కార్మిక బాబు ‘మేడే’ డాబు


ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట...ఇలాగే ఉంది బాబు మేడే స్పీచ్ చూస్తే. కార్మికులంతా తన సొంత తమ్ముళ్లే అన్నట్టు మాట్టాడారు చంద్రబాబు. ఆ మాటకొస్తే తెలుగు తమ్ముళ్ల కంటే వాళ్లే ఎక్కువ అన్నంత బిల్డప్ కూడా ఇచ్చారు. సొంతవాళ్లకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నీతి కనుక కార్మికులకు బాబు ఇప్పటిదాకా ఏం చేసాడో, చేస్తానని చెప్పి రేపేం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 
ప్రతికార్మికుడికి సొంత ఇల్లు సమకూర్చేలా పారిశ్రామికవేత్తలు సహకరించాలని పిలుపునిచ్చారు బాబుగారు. లక్షల ఇళ్లు, ఒకేసారి గృహప్రవేశాలూ అంటూ బ్యాండ్ మోగించిన ప్రభుత్వమే ఇంత వరకూ ఒక్క ఇల్లు కట్టి పేదవాడికి అందించలేదు. అలాంటిది లాభాల కోసం పనిచేసే వ్యాపారవేత్తలు కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్ట. మరి బాబుగారు తన హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఇళ్లు కట్టించి ఇచ్చాడో లేదో వేదికమీద చెబితే బాగుండేది. 

కార్మికుల కనీస వేతనాలు చెల్లించాలింఇదిగో ఇప్పుడే చెబుతున్నా దీని కోసం మీరు రాష్ట్రమంతా పర్యటించాలి అని చంద్రబాబు అధికారులను అప్పటికప్పుడే ఆదేశించారు గూడా. బాబుగారి మాటల్లో గూడార్థం తెలిసిన ఆ అధికారులు అలాగే అంటూ బుర్ర ఆడించారు. 24 గంటల సర్వీసుగా పనిచేసే 108, 104 ఉద్యోగుల జీతాలే సవ్యంగా ఇవ్వకుండా వారిని ముప్పు తిప్పలు పెడుతున్న ముఖ్యమంత్రి కనీస వేతనాల చెల్లిపంపుల గురించి అధికారుల మీద గరం గరం అవుతున్నారు. అక్కడితో అయిపోలేదు బాబుగారి మేడే బడాయి. లక్షలాది మంది కార్మికులకు ఈఎస్ఐ బీమా ప్రీమియం తానే కడతానని మహా ఉదారంగా మాటిచ్చేసారు. అసలు కార్మికుల ఆరోగ్యం గురించి అంత అక్కరే ఉంటే ఇప్పటి వరకూ సాంక్షన్ చేసిన ఈఎస్ఐ ఆసుపత్రులనే కట్టుండాలి కదాం బాబు గారు తన బంగారు చేతుల మీదుగా ఉత్తమ యాజమాన్యం, ఉత్తమ శ్రమశక్తి అవార్డులు అందించారు. ఏళ్ల తరబడి జీతాల పెంపుకు నోచుకోక, సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్న ఆశ, గోపాలమిత్ర, అగన్వాడీ వర్కర్ల గోడు మాత్రం పట్టించుకోరు. వారు నిరసన తెలిపినా నిర్దాక్షిణ్యంగా అణగదొక్కేస్తారు. 

రవాణా కార్మికుల కష్టాలు చంద్రబాబు పాదయాత్రలో చూసారటంఅవునులెండి పాదయాత్ర పావు వంతూ, బస్సు యాత్ర ముప్పావు వంతూ అయినప్పుడు రవాణా ఉద్యోగుల కష్టాలు తెలియకుండా ఎలా ఉంటాయి? బాబు హయాంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిన విషయం ఎవరైనా మరువగలరా? సరే విషయానికొస్తే ఆ కష్టాలు చూసి అప్పుడు కడివెడు కన్నీరు కార్చిన బాబు ఇప్పుడు బీమాతో వారి బతుకుల్లో భద్రత నింపుతున్నానని చెప్పారు. చంద్రన్న బీమా మీ జీవితానికి ధీమా అంటున్నాడు. బాబు చెప్పిన చంద్రన్న బీమా లెక్కలన్నీ బోగస్ అని రాష్ట్రం మొత్తానికీ తెలుసు. రెండేళ్ల క్రితం మొదలెట్టిన ఈ బీమా పథకం లబ్దిదారులకు లక్ష కొర్రీలు పెట్టి, క్లెయిములు అందకుండా చేస్తోంది. ఇక బాబు గారు స్వయంగా మార్చిన అర్హతల జాబితా వల్ల లక్షలాది మంది ఈ బీమా పరిధిలోకే రాకుండా పోయారు. 

కార్మికుల పట్ల బాబు చిత్త శుద్ధి ఏపాటిదో కార్మిక సంక్షేమ పన్ను వసూలు గురించి ఆరాతీస్తే తెలిసిపోతుంది. కార్మికుల సంక్షేమం కోసం నిర్మాణాలు జరిపే సంస్థల నుంచి 1 శాతం పన్ను వసూలు చేయాలని 2006లో చట్టం రూపొందించారు. బాబు హయాంలో ఈ పన్ను వసూలుపై తీవ్ర అలసత్వం కనిపిస్తుంది. నిర్మాణ సంస్థలు కార్మిక సంక్షేమ పన్ను ఎగవేస్తూ, బోగస్ చలానాలతో టోకరాలేస్తున్నారు. నవ్యాంధ్రరాజధాని అంటూ చెప్పుకుంటున్న కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతలో వేగంగా వెలుస్తున్న నిర్మాణాలు వేలల్లో ఉంటున్నాయి. కానీ చాలా వరకూ ఈ నిర్మాణాలు చేపడుతున్న సంస్థలు కార్మికులకోసం ప్రభుత్వానికి కట్టాల్సిన 1శాతం సెస్ ను చెల్లించడమే లేదు. వందల కోట్ల రూపాయిల పన్ను వసూలు కాలేదని ఆడిట్లు చెబుతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రమాదాల బారిన పడ్డప్పుడు, అత్యవసర సమయంలో ఈ నిధినించి వారికి కేటాయింపులు జరిపేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం తాను స్వయంగా నిధులు ఇవ్వక్కర్లేకుండానే వారికి ఈ సంక్షేమ నిధి నుంచి బాధితులకు నష్టపరిహారం అందించొచ్చు. ఇలాంటి ముఖ్యమైన అంశాన్నే నిర్లక్ష్యం చేసే ముఖ్యమంత్రి, కార్మికుల సంక్షేమంకోసం కాళ్లకీ చేతులకీ కంకణాలు కట్టుకున్నానంటున్నాడు. 

ప్రభుత్వాలు, పరిశ్రమల విధానాల వల్లే నేడు కార్మికుల సమ్మెలు ఉండటం లేదని ఓ మహా సత్యాన్ని ఆవిష్కరించాడు చంద్రబాబు. అసలు బాబు విధానాల వల్ల ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయో, ఎందరు కార్మికులు రోడ్డున పడ్డారో, వాటిపై పరోక్షంగా ఆధారపడ్డ అసంఘటితరంగ కార్మికులెందరో చెప్పడానికి లెక్కలు సరిపోవు. కార్మికుల జీవితాలకు తన స్వార్థ ప్రయోజనాలతో మరణ శాశనం రాసే చంద్రబాబు కార్మిక ప్రయోజనాలంటూ మేడే రోజు ఇచ్చిన ఉపన్యాసం,   దెబ్బ కొట్టి మందు పూస్తానన్న చందంగా ఉంది. 
 
Back to Top