బాబు భ‌క్తి సూత్రాలు

గుడి, మ‌సీదు, చ‌ర్చికి వెళుతున్న వారి మీద ప‌డింది రైసింగ్ స‌న్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌న్ను. తెలుగు వ్యాక‌ర‌ణంలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియా ప‌దాల అన్వ‌యం లేకుండా బాబు మాట్లాడిన‌ట్లు అనిపిస్తుంది. కానీ, మ‌నం అన్వ‌యం చేసుకుంటే ఆయ‌న మాట్లాడే ప్ర‌తి వాక్యానికి మాహాభాష్యాలు రాయ‌వ‌చ్చు.
    ఉదాహ‌ర‌ణ‌కు తాజాగా ఆయ‌న మాట్లాడిన పాపం భ‌క్తి అన్న అనుగ్ర‌హ‌భాష‌ణ‌ను చూద్దాం. అందులో వేదాంతులు కూడా వేయి జ‌న్మ‌లెత్తినా విడ‌మ‌ర‌చి చెప్ప‌లేని ఎన్నో త‌త్వ ర‌హ‌స్యాలున్నాయి. వెయ్యేళ్ల దాకా ప్ర‌పంచం అసూయ ప‌డేలా త‌యారుకాబోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ద‌గ్గ‌ర్లో టిడిపి నాయ‌కుడి ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రిగిన అధికారిక క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో అయ్య‌వారి భ‌క్తి గుళిక‌లు అంద‌రూ గుటుక్కున మింగ‌వ‌ల‌సిన‌వే.
   `` పాపాలు చేస్తున్నారు. గుడి, మ‌సీదు, చ‌ర్చిల‌కు వెళ్లి ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. మోసాలు చేస్తున్నారు. ప్ర‌ాయ‌శ్చిత్తానికి లెంప‌లేసుకుంటున్నారు. అక్ర‌మంగా సంపాదిస్తున్నారు. హుండీల్లో డ‌బ్బులేస్తున్నారు. అన్ని శాక‌ల ఆదాయాలు అంతంత మాత్రంగా ఉంటే దేవాదాయ శాఖ ఆదాయంలో ఏకంగా 26 శాతం పెరుగుద‌ల ఉంది. కేవ‌లం మ‌ద్యం మానేయ‌డానికే అయ్య‌ప్ప మాల వేసుకుంటున్నారు. దీంతో ఆ సీజ‌న్‌లో అబ్కారీ శాక అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. గుడి, మ‌సీదు, చ‌ర్చి లేక‌పోతే జ‌నం పిచ్చి వాళ్ల‌యిపోతారు``.
     మ‌రుస‌టి రోజు మీడియాతో బాబు భ‌క్తి సిద్ధాంతాలు బాక్స్ ఐట‌మ్‌గా త‌గిన ప్రాధాన్యంలో వ‌చ్చాయి. అందులో ఆనందించాల్సిందే కానీ, త‌ప్పుప‌ట్ట‌డానికి ఏమీ లేదు. రాద్ధాంతం చేసే వారు ఎప్పుడూ ఉంటారు. నిజానికి ఎంత రాద్ధాంతం జ‌రిగితే సిద్ధాంతం అంత బ‌ల‌ప‌డుతుంది. శంక‌ర్ అప‌రిచితుడు సినిమా హిరో విక్ర‌మ్‌లో స్ల్పిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉంటుంది. ప‌రీక్ష‌ల అనంత‌రం డాక్ట‌ర్ నాజ‌ర్ మెడిక‌ల్ ప‌రిభాస క‌ల‌గ‌లుపుతూ చెప్పే వ‌ర‌కు మ‌న‌కీ విష‌యం స‌రిగా అర్థం కాదు.

