బెదిరింపుల బెకబెకలు

చిత్త భ్రమలు, చిత్త చాంచల్యం, చపల చిత్తం ఇట్టాంటి వన్నీ కట్టగట్టుకుని గట్టు కట్టుకుని మరీ తెలుగు తమ్ముళ్ల మొదళ్లలో తిష్టేసుకున్నట్టే ఉన్నాయి. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యాడంటూ కొన్నాళ్లుగా కూతలు కూస్తేనే ఉన్ననోళ్లు ఇప్పుడు, సిబిఐ జగన్ పై కేసులు ఎత్తేస్తే ఊరుకోం అంటూ బరితెగింపు బెదిరింపులకు దిగుతున్నాయి. న్యాయస్థానాల కళ్లకు గంతలు కట్టి, స్టేలతో కాలం వెళ్లబుచ్చే చంద్రబాబు వంటి నాయకుడి అనుచరణ గణం న్యాయస్థానానికి, దాని తీర్పుకీ అంతకంటే ఏం విలువ ఇస్తారని ఆశించగలం. 
మినీ మహానాడులో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాటలు వింటే న్యాయం, న్యాయ వ్యవస్థపై వీరికున్న గౌరవం ఏపాటిదో అర్థం అవుతుంది. అలాగే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను అధికారంలో ఉండి బెదిరిస్తున్న వారి గూండా యిజం బైటపడుతోంది. విచారణ సంస్థలు తమ పరిధిలో విచారణ చేసి, కోర్టులకు సమర్పించిన విషయాలు, సాక్ష్యాల ఆధారంగా న్యాయస్థానాలు తీర్పులు వెలువరిస్తాయి. కానీ చిన రాజప్ప లాంటి వారు దర్యాప్తు సంస్థల పనితీరునే శంకించే విధంగా వ్యాఖ్చలు చేస్తున్నారు. చంద్రబాబు ఓటుకునోటు కేసులో కెసిఆర్ ను ఉద్దేశించి నాకూ సిబిఐ ఉంది అనడం గుర్తు చేసుకుంటే దర్యాప్తు సంస్థలపై ఈ అధికారంలో ఉన్న నాయకుల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అంతెందుకు గతంలో వైఎస్ జగన్ పై కేసుల విషయంలో అత్యుత్సాహంగా వ్యవహరించిన జెడి లక్ష్మీనారాయణ ఉదంతమే ఓ పక్కా ఉదాహరణ. పక్క రాష్ట్రాల సిబ్బందిదని సైతం పిలిపించి మరీ జగన్ పై దర్యాప్తు చేయించిన జెడీ లక్ష్మీనారాయణ పసుపు నీడ చాటున దాక్కున్న అధికారి అని అందరికీ అప్పుడే తెలిసింది. చంద్రబాబు కేసు విషయంలో సిబ్బంది లేరని సాకు చూపి తప్పించుకున్న విషయాన్ని ఎవ్వరూ మరిచిపోరు. దర్యాప్తు సంస్థలు రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు, అందునా చంద్రబాబు చెప్పినట్టే వినాలనే వీరి డిమాండ్ ఇంత పబ్లిక్ గా వినిపించడం నిజంగా అధికార దురహంకారానికి నిదర్శనం. 
ఇక రాజధాని జిల్లా అయిన గుంటూరు ప్రాంతంలో జరిగిన మిని మహానాడులో మరో పచ్చనేత పలికిన చిలక పలుకులు వింటే ఈయన గానీ జాతకాలు చెప్పే చిలక గాదు కదా అనిపిస్తుంది. బాపట్ల ఎమ్.పి శ్రీరామ్ మాల్యాద్రి భవిష్యత్ లో మరోపార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేసినా ఆశ్చర్యం లేదంటూ జోస్యం చెప్పారు. రాజధాని ప్రాంతంలో రైతులను, గ్రామాలను మోసం చేసి, భయపెట్టి లక్షల ఎకరాలను దండుకున్న తెలుగు తమ్ముళ్లకు రాజధాని వేరే చోటకు మారితే నెత్తిన చెంగే అని తెలుసు. ఇందులో మరో విశేషమేంమంటే 2019 ఎన్నికల విషయంలో ఆ పార్టీ నేతలకే తమ గెలుపు మీద నమ్మకం లేదు. ఏదో విధంగా ప్రతిపక్షాన్ని తప్పు పట్టో, ప్రతిపక్ష నేతను  విలన్ ని చేసో భవిష్యత్ ఎన్నికల్లో నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నారు. మాల్యాద్రి మాట్లాడుతూ రాజధాని రైతులు స్వచ్ఛందంగా భూములుఇస్తే, జగన్ కేసులు వేయించాడంటూ ఉడుక్కున్నారు. కాస్త తెలివున్న ఎవరైనా ఈ ఎమ్.పి గారిని ఓ మాట అడుగుతారు. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చుంటే వాళ్లు తిరిగి న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు. చంద్రబాబు టీమ్ లో మెంబర్ గా ఉన్నపవన్ కూడా రాజధాని రైతులను కలవడానికి వెళ్లినప్పుడు, బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని ప్రగల్బాలు ఎందుకు పలికాడు? 
రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన తెలుగు తమ్ముళ్లు తమ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్ పై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని అర్థం అవుతోంది కానీ, ఈ కప్పల బెకబెకలను ఎండగట్టేందుకు తెలుగు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని మాత్రం తెలియడం లేదు.  
Back to Top