అమ్మ బ్రహ్మ దేవుడో..కొంప ముంచినావురో..!

అమరావతి నగర నిర్మాణం గురించి అధికారులతో మీటింగుల మీద మీటింగులు పెట్టి బాగా అలిసిపోయిన చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీస్ లో రిలాక్స్ అవుతున్నారు.సరిగ్గా ఆ సమయానికే ఆయన ఆస్థాన పండితుడు అక్కడికి వచ్చారు.ఆయన్ని చూడగానే చంద్రబాబుకు ఏదో గుర్తుకు వచ్చింది.
"పండిత వర్యా నేను జీవించి ఉన్నంత కాలం నేనే ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండాలి" దానికి నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు.
పండితుడు ఒక్క క్షణం ఆలోచించి...అయ్యా తమరు హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకోగలిగితే మీ కోరిక నెరవేరుతుంది"అని చెప్పాడు.
చంద్రబాబు ఆలస్యం చేయలేదు కేబినెట్ లో బాగా నమ్మకమైన ఇద్దరు మంత్రులను పిలిచి
" నేను  కొంతకాలం ఓ సీక్రెట్ పని మీద వేరే చోటకి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా  ఓటుకు నోటు కేసులూ గట్రా ముందుకు వెళ్లకుండా..మన కొంపలు అంటుకోకుండా బాగా చూసుకోండి " అని ఆదేశించారు.
ఆ ఇద్దరు మంత్రులూ  "అలాగే సార్ " అంటూ బయటకు వచ్చేసి.."ప్రత్యేక హోదా కోసం పాపం ఎంతగా తపిస్తున్నారో దాని గురించే వెళ్తున్నట్లున్నారు" అని అనుకున్నారు.
ఆ మాటలు లీలగా వినిపించి చంద్రబాబు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు నాయుడు హిమాలయాలకు బయలు దేరారు.దానికి ముందే గతంలో హిమాలయాలు వెళ్లిన ఓ మునీశ్వరుని దగ్గరకు వెళ్లి తను చేయబోయే తపస్సు గురించి వివరించి "స్వామీ నన్ను హిమాలయాలకు తీసుకెళ్లి ఓ దారి చూపించండి "అని వేడుకున్నారు.
"అలాగే నాయనా కానీ అక్కడి దాకా వెళ్లాక గురు దక్షిణ చెల్లించుకోవాలి సుమా" అని షరతు విధించాడు.
మునీశ్వరుడు చంద్రబాబును హిమాలయాల దాకా తీసుకెళ్లాడు."చూడు నాయనా ఇక్కడితో నా పని అయిపోయింది. నువ్విక మరో మునిని పట్టుకుని హిమాలయాలు ఎక్కాలి." అని  చెప్పాడు.
"అలాగే స్వామీ "అని చంద్రబాబు అక్కడి నుంచి బయలు దేరబోయారు.
మునీశ్వరుడు కంగారుగా "నాయనా మరి నా దక్షిణ" అని  మొహమాటపడుతూ అడిగాడు.
చంద్రబాబు నవ్వేసి దాందేముంది "మునీశ్వరా ముందు నా తపస్సు అయిపోనీండి ఆ తర్వాత మీకు ఏపీ రాజధానిలో పెద్ద ఆశ్రమం కట్టించి ఇస్తాను"  అనేసి మునీశ్వరుడి కేసి చూడకుండా అక్కడి నుంచి కదిలిపోయారు.
హిమాలయాలా పాదాల దగ్గర మరో మునీశ్వరుని పరిచయం చేసుకున్న చంద్రబాబు హిమాలయాల పైకి దారి చూపించి పుణ్యం కట్టుకోండి స్వామీ అని వేడుకున్నారు."అలాగే చూపిస్తాను కానీ అక్కడి దాకా వెళ్లాక గురు దక్షిణ ఇచ్చుకోవలసి ఉంటుంది నాయనా" అని మునీశ్వరుడు అన్నాడు.అలాగేనని తలూపి మునీశ్వరునితో పాటు హిమాలయాలు ఎక్కారు చంద్రబాబు.
