బాబూ నీ సైకిల్ స్లోనా ఏంటి…?

చంద్రబాబు దగ్గరకొచ్చారు కొందరు విద్యార్థులు 

మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలి అన్నారు.

ఎందుకు? అన్నాడు చంద్రబాబు అనుమానంగా..

సర్వే అన్నారు పిల్లలు

ఆ పేరు వినగానే వణుకొచ్చింది బాబుకి. నంద్యాల్లో, కాకినాడలో చేయించిన దొంగ సర్వేలు, ప్రతిపక్షం చేతిలో దొరికిపోయి మీడియాలో చిక్కిన విషయాలు గుర్తొచ్చాయి బాబుకి.

సర్వేనా...? ఎన్నికల టైంలో సర్వేలు కుదరవు. నోనో అన్నాడు. 

ఇది ఎన్నికల సమయంలో ఓటర్ల సర్వే కాదు బాబుగారూ. పాలన గురించి ప్రభుత్వాన్ని చేసే సర్వే అన్నారు పిల్లలు. 

ఓహో… ఎన్నికలకు సంబంధం లేకపోతే సరే. అడగండి అన్నాడు బాబు ఊపిరిపీల్చుకుని.

మొదటి ప్రశ్న… మీ పార్టీ గుర్తు ఏంటి? అడిగారు పిల్లలు.

అయ్యో అది కూడా తెలియదా అన్నాడు బాబుఆశ్చర్యపోయి.

తెలిసినా తెలియకున్నా సర్వేలో అడిగితే చెప్పాలి అన్నారు పిల్లలు.

సైకిల్ అన్నాడు బాబు.

రండవ ప్రశ్న… మీ సైకిల్ కు చక్రాలెన్ని అడిగారు.

బుర్రగోక్కున్నాడు బాబు. రెండు అన్నాడు తన రెండు వేళ్లను పైకెత్తి చూపుతూ.

అబద్ధం అరిచారు పిల్లలు. మీ సైకిల్ కి ఒక చక్రం ఊడి మూలన పడింది. రెండోది పంక్చరైంది. అన్నారు.

మీకెలా తెలుసు… ఉక్రోషంగా అడిగాడు బాబు.

మా దగ్గర డిటైల్స్ అన్నీ ఉన్నాయి. చేతిలో ఉన్న టాబ్ లు పైకెత్తి చూపించారు పిల్లలు. 

నీళ్లు నమిలాడు బాబు.

ఇంకో ప్రశ్న- మీ సైకిల్ కి సీటు ఉందా లేదా అడిగారు పిల్లలు.

ఎక్కడ…??? కాకినాడ లోనా…? నంద్యాల లోనా….? అడిగాడు బాబు కన్ ఫ్యూజింగ్ గా.

ఎన్నికల సంగతి కాదండీ మీ సైకిల్ సంగతి అన్నారు పిల్లలు నవ్వుతూ.

ఓహో… అదా! ఎన్నికల కోసం తిరిగి తిరిగీ, వాటి గురించే ఆలోచించీ చించీ అవే వస్తున్నాయి మాటల్లోకి.. సారీ…నా సైకిల్ కి సీట్ ఉంది. ఎల్లో కలర్ అన్నాడు బాబు గర్వంగా.

మళ్లీ తప్పు అన్నారు పిల్లలు టాబ్ లో చెక్ చేస్తూ…

ఏం అన్నాడు బాబు బుంగమూతి పెట్టుకుని.

ఇదిగో మీ సైకిల్ సీటు ఆల్రెడీ చిరిగిపోయింది. రేపో మాపో ఊడి పడబోతోంది. యామ్ ఐ కరెక్ట్ అన్నదో విద్యార్థిని. 

సాక్ష్యాలు వాళ్ల చేతిలో ఉండటంతో ఒప్పుకోక తప్పలేదు బాబుకి. కరెక్టే. సైకిల్ మీద కూర్చోడానికే వీలు లేకుండా ఉంది అన్నాడు దిగులుగా. 

