బడాయి బంగార్రాజు

ఊరుకోవాలే గానే ఉన్నపళంగా ఆకాశానికి రంగులేస్తా అనగలరు ఎల్లోగ్యాంగ్ సభ్యులు. నడిసముద్రంలో నాట్యం చేస్తామని కూడా చెప్పగలరు. బికాంలో ఫిజిక్స్ చదివి వీర పాపులర్ అయిన జలీల్ ఖాన్ అయితే చంద్రబాబు ఊ అనాలేగానీ వచ్చే ఎన్నికల్లో ట్రప్ పైనే పుతిన్ పైనో పోటీ చేస్తా అని గూడా అనగల్రు. మరీ అంత విడ్డూరమా అని ముక్కున వేలేసుకోనక్కర్లేదు. అంత విడ్డూరమే. ఎందుకంటే టిడిపిలో చంద్రబాబు నుంచి మొదలుకుని జలీల్ ఖాన్ వరకూ అందరూ బడాయి బాబులే మరి. 
జలీల్ ఖాన్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుంచి, ఎవ్వరితో పోటీ చేయాలన్నదాన్ని డిసైడ్ చేసుకున్నార్ట. ఆయనే కాదండోయ్ ఆయన కుమార్తెను కూడా ఎన్నికల బరిలో నిలబెట్టాలనుకుంటున్నార్ట. ఇంత వరకూ ఓకె. కానీ ఆయన పోటీ ఎవరితో చేయాలనుకుంటున్నారో వింటే ఫన్ బకెట్ జోక్ విన్నట్టు పడీ పడీ నవ్వాల్సిందే. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణమీద జలీల్ ఖాన్, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఆయన గారి కుమార్తె పోటీ చేస్తార్ట. ఇంకా మాట్లాడితే కేజ్రీవాల్ పై వాళ్లావిడ, మోదీపై ఆయన కారు డ్రైవరూ పోటీ చేస్తారని అనగలరు జలీల్ ఖాన్. చంద్రబాబు అవకాశం ఇవ్వాలని, ఆయన అనుమతిస్తే జగన్ పై, కన్నాపై పోటీ చేసి తమ ప్రతాపం చూపిస్తామని బస్తీమే సవాల్ చేస్తున్నారు జలీల్ ఖాన్. 
నిజానికి అమెరికాలో టిడిపి అధికారంలోకి రావాలని పప్పు బాబు అన్నప్పుడే తెలుగుదేశం నాయకులు పప్పేష్ ను ట్రంప్ తో ఎన్నికల్లో పోటీ చేయించి, భారీ మెజారిటీతో అమెరికాలో ఎల్లో జెండా ఎగరేయించాలని ఆశపడుతున్నారు. లిబర్టీ విగ్రహం చేతిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని కలలు కూడా కన్నారు. నేడు జలీల్ ఖాన్ వరస చూస్తుంటే అలాంటి కలలు నిజం అవుతాయనే ఆశాభావం వారిలో మెరుగౌతోంది. 
టిడిపిలో మంత్రి పదవి ఆశించి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వెళ్లిన జలీల్ ఖాన్ కు చంద్రబాబు మొండి చేయి చూపించాడు. కేబినెట్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయి జలీల్ ఖాన్ కు మంత్రి పదవి దక్కలేదు. ఫిరాయింపుదారులకు పదవుల తాయిలాలతో బుజ్జగించే పని పెట్టుకున్న చంద్రబాబు జలీల్ ఖాన్ కు కూడా నామినేటెడ్ పదవి ఇచ్చి సంతృప్తి పడమన్నాడు. అయితే రాష్ట్రవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బికాంలో ఫిజిక్స్ చదివిన విద్యావంతుడిగా, జ్ఞానవంతుడిగా జలీల్ ఖాన్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు భయపడి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కూడా డౌటే అన్నట్టు మాట్లాడాడట చంద్రబాబు. దీంతో పాలుపోని జలీల్ ఖాన్ ఏదో ఒక సంచలన ప్రకటనతో చంద్రబాబుకు తనపై గురి కుదిరేలా చేసుకోవాలనే ఇలాంటి వాఖ్యలతో వార్తల్లో ప్రచారం పొందాలనుకుంటున్నాడంటున్నారు కొందరు గిట్టనివాళ్లు. ఏమైనా కానీ ఒక పక్క పప్పేష్ మరోపక్క జలీల్ ఖాన్ టిడిపి పరువును యధాతథంగా కాపాడే రెండు కళ్లు అని మురిసి పోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 

 
Back to Top