తడబడి ఒరవడి


నేడు రాష్ట్రం ఎలాంటివాళ్ల చేతుల్లో ఉందంటే వదంతికీ, వర్థంతికీ తేడా తెలియని వాళ్ల చేతుల్లో. చంద్రబాబు మాటలు వింటే ఆయనది అమాకత్వమా లేక అతి మూర్ఖత్వమా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఇన్ని తప్పులు, పొరపాట్లు ఉండటం మామూలు విషయం కాదని కూడా చెబుతున్నారు. 

రాజధాని ప్రాంతంలో
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటోందని, దానిని 10 డిగ్రీలు తగ్గిచి 30 డిగ్రీలు
చేయాలంటూ రెండు రోజులు క్రితం బాబు తనదైన శైలిలో హుకుం జారీ చేశారు. ఇది ఎలా సాధ్యమో
అర్థం కాక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు శైలి చూస్తే,
వయసు పైబడ్డ వృద్ధులు చేసే వ్యాఖ్యలే గుర్తుకు వస్తున్నాయి. 


నంద్యాల ఎన్నికలప్పుడు చంద్రబాబు మాటలు గుర్తుండే ఉంటాయి. తమ పార్టీని గెలిపించకపోతే తానేసిన రోడ్లమీద నడవద్దని హుకుం జారీ చేసారు బాబుగారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే తానో రాచనగరికి రాజని అనుకుంటున్నారేమో నని ప్రజలకు అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే రాజధానికి అమరావతి అని పేరు పెట్టుకోవడం వల్లా, పచ్చపత్రికలు అమరావతీధీశా అంటూ భుజకీర్తులు తగిలించి, బృందగానాలు చేయడం వల్లా ఆయనకు అలా అనిపించి ఉండవచ్చు అని సర్ది చెప్పుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సొమ్ముతో, ప్రజలిచ్చిన అధికారంతో పదవులు వెలగబెడుతూ, ప్రజాధనంతో జరిగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా తన సొంత అక్కౌంట్ లో జమ చేసుకునే బాబును చూసి ముక్కున వేలేసుకోని వారు లేరు. 

బాబుగారి మేధో మధనం అక్కడితో ఆగలేదు. భవిష్యత్ ఎన్నికల్లో నాకెందుకు ఓటేయరు? అంటూ ప్రజలను ప్రశ్నించే స్థాయికీ చేరిందది. తానో శ్రమ జీవినని ఆయన స్వంత ఉద్దేశ్యం. నిత్యం 28 గంటలు పనిచేసే తన శ్రమకు తగ్గ కూలీ ఇవ్వాల్సింది తెలుగు ప్రజలే అని ఆయన డిసైడైపోయారు. 

అధికారుల వద్ద దర్పం ప్రదర్శించడంలోనూ బాబు ఎక్కడా తీసిపోరు. విదేశాలకు చంద్రబాబు వెళితే ఎప్పుడు దేన్ని ఆంధ్రాకి తెమ్మంటారో అని అధికారులు బెంబేలెత్తుతుంటారు. ప్రపంచ రాజధాని కలలు కంటూ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్న బాబు ఏ దేశంలో ఏ కట్టడం , ఏ ప్రాంతం, టెక్నాలజీ నచ్చితే దాన్ని ఎపికి తెచ్చేద్దాం, అమరావతిలో పాతేద్దాం అంటూంటారు. ఇంగ్లండ్ వెళ్లి లండన్ ఐ, దుబాయ్ వెళ్లి బుర్జ్ ఖలీఫా, జపాన్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ , చైనా వెళ్లి బాటరీ కార్ ఇలా కంటికి నచ్చినదాన్ని తెచ్చేద్దాం అంటూ అధికారులకు ఆజ్ఞలు జారీ చేస్తుంటారు. దాంతో వాళ్లు కక్కలేక మింగలేక తలలూపుతుంటారు. 

చంద్రబాబుకున్న సాంకేతిక పరిజ్ఞానం మాటేమో కానీ, తెలుగు పరిజ్ఞానం మాత్రం శూన్యం అని అర్థం అవుతూ ఉంటుంది. బమ్మెర పోతన రామాయణం రాశాడంటాడాయన.  ఒలంపిక్స్ లో గెలిస్తే నోబెల్ బహుమతి ఇప్పిస్తానని కూడా అంటారు. ఆట్టే మాట్టాడితే అమరావతిలోనే ఒలంపిక్స్ నిర్వహిస్తానని కూడా చెప్పేసారు. టిడిపి స్వాతంత్య్రయుద్ధం చేసిందని, బ్రిటిష్ వారితో పోరాడిందని కూడా నొక్కి వక్కాణించారు. జాతీయ రహదారులను జాతీయం చేసే ఆలోచనకూడా ఆయనకుందని ఈ మధ్యే తన మనసులోని మాటనూ బైటపెట్టారు చంద్రబాబు. ఆయన ఆవేశ పూరిత ప్రసంగాల్లో ఒక్కోసారి నిజాలు వెల్లువలా ఊడిపడతాయి. రాష్ట్రానికి అన్యాయం చేయమని అడిగానని ఉగాది పండుగ సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు. అలాగే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్న విషయాన్నీ పబ్లిక్ గా అసెంబ్లీలోనే ప్రకటించారు. రాష్ట్రాన్నే కాదు భారత దేశాన్ని కూడా అవినీతి భారతదేశంగా తయారు చేసే వరకూ నిద్రపోనని ప్రతిన పూనారు. 

 
Back to Top