అయ్యో ఐఏఎస్..!

తాగుబోతులంటే చంద్రబాబుకు అపారమైన గౌరవం. తారకరామన్న సంపూర్ణ మద్యనిషేధం అన్నప్పుడు కూడా మొదట ఉలిక్కిపడింది బాబే. మొండిగా ఎన్టీఆర్ మద్యనిషేధం అమలు చేశాడు. ఆయన కుర్చీ లాక్కున్న చంద్రబాబు మద్య నిషేధానికి మొహమాటం లేకుండా మంగళం పాడారు. ఇంకేవో ప్రయోజనాలు ఆశించి  మద్యనిషేధ మహోద్యమాన్ని  నడిపిన మిత్ర పత్రిక కూడా ఆ ప్రయోజనం నెరవేరగానే బాబు నిర్ణయానికి బాజా ఊదుతూ "సరైన సమయంలో సరైన నిర్ణయం" అంటూ  సంపాదకీయం రాసి పరవశించి పోయింది.
                                              జనం మత్తులో ఉన్నంతకాలం మనం ఎత్తులోనే ఉంటామన్న క్లారిటీ బాబుకు అనాదిగా ఉంది. అయితే పాపం ఐఏఎస్ బాబులకే క్లారిటీ లేక మొన్న చిన్నబోయారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆన్ లైన్ చెల్లింపుల మీద బాబు చేసే హడావుడితో భూమి ఆకాశం ఒకటవుతున్నాయి. ఒక్కపూట మద్యం చుక్కలేకపోతే కిక్కురాక బిక్క చచ్చిపోయే మందుబాబులు ప్రధాని మోదీ ప్రకటించిన మరుక్షణమే కార్డులతో స్వైపింగ్ చేసి బాటిళ్లకు బాటిళ్లు తాగడం సిఎం బాబుకు తెగ నచ్చింది. ఆ స్ఫూర్తి, ఆ వేగం, ఆ తపన, ఆ టెక్నాలజీ వాడకం, ఆ కిక్కు ఐఏఎస్ అధికారులకు ఎందుకు లేదో బాబుకు అర్థం కావడం లేదు.

                                                     ఆర్బీఐ పనులు భుజాన వేసుకున్న బాబు ఎంతమంది ఐఏఎస్ అధికారులు కార్డు చెల్లింపులోకి మారారో చేతులెత్తండి అన్నారు. 20 శాతం కూడా లేకపోయేసరికి సిగ్గుతో తలదించుకున్నారు. అవమాన భారంతో ఆ రోజు అన్నం తినడం మాని ఆఫీసర్లను నమిలి మంగేశారు. అక్షరం ముక్క రాని మందు చుక్క తప్ప ఏమీ తెలియని మత్తు బాబులే మీకంటే నయం అని కన్నెర్ర చేశారు. విసుక్కున్నారు. క్లాస్ తీసుకున్నారు. క్లాసు తీసుకున్నట్లు మీడియాకు వెంటనే లీకు వార్తలు కూడా ఇచ్చారు.
                                                      "ఇంత బతుకూ బతికి...."అని తెలుగులో ఒక సామెత. ఐఐటీలు, పీజీలు, పీ.హెచ్.డీ లు లాంటి సర్వోన్నత విద్యలు చదివి జాతీయస్థాయిలో లక్షలమందితో పోటీ పడి, పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నెగ్గి, శిక్షణ పొంది అధికారులుగా వస్తే చివరకి మందు బాబుల కంటే హీనమయ్యామా అని కన్నీరు కార్చుకుంటూ ఐఏఎస్ లు విలపిస్తున్నారు. 
                                                        ఈ సింపుల్ సీన్ శాంపిలే. ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్!
Back to Top