అమరావతి మరో మాహిష్మతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ….ముద్దుగా సి.ఆర్.డి.ఎ. గత మూడేళ్లలో పదుల సార్లు విదేశీ పర్యటను చేసారు ఈ శాఖాధికారులు. కాని ఇంత వరకూ రాజధాని డిజైన్ మాత్రం ఫైనల్ కాలేదు. బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ టూర్ పేరుతో ఇప్పటికి ఎన్నోసార్లు లండన్, చైనా, సింగపూర్ లు తిరిగినా వారికి రాజధాని నిర్మాణానికి సరైన మోడలే కనబడలేదు. ఇక ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే కుటుంబంతో కూడా వెళ్లి చూసొచ్చారు. అమరావతికి పనికొచ్చేలా ఒక్క సిటీ మ్యాప్ కనబడలేదాయనకు. ఆయన కలల్లో, ఊహల్లో ఉన్న సౌధాలు ఆయా దేశ ప్రధాన నగరాల్లో లేవని పెదవి విరిచారు. బాహుబలిలో రాజమౌళి రాజసౌధాలను చూసిన కళ్లతో మరేది చూసినా ఆనడం లేదాయనకు. అవి సెట్టింగులు మహాప్రభో అని సాక్షాత్తూ జక్కన్నే చెప్పినా చెవికెక్కించుకోడం లేదు బాబుగారు. చాక్లెట్ కావాలనే చిన్నపిల్లాడిలా ‘నాకు అలాంటి అమరావతే కావాలి…రాజమౌళిని తెచ్చి అలాగే డిజైన్ చేయమనండి’ అని భీష్మించుక్కూచున్నారు. దాంతో అధికారులు ఆఘమేఘాలమీద రాజమౌళిని కలిసి, మాతో లండన్ కి రండి, నార్మన్ ఫోస్టర్ ప్రధాన కార్యాలయానికెళ్లి మీ మాహిష్మతిని చూపించి, అచ్చం అలాంటి అమరావతి కావాలని వాళ్లకి అర్థం అయ్యేలా చెప్పండి అంటూ బతిమాలుకున్నారు. 

ఇదెక్కడి పితలాటకంరా బాబూ అనుకుంటూ తలపట్టుకుంటున్నాడు రాజమౌళి. మునుపోసారి ఇలాగే అంటే అట్టముక్కలతో సెట్టింగులే కాని, అమరావతి బిల్డింగులు నాపని కాదని తప్పుకున్నాడు జక్కన్న. కాని బాబు వదిలితే కదా…జక్కన్నా నిన్నొదల…అంటూ జబ్బపుచ్చుకుని లాక్కుని మరీ లండన్ తీసుకెళ్లమని అధికారులను ఆదేశించాడు. వాళ్లంతా వెళ్లి రాజమౌళి ముందు బైఠాయించారు. మీరే ఏదో ఒకటి చేయాలి. కనీసం మాతో అలా లండన్ దాకా ప్రయాణం అన్నా చేయాలి…లేదంటే బాబుగారు మా పోస్టులు ఊస్టులు చేస్తారు అని మొత్తుకున్నారు. ఈ గోలపడలేని ఆ మెగా దర్శకుడు ముందు నన్ను కాస్త ముఖ్యమంత్రిగారితో మాట్లాడనీయండి అని సి.ఆర్.డి.ఎ అధికారులను బుజ్జగించి పంపేశాడు. ఇది నా పని కాదని వెళ్లి ముఖ్యమంత్రిగారితో మొరపెట్టుకున్నాడు …ముందు మీరు అమరావతిని ఓ లుక్కేయండి…మాహిష్మతిని తలదన్నే ఐడియా మీకేమైనా రావచ్చేమో అన్నాడు బాబు పట్టు వదలకుండా. బాబు దగ్గర బలైపోయాను బాబోయ్ అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ అమరావతి అంతా చూసొచ్చాడు రాజమౌళి. ఏమనిపించింది మీకు…ఏదైనా థాట్ వచ్చిందా ఆసక్తిగా అడిగాడు చంద్రబాబు…చెప్పాను కదండి ఏదో సినిమా కోసం అంటే పేపర్ మీద గీసుకుని, గ్రాఫిక్స్ తో చేసుకుని పెద్ద పెద్ద కోటలు కట్టగలం కాని ఎన్నో ఏళ్ళ పాటు ఉండాల్సిన రాజధానిని నన్ను డిజైన్ చేయమంటే ఎలా అన్నాడు జక్కన్న.  వీల్లేదు చరిత్రలో నా పేరు చిరగకుండా ఉండేలా అమరావతి రాజధాని డిజైన్ మీరు చేయాల్సిందే ఇదే నా మాట.. నా మాటే శాసనం అని బాహుబలిలో రాజమాత శివగామిని గుర్తు చేసుకుంటూ అన్నాడు చంద్రబాబు. అలా అయినా రాజమౌళి కన్విన్స్ అవుతాడేమో అని. సీఎం గారు ముందు మీరు ఆ బాహుబలి ఫీవర్ నుంచి బయటకు రండి చిరాకుపడ్డాడు రాజమౌళి. సరే అయితే అమరావతి డిజైన్ మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అడిగాడు చంద్రబాబు పట్టు వదలకుండా. మళ్లీ సాయంత్రం వచ్చి చెబుతాను సిఎమ్ గారూ అని అప్పటికి బైటపడ్డాడు దర్శక దిగ్గజం. సాయంత్రం వస్తూ మాహిష్మతికి మమ్మీలాంటి డిజైన్ తెస్తాడు రాజమౌళి అనుకుంటూ ఆనందంగా ఎదురుచూస్తున్నాడు చంద్రబాబు…చూద్దాం ఏమౌతుందో…!!!!

Back to Top