తరువాతి ప్రశ్న… మీ సైకిల్ గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అడిగారు పిల్లలు.

నా సైకిల్ ప్రగతి రథం లాంటిది. రాకెట్ లా దూసుకుపోతుంది అన్నాడు బాబు ఆవేశంగా. 

మళ్లీ రాంగ్ చెబుతున్నారు. అరిచారు పిల్లలు. 

వాళ్ల అరుపులకి దడుసుకుని రెండడుగులు వెనక్కి వేసాడు బాబు.

ప్రస్తుతం మీ సైకిల్ మోసుకెళడానికి తప్ప తోసుకెళ్లడానికి కూడా పనికిరాదు- మా దగ్గర డిటైల్స్ … టాబ్ పైకెత్తి చూపించబోయారు పిల్లలు.

తెలుసు తెలుసు.. మీ దగ్గర డిటైల్స్  అన్నీ డిటైల్డ్ గా ఉన్నాయి. మరి అన్ని డిటైల్స్ ఉండి నన్నెందుకు ప్రశ్నలేస్తున్నారు కాస్త కోపంగా అడిగాడు బాబు. 

మీ గవర్నమెంట్ గురించి ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ఏంటో తెలిసి కూడా మీరు స్టూడెంట్స్ తో ఊళ్లలో సర్వేలు చేయించట్లా. ఇదీ అలాగే అన్నారు పిల్లలు.

సైలెంట్ అయిపోయాడు బాబు. 

పిల్లలు తర్వాతి ప్రశ్నకి వెళ్లిపోయారు.

ఇంతకీ ఇలాంటి సైకిల్ పై మీరెలా ముందుకుపోదాం అనుకుంటున్నారు? 

పాత హామీలతో మళ్లీ గాలి కొట్టి, కొత్త హామీల టైర్లు పెట్టి, చిరిగిన సీటుకి నోట్ల కవర్లు తొడిగి, ఫిరాయింపుల జెండాలతో అలంకరించి…. ఆవిధంగా సైకిల్ ను ముందుకు తీసుకుపోతాం – దర్జాగా చెప్పాడు బాబు.

ఇక రాపిడ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి త్వర త్వరగా సమాధానం ఇవ్వాలి అన్నారు పిల్లలు.

రెడీ అన్నాడు బాబు.

రాజధాని నిర్మాణం

ప్రపంచదేశాలన్నీ దీనికి బాధ్యత వహించాలి.

పోలవరం ప్రాజెక్టు

కేంద్రంలో మా సైకిల్ బెల్లు పనిచేయట్లేదు.

కాకినాడ స్మార్ట్ సిటీ

ప్రజలు మరీ ఇంత స్మార్ట్ అనుకోలేదు.

ఆంధ్రా అభివృద్ధి

నా విదేశీ పర్యటనలు ఇంకా పూర్తికాలేదు.

లోకేష్ సంగతి

ష్…… ఆ ఒక్కటీ అడగొద్దు

 

పిల్లలు నవ్వాపుకుంటూ కుర్చీల్లోంచి లేచారు.

బాబు ఆత్రంగా.. ఇంతకీ మీ సర్వే రిపోర్ట్ ఏంటి? అని అడిగాడు.

కాసేపట్లో మీకు మెసేజ్ వస్తుంది అని వెళ్లిపోయారు.

పిల్లలు గేటు దాటగానే బాబు ఫోన్లో మెసేజ్ రింగ్ మోగింది.

ఒక్క ఉదుటున ఫోన్ తీసుకుని ఓపెన్ చేశాడు.

అందులో ఇలా ఉంది..

‘’సైకిల్ షెడ్డుకి – పార్టీ ఇంటికి’’

చంద్రబాబు బిక్క మొహం వేశాడు..

 

 

 

 

 

 

 

Back to Top