అలాగే బాబు భ‌క్తి సిద్ధాంతం గురించి వేదాంతులు త‌త్వ‌రహ‌స్యాల‌ను విప్పి చెప్పే వ‌ర‌కు మ‌న‌కు క్లారిటీ రాలేదు. నారా వారి ప‌ల్లెలో పుట్టి, తిరుప‌తిలో చ‌దివి, హైద‌రాబాద్‌లో సెటిల్ కాబోయి తెలంగాణ దెబ్బ‌కు అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లో కాలువ‌ల వెంట‌, చెట్ల‌వెంట‌, పుట్ట‌ల వెంట తిరుగుతున్న సి.ఎం. బాబు ఒక తండ్రి, ఒక తాత‌, ఒక భ‌ర్త‌, ఒక అన్న అన్నిటికి మించి రాష్గ్రానికి ఒక పెద్ద దిక్కు. మాయాబ‌జార్‌లో ఘ‌ట్‌త్క‌చ ఎస్వీయార్ అద్భుతంగా చెప్పిన‌ట్లు ఎవ‌రూ పుట్టించ‌క‌పోతే భాషెలా వుడుతుంది ? బ‌ాబు తెలుగే ఒక భాష‌. దానిక‌దే ఒక భాష్యం వెయ్యండి వీర తాళ్లు రెండు భాష‌ను ఘ‌ట్‌త్క‌చుడికి వ‌దిలి బాబు భ‌క్తి భావంలోకి వ‌ద్దాం.


   మ‌ద్యం అమ్మ‌కాలు ప్ర‌భుత్వానిక‌యినా నా ప్రాణ‌వాయువు. 40 రోజులు మ‌ద్యం అమ్మ‌కాలు ప‌డిపోతే ముఖ్య‌బంత్రిగా బాబు బాధ‌ప‌డ‌క‌పోతే ఎలా ? మ‌ద్యం మానేయ‌డానికే అయ్య‌ప్ప మాల‌లు వేసుకుంటున్నార‌న్న ఆయ‌న మాట‌లు ఆణిముత్యాల్లో రాష్ట్రాభివృద్ధి  కుంటుప‌డుతుంద‌నే ఆవేద‌నే త‌ప్ప  నెగిటివ్ ఉండ‌డానికి వీల్లేదు. ఇలాంట‌ప్పుడే భావాల‌కు విస్తృత వ్యాఖ్యానాలు చెప్పే ప్ర‌వ‌చ‌న‌కారుల అవ‌స‌రం ఉంటుంది. కొద్దిగా ఆయ‌న భావాన్ని, ఆవేద‌న‌ను విడ‌మ‌రిస్తే మ‌ద్యం తాగే వారు తాగులూనే ఉండాలి. మ‌ధ్య‌లో కేవ‌లం 40 రోజులు మానేయ‌డం ఎందుకు ? త‌ఆగ‌ని వారిలో భ‌క్తిగ‌ల్గిన వారు, ఆ భ‌క్తి క‌ల్గిన వారిలో అయ్య‌ప్ప‌మాల వేయాల‌న్న సంక‌ల్పం ఉన్న వారిలో అయ్య‌ప్ప‌మాల వేయాల‌న్న సంక‌ల్పం ఉన్న వారు వేసుకుంటే ఇటు భ‌క్తికి భ‌క్తి అటు అబ్కారీ కిక్కు దిగ‌దు.

