడు. స్నేహితుని చూడగానే..అది కాదుకానీరా...ఏంట్రా మీ బారోళ్లకి..వైన్ షాపోళ్లకి ఏమైందిరా ? ఎందుకురా ఆయన కటౌట్లు..ఫోటోలు పెట్టి హడావిడి చేస్తున్నారు అని అడిగేశాడు తూలేరావు.
బారు ఓనర్ నవ్వేసి..నీకు తెలీదా..రెండు రోజుల్నుంచీ మా సేల్స్ డబుల్ అయిపోయాయిరా బాబూ. అంతా సెందరబాబు సెలవ. ఆ బాబు చెప్పబట్టే అందరూ  మా దగ్గరకొచ్చి సుబ్బరంగా తాగిపోతన్నారు అన్నాడు.
తూలేరావు కు షాక్ కొట్టినట్లయింది.
ఏటీ అందరినీ తాగమని సెందరబాబు అడ్వర్ టైజ్ మెంట్ ఇచ్చారా ఏంటి? అని అడిగాడు.
దానికి ఆ బారు ఓనరు కల్పించుకుని అది కాదురా బాబూ..మొన్న డ్వాక్రా ఆడోళ్లంతా కలిసి మా మొగుళ్లు తెగ తాగేత్తున్నారండీ బాబూ..మీరైనా కొంచెం వారిని మందు మానీయమని చెప్పండి అని అడిగారంట. దానికి సెందరబాబు నవ్వేసి.. ఇంకా నయం ఒక్క సారిగా మందు మానేస్తే పిచ్చి ఎక్కేస్తుంది. అపుడు మీ మొగుళ్లంతా పిచ్చాసుపత్రుల్లో చేరాలి. అపుడు మీ సంగతేంటి? అని గట్టిగా అడిగేశార్రా బాబూ.
దాంతో ఆడోళ్లు  కూడా తగ్గారు. అపుడు సెందరబాబే సెప్పారంట...ఒక్క సారిగా మానకూడదు.. కొంచెం కొంచెం తగ్గించుకోమని చెప్పండి అన్నారట.
ఇక ఆడోళ్లంతా కలిసి తమ మొగుళ్లకి అదే చెప్పారట. ఇక చూసుకో తాగేవాళ్లంతా గంటకోసారి వచ్చి కొంచెం కొంచెం తాగేసి పోతున్నారు. మాకు లాభాల మీద లాభాలు వస్తున్నాయి. ఆయనకు సన్మానం చేయాలని అనుకుంటోంటే సెందరబాబే ఇంకో మేలు చేశారు అన్నాడు.
తూలేరావు కంగారు పడ్డాడు. ఇంకేం మేలు చేశార్రా? అన్నాడు.
మరేం లేదు..విదేశాల్లో అయితే మనసు బాగోనేకపోతే ఏదో ఒక పెగ్గే తాగుతారు..అదే మన దగ్గర అయితే ఏకంగా ఫుల్లు బాటిల్ లాగించేస్తారు అన్నారు.
దాంతో పెగ్గు తాగుదామనుకున్న వాళ్లు కూడా వచ్చి ఫుల్ బాటిల్ తాగి పోతున్నారు.
అసలు ముఖ్యమంత్రి అంటే సెందరబాబులాగే ఉండాల్రా బాబు.ఆయన లాంటి ముఖ్యమంత్రులుంటే జనం ఎలా చచ్చినా కానీ..మా లాభాలకు మాత్రం లోటుండదురా అని హుషారుగా చిటికెలు వేసుకుంటూ కౌంటర్  లోకి వెళ్లిపోయాడు.
తూలేరావుకు తాగిందంతా దిగిపోయింది.
ఎన్టీవోడు తాగద్దర్రా అని మందు  పై నిషేధం పెడితే సెందరబాబు దాన్ని కాస్తా ఎత్తేసి అందరికీ మందు ఇప్పించాడు.
ఇపుడు వీలైనంత ఎక్కువ తాగండిరా నాయనలారా అని  తానే పెచారం చేస్తున్నాడు.
సెందరబాబు గోరు ఆయిధంగా ముందుకు పోదాం అని   ఊరికే పెతీ సారీ అంటూ ఉంటే ఏమిటో అనుకున్నా..ఆ యిదంగా మందుకు పోదాం అని ఆయన అని ఉంటారు. నాకే సరిగ్గా ఇనిపించి ఉండదు అనకుని తూలేరావు మరో క్వార్టర్ బిగించాడు.
అక్కడ ఇంట్లో పసికందుకు పాలకు కూడా డబ్బులు లేక ..ఇంట్లో తినడానికి గుప్పెడు గింజలు లేక తూలేరావు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
బాబొస్తే ఏటో అవుతుందన్నారు..బాబొచ్చారు..ఏటో అవుతోంది అని ఏడుస్తోంది తూలేరావు భార్య.
........................
కవికాకి
.........................


Back to Top