చంద్రబాబు రుస రుస

రష్యానుంచి వచ్చాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా  మిత్రులతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు.
జర్నలిస్టులందరినీ డిన్నర్ కి పిలచి వారితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.
రష్యన్స్  ఏమన్నారు సార్ మిమ్మల్ని చూసి? అని ఓ జర్నలిస్ట్ అడిగారు.
దానికి చంద్రబాబు తనదైన శైలిలో.. ప్రపంచంలో టెక్నాలజీకి ఆది గురువు మనమే కదా..అది విషయం పై రష్యన్ పొలిటిషియన్లు నన్ను ఒకటే పొగడ్తలతో ముంచెత్తారు.
హై టెక్ సిఎంగా తొమ్మిదేళ్లు పని చేసి..ఇపుడు మళ్లీ రెండేళ్లుగా సిఎంగా కొనసాగుతున్నాను కదా టెక్నాలజీకి సంబంధించి తమకి సాయం చేయాలని వారంతా అడిగారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ కలుగ జేసుకుని అవును సార్ మీరేమో హైటెక్ సిఎం. ప్రపంచానికే హైదరాబాద్ ని ఐటీ హబ్ గా మార్చారు.  రాజకీయ పార్టీల్లో ముందుగా మీరే వెబ్ సైట్ కూడా పెట్టారు " అని పొగిడారు.
దానికి చంద్రబాబు మురిసిపోయి..అవును బ్రదర్. రేప్పొద్దున్న అమరావతిని కూడా ఐటీ హబ్ ని చేసేస్తాను. అపుడు హైదరాబాద్ లో ఐటీ బిజినెస్ పడిపోతుంది  అపుడు మనమే నంబర్ వన్ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఇబ్బందిగా నవ్వేసి.. అది కాదు సార్.. మీరేమో ఇంత హైటెక్ కదా మీ పార్టీ వెబ్  సైట్ ఏంటి సార్  అలా ఉంది అని అడిగారు.
చంద్రబాబుకి  కంగారొచ్చింది.
పార్టీ వెబ్ సైట్ కి ఏమైందయ్యా?   ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉంటారే అని అనుమానంగా అడిగారు చంద్రబాబు.
సీనియర్ జర్నలిస్ట్  నవ్వేసి అది కరెక్టే కానీ..ఈ మధ్య అన్నీ తప్పులుంటున్నాయండీ బాబూ అన్నారు.
చంద్రబాబుకి అసహనం వచ్చింది. 

ఏం తప్పులున్నాయి  బ్రదర్ అని ఆరా తీశారు.
" మీ పార్టీ వెబ్ సైట్ లో ఎంపీల లిస్ట్ చూడండి సార్. ఏపీలో  ఏమో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్పీ వై రెడ్డిని మీ పార్టీ ఎంపీల జాబితాలో పెట్టేశారు మీ వాళ్లు" అన్నాడు.
దానికి చంద్రబాబు నవ్వేసి ఓస్ అదా..అది తప్పు  కాదయ్యా బాబూ.. ఆయన మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. టెక్నికల్ గా ఆయన వై.ఎస్.ఆర్.పార్టీ సభ్యుడే అయినా  నైతికంగా మా పార్టీ ఎంపీయే అవుతారు. అన్నారు చంద్రబాబు

"మరి తెలంగాణ ఎంపీల లిస్ట్ లో మీ పార్టీనుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసపోయిన మల్లారెడ్డి పేరును మీ జాబితాలోనే ఉంచారేంటి? అని అడిగారు మరో జర్నలిస్ట్.
చంద్రబాబు కర్చీప్ తీసుకుని నుదుటిపై చెమట తుడుచుకుని...మల్లా రెడ్డి ఇప్పటికీ టిడిపి ఎంపీయే.ఏం ఆయన టిడిపి పార్టీని విడిచి పెట్టినట్లు మీకేమన్నా చెప్పారా? అని ఎదురు ప్రశ్నించారు చంద్రబాబు.
"అదేంటి సార్...ఆయన కేసీఆర్ తో కలిసి  అభివృద్ధికోసం టి.ఆర్.ఎస్.లో చేరుతున్నానని అన్నారు కదా."
అదంతా మీడియా కుట్రే బ్రదర్. పాపం మల్లారెడ్డి అలా అనలేదు. ఆయన ఎప్పటికీ టిడిపి ఎంపీయే.
ఇంకో ప్రశ్న అడగాలా వద్దా అని మరో జర్నలిస్ట్ తటపటాయిస్తోంటే..చంద్రబాబే జోక్యంచేసుకుని ఏంటి బ్రదర్ ఏమన్నా ప్రశ్నలుంటే అడగండి ఏం ఫర్వాలేదు అని భరోసా ఇచ్చారు.
ఆ జర్నలిస్ట్ హాయిగా ఊపిరి పీల్చుకుని మరీ మీ పార్టీ వెబ్ సైట్ లో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్ అప్ డేట్ చేయలేదా సార్ " అని  అడిగారు.
చంద్రబాబు ముఖం మాడ్చుకుని ఎవరు చెప్పారయ్యా అప్ డేట్ చేయలేదని.
2014లో మేం తెలంగాణలో 15  అసెంబ్లీ నియోజక వర్గాల్లో  గెలిచాం.
ఇపుడూ 15 మంది ఎమ్మెల్యేల జాబితానే అందులో ఉంచాం. అందులో తప్పేముంది? అని ఆరా తీశారు.
జర్నలిస్ట్ కొంచెంద తడబడి.." అది కాదు సార్...ఇపుడు తెలంగాణ లో   మీ పార్టీకి మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే కదా. ఆ ముగ్గురిలో కూడా  రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య లు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకోవడం వల్లనే టి.ఆర్.ఎస్. లో చేరడానికి వీలు లేకపోయిందటకదా..మిగతా 12 మంది ఎమ్మెల్యేలూ టి.ఆర్.ఎస్. లో చేరిపోయారు కదండీ బాబూ అని అడిగారు.
దానికి చంద్రబాబు పూనకం వచ్చినట్లు ఊగిపోయి " ఎవరయ్యా నీకు చెప్పింది. 12 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ టికెట్ పై గెలిచారు. వాళ్లు మా పార్టీకి రాజీనామా చేసి..టి.ఆర్.ఎస్. లో చేరి మళ్లీ ఎన్నికల్లో గెలవమనండి  అప్పుడు తెలుస్తుంది ఎవరి బలం ఏంటో" అని సీరియస్ గా ఛాలెంజ్ చేశారు.
ఓ పెద్ద జర్నలిస్ట్ లేచి మరి ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంటోంది కదా సార్. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుండి మీరు చాలా మంది ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొన్నారు కదా. వారందరి చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది కదా" అని నిలదీశాడు.
చంద్రబాబు కి ఒళ్లు మండిపోయింది.
చేతిలో గ్లాసు నేలకేసి కొట్టారు.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్..మేమూ ఒకటేనా?
మేం అందరి కన్నా ఎక్కువ. మీరు చెప్పే బోడి రూల్స్ మాకు వర్తించవు.
అయినా మర్యాదగా  భోజనానికి పిలిస్తే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు .తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం మీరు. అసలు మీరు ఏ పత్రిక నుంచి వచ్చారు?  ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను అని సీరియస్ గా నడుచుకుంటూ పోయి కారెక్కేశారు. అందరూ పిలుస్తోన్నా వినిపించుకోకుండా కారులో వేగంగా ఆగకుండా వెళ్లిపోయారు.

Back to Top