ఇక స‌న్‌రైజింగ్ రాష్ట్రంలో ఆల‌యాల హుండీ ఆదాయం పెరుగుతోందంటే బాబు భ‌య‌ప‌డ్డంలో విస్తృత సామాజిక విశాల హిత‌కోణ‌మే త‌ప్ప‌, ఆదాయం మీద యావ‌కానే కాదు. ఆయ‌నే చెప్పుకున్న‌ట్లు ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన హైద‌రాబాద్‌నే వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఉద్దండ‌రాయ పాలెం వెళ్లాల్సిన‌ప్పుడే తొడ‌కోసి మాంసం ముక్క ప‌క్షికి ఇచ్చిన శిబిచ‌క్క‌వ‌ర్తిలా ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఆయ‌న బాధ ప‌డ్డారే త‌ప్ప నాలుగు చిల్లి గ‌వ్వ‌ల గురించి ఏనాడూ ప‌ట్టించుకోలేదు. మోసాలు చేసి, హ‌త్య‌లు చేసి, మాన‌భంగాలు చేసి, దొంగ‌త‌నాలు, దోపిడీలు చేసి ఆ సొమ్ముతో దేవుడికి వాటా ఇవ్వ‌డం ధ‌ర్మం ఎంత ఒంటి కాలిమీద న‌డిచే రోజుల్లో అయినా జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే. ఆ మాటే ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా, రాష్ట్ర ప‌రువు ప్ర‌తిష్ట‌లు గంగ‌లో క‌ల‌వ‌కుండా హుందాగా, పాజిటివ్‌గా చెప్పారు. పైగా క‌ష్టాల‌నే ఇష్టాలుగా మ‌లుచుకుని జ‌పాన్‌, సాంగ‌పూర్‌, దావోస్ లాంటి దేశాల‌ను, ఆ దేశరాజ‌ధానుల‌ను అమ‌రావ‌తిలో పునఃప్ర‌తిష్ట చేయాల‌నుకుంటున‌ప్పుడు రాష్ట్ర‌ప్ర‌జ‌ల్లో ఇంత పాపం పెరిగితే ఏ మొహం పెట్టుకుని జ‌పాన్ డెస్క్‌, సింగ‌పూర్ టేబుల్‌, దావోస్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర బాబు నిలుచుంటారు ? వ‌ఇన‌డానికి మ‌న‌కే ఇబ్బందిగా ఉంటే అనుభ‌వించే ఆయ‌న‌కు తెలుస్తుంది ఆ బాధ ఎంతో !
      గుడి, మ‌సీదు, చ‌ర్చి లేక‌పోతే నిజంగా జ‌నం పిచ్చివాళ్ల‌య్యే వార‌న్న బాబు మాట‌ల్లో వేరే అర్థాలు వెతికితే క‌ళ్లు పోతాయి. ఏదిక్కూలేని వారికి దేవుడే దిక్కు. ఆయ‌న స‌రిగ్గానే అన్నారు. అయితే బాబు త‌త్వం బాగా తెలిసిన త‌త్వ‌ఙ్ఙ‌లు మాత్రం కొన్ని లోతైన విశ్లేష‌ణ‌లు చేశారు. 
      అయ‌ప్ప మాల‌ల స‌మ‌యంలో మ‌ద్యం అమ్మ‌కాలు ప‌డ‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌దే అన్న విష‌యం ఆయ‌న ప‌ద్ధతిలో చెప్పార‌ట‌. ఇక రెండోది ప్ర‌జ‌ల్లో పెరిగిన భ‌క్తిని ఎలా క్యాష్ చేసుకోవాలో అని బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌.
      ఇంకా చంద్ర‌బాబు లోప‌లి మ‌నిషిని కూడా చ‌ద‌వ‌గ‌లిగిన ఒక‌రిద్ద‌రు భ‌క్తి ఉత్స‌వాలు, జాత‌ర‌లు, పుష్క‌రాలు, పండుగ‌ల ద్వారా రేపొద్దున బి.జె.పి కి ఓట‌ర్లు మిగ‌ల‌కుండా చేయాల‌న్న‌దే అస‌లు వ్యూహ‌మ‌న్నారు.
   ఇందులో ఏదిఏదో విడ‌మ‌రిచి చెప్పే వ్యాక‌ర‌ణ పండితులు, ప‌ర‌వ‌స్తు మీడియా చిన్న‌య‌, పెద్ద‌యాసురుల‌కే అస‌లు విస‌యం తెలుస్తుంది.
    న్యాయం, ధ‌ర్మం, పాల‌న ప్ర‌భుత్వ విధి. ఇప్పుడు బాబు పుణ్య‌మా అని పాపం- పుణ్యం కూడా ముఖ్య‌మంత్రి విచోణ ప‌రిధిలోకి ప‌డిన‌ట్లుంది.
 అయ్యో పాపం- పుణ్యం !
 అయ్యో పాపం- ప్ర‌జ‌లు !!


  
 
      
Back to Top