కట్టు కథల పెట్టుబడులు

మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్న నాలుగు సెకన్లు కూడా దాటని ఆఫ్టరాల్ ఫోన్ కాల్ మాట మెడకు చుట్టుకొని ఊపిరాడక హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో, గొంతులో పడ్డ పచ్చి వెలక్కాయతో వెలగపూడికి వెళ్లిన బాబు తన వసతి, తన ప్రయాణాలు, తన విడిది భవనాల కోసం పెట్టుకున్న పెట్టుబడులు మొగల్రాజపురం కొందేలకంటే ఎక్కువ. ఎప్పుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని అమరావతిలో ప్రతిష్టించింది అంటూ ఆదేశాలిచ్చే బాబు ఇప్పటిదాకా ఏయే దేశ సంచారం చేశారో, ఏయే దేశగానం  చేశారో, ఆయా శుభ సందర్భాల్లో ఒళ్లు పులకించి చెప్పిన ఆణిముత్యాలేమిటో తారీఖులు దస్తావేజులు, సౌండ్ బైట్లు, న్యూస్ క్లిప్పింగ్ లతో పాటు సోషల్ మీడియా పుణ్యమా అని బయట విస్తృతంగా సంచారం చేస్తున్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే తాను ఆ మాటలే అనలేదనో, అన్నా ఆ మాటల అర్థం అది కాదనో  బాబు సవరణానుగ్రహ భాషణ చేసేవారు. మీరు ఎమ్మెల్యేలను కొన్నారా? ఫోన్ లో మాట్లాడింది మీరేనా అని ఒక ఢిల్లీ జర్నలిస్టు అడిగితే బాబు గారు ఎలా స్పందించారో యూట్యూబ్ లో చూడండి. లోకల్ జర్నలిస్టులు ఆ మాత్రం అడగలేక కాదు-ఎందుకో వీలు పడలేదు-అంతే. 

                                                          ప్రళయ భీకరమైన హుద్ హుద్ మీద విరుచుకు పడ్డా, కేంద్రం, రాష్ట్రం హామీ ఇచ్చి సహాయాన్ని తూతూమంత్రంగా ముగించినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ విశాఖ అంటే బాబుకు వల్లమాలిన ప్రేమ. పార్ట్ నర్ షిప్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లాంటి పెద్ద పెద్ద సమ్మెట పోట్లన్నీ విశాఖ మీదే వేయడం బాబు అలవాటు. గడచిన సమ్మిట్ లో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఒప్పందాలు అని సన్ రైజింగ్ స్టేట్ అనగా ఆంధ్రప్రదేశ్ సి.ఎం.గా బాబు చెప్పుకున్నారు. నంబర్లు పెంచడమే కాబట్టి ఈసారి హీనపక్షం ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఒప్పందాలు జరిగి తీరుతాయి. అయితే ప్రకటనల తరువాత నిలబడే ఒప్పందాలెన్ని? వచ్చే పెట్టుబడులెన్ని? వాటి వల్ల కొత్తగా వచ్చిన ఉద్యోగాలెన్ని?లాంటి మూర్ఖపు ప్రశ్నలు అడగరాదు. అడిగినా బాబు ఢిల్లీ జర్నలిస్టుకు చెప్పినట్లు అర్థం కాకుండా చెప్తారు. 

తాజా వీడియోలు

Back to Top