బాబు మాటలు...నీటి మూటలు


  కరువుకు కరువొచ్చింది. కరువు భయంతో వణికిపోతుంది. కరువు పరారైపోయింది. కరువు అసూయ పడుతుంది. కరువు ఓడిపోయింది. ఎక్కడైనా  కరువును పట్టి ఇస్తే కోటి రూపాయల నగదు బహుమానం - ఈ  మాటల్నీ విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా కరువు లేదేమో అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇవన్నీ రాయలసీమ పర్యటనల్లో సి.ఎం బాబు పదే పదే అదే పనిగా  చెప్పే మాటలు.

   కృత్రిమంగా పంటలను తడిపే రెయిన్ గన్  పట్టుకుని బాబు పొలంలో దిగితే వీడియో గన్స్ పట్టుకుని మీడియా వార్తల తుంపర సేద్యం చేసింది. ఎండిన  పొలాలు ఎన్ని లక్షల ఎకరాలు ? రెయిన్ గన్ సంప్రోక్షనతో పంట సంరక్షణ జరిగింది. ఎన్ని వేల ఎకరాలకు ? అన్న మౌలికమైన ప్రశ్న ఎవరూ అడగలేదు.

  అరెకరం పంట బతికినా అభినందించాల్సిందే. మంచి ప్రయత్నం. ఎవరైనా ఆహ్వానించాల్సిందే. అమరావతి మోజులో , అనుసంధానం చిక్కు ముళ్ళలో గోదావరి, కృష్ణ జలాలు ఎండిన రాయలసీమ పొలాలను ఎప్పుడు తడుపుతాయో తెలీదు కానీ, బాబు మాత్రం కరువు అసూయ పడాలి అన్న పాటనే రెండేళ్లుగా విసుగు లేకుండా వినిపిస్తున్నాడు.
 హక్కుగా ఉన్న నీటికి దిక్కు లేదు కానీ, కొసరు తుంపర్లు మీద బాబు దృష్టి పెట్టారు. ఎప్పుడో జలయజ్ఞంలో భాగంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కాలువల్లోకి నీళ్ళు మళ్లించి, ఇప్పుడు తన పేరును సర్ నారా కాటన్ గా మార్చాలని బాబు వేడుకొంటున్నారు. నీరు - ప్రగతి, నీరు- చెట్టు, నది- అనుసంధానం, నది- కాలువ, చుక్క- ఇంకుడు.....ఇలా పేర్లేమో అన్నీ నీటితోనే  ముడిపడి ఉంటాయి. కానీ బాబు మాటలేమో నీటి మూటలుగానీ మిగిలిపోతూ ఉంటాయి. ఫలితం ఎలా ఉన్నా ప్రచారంలో  మాత్రం బాబు కాన్సెప్ట్ విత్తనాలు మొలకెత్తి, పూలు పూసి, కాయలు విరగకాచి పళ్ళు బండ్ల కెత్తినట్లు ఉంటుంది.
Back to Top