బాబు ఎమ్.ఓ.యు

చంద్రబాబు వన్నీ ప్రాధమిక అవగాహనా ఒప్పందాలే. అంటే మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ అన్నమాట. కొరియన్ కంపెనీతో అలాంటి అండస్టాండింగే జరిగిందట. త్వరలో రాష్ట్రంలో పారిశ్రామక కారిడార్ దూసుకొచ్చేస్తోందట. అఫ్ కోర్స్ 2015లో చెప్పిన మాటే ఇప్పుడూ చెబుతున్నాడు అనుకోకండి. ఇలాంటి ఎమ్ ఓ యులు మన రాష్ట్రానికి కొత్త కాదు. చంద్రబాబు అడుగడుగునా ఇలాంటి ఎమ్.ఒ.యులు చేస్తూనే ఉంటారు. అటు వ్యాపారంలోనూ ఇటు రాజకీయంలోను బాబు ఎమ్.ఒ.యుల తో రాష్ట్రం ఆ విధంగా ముందుకుపోతోంది. 
ఎన్నికల కోసం బిజెపితో కుదుర్చున్న పొత్తు ఎమ్.ఒ.యు అనే తేల్చేశాడు చంద్రబాబు. అందుకే ఇప్పుడు దాన్ని రద్దు చేసేసుకుని బిజెపితో తెగతెంపులు చేసేసుకున్నాడు. ప్రతి ఏడాది పార్టనర్ షిప్ సమ్మిట్ లో లక్షల కోట్ల విలువైన అవగాహనా ఒప్పందాలు జరిగాయి. అవన్నీ ఎక్కడున్నాయి, ఆ పెట్టుబడులన్నీ ఏమైనాయి అని మీరు బుర్రలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవగాహనా ఒప్పందాలన్నీ మీ అవగాహన కోసం చేసుకున్నవి కాదు. తమ అవకాశాల కోసం బాబు వాడుకున్నవి. ఇక విదేశాల్లో వీర లెవెల్లో పెట్టుబడుల వేటకు పోయినప్పుడు కూడా బాబు బోలెడు ఎమ్.ఒ.యులు కుదుర్చుకున్నారు. కాకపోతే వచ్చేప్పుడు వాటిని ఎపికి తీసుకురావడం మర్చిపోయారు. లేదా బాబు ఇలా ఫ్లైట్ ఎక్కగానే వాటి సంగతి అక్కడి వాళ్లైనా మర్చిపోయి ఉంటారు. రెండిట్లో ఏదో ఒకటి గ్యారెంటీ..

ఇక పవన్ కళ్యాణ్ తో బాబు మాట్లాడుకున్న ప్యాకేజీ అసలు సిసలైన ఎమ్.ఒ.యు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఈ అవగాహానా తాఖీదు వల్ల బాబు ఎంత లబ్ది పొందాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో కూడా ఎమ్.ఒ.యు కుదుర్చుకునే పనిలో ఉన్నాడని విశ్వసయనీయంగా తెలియవస్తోంది. అవగాహనకు రావడం ఆ తర్వాత ఒప్పందం చేసుకోవడం వరకూ అంతా బానే ఉంటుంది. అయితే ఎం.ఒ.యుకు చట్టబద్ధత లేనట్టే బాబు చేసుకునే ఒప్పందానికి కూడా నిబద్ధత అంటూ ఏదీ ఉండదు. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు బాబు ఆ అవగాహనను అవగాహనా రాహిత్యం అని చెప్పి, ఉన్నపళంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోగలడు. అందుకు బోలెడు కారణాలు చెప్పనూగలడు. అయితే ఆ కారణాలు సిల్లీగా అనిపిస్తే మాత్రం అది బాబు తప్పు కాదండోయ్..
పోలవరం కాంట్రాక్టుల విషయంలో, అధిక ధరలతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, రాజధాని నిర్మాణం విషయంలో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అన్నింట్లోనూ బాబు ఎమ్.ఒ.యులు వందలు వేల సంఖ్యలో ఉన్నాయి.  మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్... బాబు దృష్టిలో మాయ చేయగల ఒక ఒప్పందం...ఎమ్.ఒ.యు. 

Back to Top