అక్కడ ఒకరి కొకరు దూరంగా చాలా మంది తపస్సులు చేసుకుంటున్నారు."ఇదే నాయనా నేను తీసుకు రావలసిన చోటు. ఇక ఇక్కడ తపస్సు ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఇక్కడ ఎవరినైనా అడిగి తెలుసుకో నా దక్షిణ నాకిస్తే నే వెళ్లిపోతాను "అన్నాడు మునీశ్వరుడు
అలాగే ఇస్తాను మునీశ్వరా ఒక్క సారి కళ్లు మూసుకోండి అన్నారు చంద్రబాబు." మునీశ్వరుడు కళ్లు మూసుకున్నాడు." అంతే మునీశ్వరుడు ఎవరో తోసినట్లుగా హిమాలయాల పై నుంచి కింద పడిపోయాడు.
ఓ చోట  తపస్సు చేసుకుంటోన్న ముని దగ్గరకు వెళ్లి చంద్రబాబు "నన్ను కరుణించండి స్వామీ "అని దండం పెట్టారు. చంద్రబాబు వినయం చూసి మునీశ్వరుడు పొంగి పోయాడు. ఏం కావాలి నాయనా అని అడిగాడు. స్వామీ నేను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయాలి. దానికి మీ ఆశీర్వచనాలు కావాలి అన్నాడు. దానికి మునీశ్వరుడు సంతోషించి నాయనా తపస్సు చేయాలంటే కమండలం..రుద్రాక్ష మాల ఉండాలి. నీదగ్గర రెండూ లేవు. నా దగ్గర రుద్రాక్ష మాలలయితే రెండున్నాయి కానీ..కమండలం లేదు. మరెలా" అని అడిగాడు.
ఈ విషయం చెప్పనందుకు హిమాలయాల పాదాల దగ్గరి మునీశ్వరునిపై లోలోపలే మండి పడ్డారు చంద్రబాబు. అయితే దాన్ని బయటకు కనిపించనీయకుండా " స్వామీ ప్రయాణపు హడావిడిలో ఆ రెండూ మర్చిపోయాను. మీ కమండలం ఓ సారిస్తే..అదే రకమైన కమండలం చేయించుకుని వచ్చేస్తాను అని ప్రాధేయ పడ్డాడు." అంతా విన్న మునీశ్వరుడు "సరే నేనిక్కడే కళ్లుమూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటాను..నా కమండలం నాకు తెచ్చి ఇచ్చేయ్ "అని ధ్యానంలో మునిగిపోయాడు.
ధ్యానంలో ఉన్న మునీశ్వరుని తలపై వెనక నుంచి ఎవరో దేనితోనో గట్టిగా కొట్టారు. అంతే మునీశ్వరుడు తుది శ్వాస విడిచాడు.
మునీశ్వరుడు అంతకు ముందు వరకు తపస్సు చేసిన చోట చంద్రబాబు కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.
బాబు ఘోరతపస్సుకు ముగ్ఢుడైన బ్రహ్మ వెంటనే ప్రత్యక్ష మయ్యాడు.
"ఏం కావాలి నాయనా? "అని ఆప్యాయంగా అడిగాడు బ్రహ్మ
శషభిషలేవీ లేకుండా " స్వామీ నేను జీవించి ఉన్నంత కాలం ఆంధ్ర ప్రదేశ్ కి నేనే సిఎంగా ఉండేలా వరమియ్యి స్వామీ" అని చేతులు జోడించి కోరుకున్నాడు.
బ్రహ్మ చిరునవ్వు చిందించి తథాస్తు అన్నాడు. అని చూడు నాయనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే ముందు మూడు నిజాలు చెప్పు నాయనా  ఆ మూడు నిజాలతో నువ్వు నిండు నూరేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటావు అన్నాడు.
చంద్రబాబు సంబరంతో పొంగిపోయి అలాగే స్వామీ అని చెప్పడం మొదలు పెట్టాడు.
స్వామీ మొదటి నిజం నేను జీవితాంతం నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేశాను. ఎన్నడూ అవినీతి అన్నదే ఎరుగను.
ఇక రెండో నిజం చెప్తాను స్వామీ. నేను మొన్న ఎన్నికల్లో గెలవగానే..రైతులు..డ్వాక్రామహిళలకు నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి రికార్డు సృష్టించాను.
ముచ్చటగా మూడో నిజం స్వామీ." నేను ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం  బిజెపి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తున్నాను" అన్నాడు చంద్రబాబు నాయుడు.
బ్రహ్మదేవుడు చంద్రబాబు వైపు మెచ్చుకోలుగా చూస్తుండగానే చంద్రబాబు కల్పించుకుని మీరు మూడు నిజాలు అడిగారు నేను మరో నిజం చెప్తాను " నాకు చిన్నప్పటి నుంచీ కూడా నాకు దారి చూపిన గురువులను భక్తి ప్రపత్తులో కొలిచాను" అన్నాడు.
బ్రహ్మదేవుడు నవ్వి మంచిది నాయనా ఇక నువ్వు ఏపీకి వెళ్లు  నీ కోరిక సిద్ధిస్తుందని ఆశీర్వదించాడు.
అక్కడి నుంచి ఆగమేఘాల మీద చంద్రబాబు ఏపీలోని క్యాంప్ ఆఫీస్ కు వచ్చి తనలో తానే విజయానందంతో వికటాట్టహాసం చేశాడు.
అంతలో  అశరీర వాణి ఒకటి పలికింది."ఎందుకు నాయనా అలా నవ్వుతున్నావు అని ఆ వాణి అడిగింది
"ఇక నాకు తిరుగులేదు. జీవించినంతకాలం ఏపీకి నేనే సిఎం అన్నాడు చంద్రబాబు నాయుడు.దానికి అశరీర వాణి పగలబడి నవ్వింది.పగటి కలలు కంటున్నావా నాయనా అని అడిగింది.
చంద్రబాబుకు అనుమానం..కోపం..కలగలిపి వచ్చాయి. ఒక్క సారి బ్రహ్మదేవుని తలచుకున్నాడు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు."అశరీర వాణి చెప్పింది చెప్పి ఏంటి స్వామీ సంగతి" అని అడిగాడు చంద్రబాబు.బ్రహ్మ నవ్వి అశరీర వాణి అంటే మా దేవలోకపు రేడియోనే నాయనా.అందులోంచి ఏం వినపడినా అది వాస్తవమే" అన్నాడు.
"చంద్రబాబు కోపంతో ఊగిపోయాడు. అన్యాయం. మరి మీరు నాకు వరమిచ్చారు కదా అని నిలదీశాడు.దానికి బ్రహ్మదేవుడు పగలబడి నవ్వి "చూడు నాయనా నువ్వుకూడా ఎన్నికల సమయంలో ఎన్నో వరాలు ఇస్తూనే ఉంటావు. కానీ ఏదీ అమలు చేయవు కదా.పైగా నువ్వు నిజాలు చెప్తున్నానని చెప్పి నా దగ్గరే అబద్ధాలు చెప్పావు.అందుకే నీకిచ్చిన వరం కేన్సిల్ చేశాను "అన్నాడు.
"దేవుళ్లు కూడా అన్యాయం చేస్తారా అని చంద్రబాబు అసహనంగా అడిగాడు.దానికి బ్రహ్మ చిరునవ్వు నవ్వి "నాయనా  ప్రశాంతం. నేను పుట్టించిన నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే....మరి నాకెన్ని తెలివితేటలు ఉండాలో చెప్పు? పైగా నాకు నాలుగు తలలు కూడానూ "అనేసి మాయమైపోయాడు.
చంద్రబాబు మొహంలో కత్తి గాటుకు నెత్తుటి చుక్క లేదు.
-కవి కాకి
Back to Top